ఏమీ సేతుర ‘లింగ’?
on Nov 18, 2014
విడుదలయ్యాక పరిస్థితి ఎలా వుంటుందోగానీ, రజనీకాంత్ హీరోగా కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లింగ’ సినిమా మీద తెలుగు ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఇక తమిళనాడు ప్రేక్షకులైతే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆవురావురుమంటూ ఎదురుచూస్తున్నారు. ఇన్ని అంచనాలు, ఎదురుచూపులున్న ఈ సినిమా ఆడియో ఈమధ్య విడుదలైంది. తమిళనాడు సంగతి తెలియదుగానీ, తెలుగు పాటలు మాత్రం ‘ఎక్కేలా’ లేవని సంగీత ప్రియులు అంటున్నారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా పాటలు ఊహించిన స్థాయిలో లేవని పెదవి విరుస్తున్నారు. రెహమాన్ ఏదో అద్భుతం చేసి వుంటాడని పాటలు వింటే ఈ సంగీతం సమకూర్చింది రెహమానేనా అనే సందేహం వచ్చిందని పలువురు అంటున్నారు. అయితే ఈ సినిమా వర్గాలు మాత్రం వినగ వినగ పాటలు గొప్పగా వుండు అంటున్నారు. సినిమా విడుదలైన తర్వాత పాటల రేంజ్ పెరిగిపోతుందని చెబుతున్నారు. పోనీలే అలా జరిగినా సంతోషమే. ఈ సినిమా పాటలు హిట్టయి, సినిమా కూడా హిట్టయితే సినిమా రంగానికి అంతకన్నా కావల్సింది ఏముంటుంది? అంతా బాగుంటే పర్లేదు.. లేకపోతే ఏమి సేతుర లింగ అని పాడుకోవాల్సి వస్తుంది.