బాలీవుడ్ ఎంట్రీపై మళ్ళీ మహేష్ ఏమన్నాడు?
on Apr 3, 2019
బాలీవుడ్ హీరోలా ఉంటాడని మహేష్ బాబు గురించి అభిమానులు చెప్పుకుంటారు. ప్రేక్షకుల ఫీలింగ్ కూడా అదే. హిందీ హీరోలకు ఏ మాత్రం తీసిపోని విధంగా మహేష్ అభినయం, ఆహార్యం ఉంటాయి. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ సూపర్ స్టార్ కి అభిమానులు ఉన్నారు. మహేష్ స్ట్రయిట్ హిందీ సినిమా చేస్తే చూడాలని ఉత్తరాది అభిమానుల కోరిక. ఎప్పటినుంచో తనకు హిందీ సినిమా చేసే ఉద్దేశం లేదని, తెలుగు పరిశ్రమ పైనే దృష్టి పెడుతున్నానని మహేష్ చెబుతూ వస్తున్నాడు. మరోసారి అదే మాట చెప్పాడు. అయితే... ఈసారి కొంచెం కొత్తగా చెప్పాడు. తాను హిందీ సినిమా చేస్తానని అనుకోవడం లేదని కుండబద్దలు కొట్టాడు. ఇప్పుడు దక్షిణాది పరిశ్రమ పెద్దదవుతోందని, అద్భుతమైన కథతో దక్షిణాదిలో సినిమా చేస్తే భారతీయ ప్రేక్షకులు అందరూ చూస్తున్నారని మహేష్ పేర్కొన్నాడు. బాహుబలిని ఉద్దేశిస్తూ రాజమౌళి ఒక దారి చూపించాడన్నారు. తాను దక్షిణాదిలోనే మంచి మంచి చిత్రాలు చేయాలనుకుంటున్నట్లు మహేష్ స్పష్టం చేశాడు.