'మజిలీ'ని వాయిదా వేయమంటే...
on Apr 3, 2019
'మజిలీ'కి గోపీసుందర్ మంచి పాటలు ఇచ్చారు. నేపథ్య సంగీతం దగ్గరకు వచ్చేసరికి హ్యాండ్ ఇచ్చారు. చివరి నిమిషంలో తమన్‌ను రిక్వెస్ట్ చేస్తే... రీరికార్డింగ్ చేశాడు. 'మజిలీ'కి గోపీసుందర్ హ్యాండ్ ఇవ్వడానికి కారణం ఇతర భాషల్లో, ముఖ్యంగా మలయాళంలో అతను చేస్తున్న సినిమాలే. తెలుగులో 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు', 'ఊపిరి', 'భలే భలే మగాడివోయ్', 'నిన్ను కోరి', 'మజ్ను', 'గీత గోవిందం' సినిమాలతో గోపీసుందర్ పేరు తెచ్చుకున్నాడు. తెలుగులోకి రావడానికి ముందే మలయాళంలో పేరున్న సంగీత దర్శకుడు. అక్కడ ఏడాదికి మినిమమ్ అరడజను సినిమాలు చేస్తాడు. ప్రస్తుతం అతడి చేతిలో ఆరు మలయాళ సినిమాలు ఉన్నాయి. ఆ సినిమా పనులతో 'మజిలీ'కి టైమ్ కేటాయించలేకపోయాడు. "సినిమా విడుదల వాయిదా వేయడం కుదురుతుందా? నాకు రీ రికార్డింగ్ చేయడానికి కొంత టైమ్ కావాలి" అని 'మజిలీ' దర్శకుడు శివ నిర్వాణను గోపీసుందర్ అడిగారు. వాయిదా వేయడం ఇష్టం లేక తమన్ దగ్గరకు వెళ్లారు.
"మా సినిమా నెల క్రితమే రెడీ అయ్యింది. అప్పుడు గోపీసుందర్ ను రీ రికార్డింగ్ చేయమని అడిగాను. ఒక్క పది రోజులు వెయిట్ చేయమన్నారు. తరవాత 'శివ... నాకు ఇంకొంచెం టైమ్ కావాలి. రిలీజ్ పోస్ట్‌పోన్ చేస్తావా?' అని అడిగారు. వేసవిలో వస్తున్న తొలి సినిమా మనది. విడుదల వాయిదా వేయడం ఇష్టం లేక, 'నేను మరో సంగీత దర్శకుడితో రీ రికార్డింగ్ చేయించుకుంటా' అని చెప్పాను. మా మధ్య సమస్యలు ఏమీ లేవు" అని శివ నిర్వాణ చెప్పారు.