వైయస్సార్లా నన్నూ గుండెల్లో పెట్టుకోండి!
on Feb 1, 2019
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి తెలుగు ప్రజలు తమ హృదయాలలో చోటు ఇచ్చారని.. అదేవిధంగా తనకు వారి హృదయాలలో చోటు ఇస్తారని, తనను గుండెల్లో పెట్టుకుంటారని భావిస్తున్నట్టు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అన్నారు. వైయస్సార్ పాత్రలో ఆయన నటించిన సినిమా 'యాత్ర'. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించారు. విజయ్ జిల్లా, శశిదేవి రెడ్డి నిర్మించారు. వైఎస్ఆర్ పాదయాత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో జరిగింది. మమ్ముట్టి మాట్లాడుతూ "వైయస్సార్ పై చూపించిన ప్రేమ లో ఒక్క శాతం ప్రేమ నాపై చూపిస్తే చాలు. ఆయన్ను ప్రేమించిన దానిలో ఒక్క శాతం నన్ను ప్రేమిస్తే చాలు. మా పని పూర్తయింది. ప్రేక్షకులే సినిమాను హిట్ చేయాలి. ఈ చిత్రంలో నేను వైయస్సార్ ను ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించలేదు. నా శైలిలో నేను నటించా. షూటింగ్ ప్రారంభానికి ముందు డైలాగులు తీసుకుని నేర్చుకున్నాను" అన్నారు.