ENGLISH | TELUGU  

త‌ప్ప‌కుండా చూడాల్సిన త‌మిళ డ‌బ్బింగ్ సినిమాలివే...

on Mar 21, 2020

 

ఇప్పుడంటే త‌మిళం నుంచి తెలుగుకు వ‌చ్చే డ‌బ్బింగ్ సినిమాల హ‌వా త‌గ్గిపోయింది కానీ, ఒక‌ప్ప‌డు ఆ డ‌బ్బింగ్ సినిమాలు తెలుగు సినీ నిర్మాత‌ల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించాయి. తెలుగు సినిమాల కంటే త‌మిళం నుంచి అనువాదం రూపంలో వ‌చ్చిన అనేక సినిమాలు నిర్మాత‌ల ఆ మాట‌కొస్తే టాప్ తెలుగు హీరోలను ఆందోళ‌న‌లో ప‌డేశాయ‌నేది నిజం. ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్‌, అర్జున్‌, విక్ర‌మ్‌, సూర్య‌, ప్ర‌భుదేవా వంటి హీరోల సినిమాలు తెలుగులోనూ క్రేజ్ తెచ్చుకున్నాయి. త‌ర్వాత కాలంలో విశాల్‌, కార్తీ, ధనుష్ వంటి హీరోల సినిమాలూ ఇక్క‌డ హిట్ట‌యిన సంద‌ర్భాలున్నాయి. ఇక డైరెక్ట‌ర్ల‌లో మ‌ణిర‌త్నం, శంక‌ర్‌, కె.ఎస్‌. ర‌వికుమార్ వంటి ద‌ర్శ‌కుల సినిమాల‌కు ఇక్క‌డ బాగా డిమాండ్ ఉండేది. అలా తెలుగు ప్రేక్ష‌కుల‌ను బాగా అల‌రించిన కొన్ని సినిమాలేవో చూద్దాం..

 

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన తెలుగు స్ట్ర‌యిట్ సినిమాల కంటే ఆయ‌న న‌టించిన త‌మిళ సినిమాల తెలుగు డ‌బ్బింగ్ వెర్ష‌న్లే తెలుగు ప్రేక్ష‌కుల‌ను బాగా అల‌రించాయి. ద‌ళ‌ప‌తి, బాషా, ముత్తు, న‌రసింహా, అరుణాచ‌లం వంటి సినిమాలు ఆయ‌న‌ను ఇక్క‌డ కూడా సూప‌ర్ స్టార్‌గా మార్చాయి. త‌న‌ను ఆద‌రించిన‌ స్నేహితుడు దేవ‌రాజ్ కోసం ఏమైనా చేసే సూర్య పాత్ర‌లో 'ద‌ళ‌ప‌తి' మూవీలో ర‌జ‌నీకాంత్ ప్ర‌ద‌ర్శించిన న‌ట‌న కానీ, దేవ‌రాజ్ పాత్ర‌లో మ‌మ్ముట్టి చూపిన అభిన‌యం కానీ మ‌నం మ‌ర‌వ‌గ‌ల‌మా? ఇక 'బాషా' మూవీలో ర‌జ‌నీకాంత్ వీర‌విహారం మ‌న‌ల్ని మెస్మ‌రైజ్ చేసింద‌నేది నిజం. ఆ సినిమాతోటే ఆయ‌న సౌతిండియా సూప‌ర్‌స్టార్ అయ్యారు.

ర‌జ‌నీకాంత్ కంటే ముందే మ‌న‌కు క‌మ‌ల్ హాస‌న్ అంటే బాగా ఇష్టం. 'మ‌రోచ‌రిత్ర'‌, 'ఆక‌లి రాజ్యం' వంటి స్ట్ర‌యిట్ తెలుగు సినిమాల‌తోటే ఆయ‌న మ‌న హృద‌యాల‌ను గెలుచుకున్నాడు, దాదాపు తెలుగు హీరో అయిపోయాడు. ఆ త‌ర్వాత కాలంలో త‌మిళం నుంచి వ‌చ్చిన డ‌బ్బింగ్ సినిమాల‌తోనూ మ‌న‌ల్ని అల‌రించారు. 'వ‌సంత కోకిల' సినిమాలో శ్రీ‌దేవి త‌న‌ను గుర్తుప‌ట్ట‌లేక‌పోతే, క‌మ‌ల్ ప‌డ్డ బాధ‌ను మ‌న బాధ‌గా చేసుకున్న రోజులు మ‌ర్చిపోగ‌ల‌మా?  మైఖేల్ మ‌ద‌న కామ‌రాజు, నాయ‌కుడు, అపూర్వ సోద‌రులు, భార‌తీయుడు, ద‌శావ‌తారం వంటి సినిమాల‌తో క‌మ‌ల్ మ‌న‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు.

త‌మిళంలోని టాప్ స్టార్స్‌తోనే కాకుండా అర్జున్ వంటి హీరోతోనూ బ్లాక్‌బ‌స్ట‌ర్స్ తీసిన ఘ‌న‌త డైరెక్ట‌ర్ శంక‌ర్ సొంతం. ఆ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 'జెంటిల్‌మ‌న్'‌, 'ఒకే ఒక్క‌డు' సినిమాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు అమితంగా ఆద‌రించారు. ఆ రెండు సినిమాల పాట‌లు ఇప్ప‌టికీ మ‌న నాలుక‌ల‌పై న‌ర్తిస్తుంటాయి. ముఖ్యంగా 'జెంటిల్‌మ‌న్' సినిమాలో అప్ప‌డాల కంపెనీ ఓన‌ర్ కృష్ణ‌మూర్తిగా, అవినీతిప‌రుల‌ డ‌బ్బు దొంగిలించి ధ‌నిక‌, పేద‌, కులం, మ‌తం భేదం లేకుండా, ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఒక కాలేజీని క‌ట్ట‌డం కోసం వెచ్చించేవాడిగా రెండు ర‌కాల షేడ్స్ ఉన్న‌ పాత్ర‌లో అర్జున్‌కు మ‌న‌వాళ్లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.

ప్ర‌భుదేవా అంటే మైఖేల్ జాక్స‌న్ త‌ర‌హాలో డాన్స్ చేసే ఒక కొరియోగ్రాఫ‌ర్‌గానే మ‌న‌కు అదివ‌ర‌కు తెలుసు. 'జెంటిల్‌మ‌న్' సినిమాలోని 'చికుబుకు చికుబుకు రైలే' పాటలో ప్ర‌భుదేవా డాన్సులకు అంద‌రం ఫిదా అయిపోయాం. అదే ప్ర‌భుదేవాలో ఒక స్టార్ యాక్ట‌ర్ కూడా ఉన్నాడ‌ని చూపించిన సినిమా 'ప్రేమికుడు'. శంక‌ర్ డైరెక్ట్ చేసిన ఆ మూవీ త‌మిళంలో ఎంత హిట్ట‌య్యిందో, తెలుగులోనూ అంత‌టి బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్యింది. న‌గ్నాతో ప్ర‌భుదేవా చేసిన రొమాన్స్‌ను జ‌నం మెచ్చారు. ఆ మూవీతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు ప్ర‌భుదేవా.

మ‌ణిర‌త్నం సినిమాల హ‌వా ఇప్పుడు త‌గ్గిపోయింది కానీ, ఒక ప‌దేళ్ల క్రితం దాకా ఆయ‌న సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తెలుగులో ఒక్క 'గీతాంజ‌లి' మూవీ మాత్ర‌మే చేసినా, త‌మిళం నుంచి తెలుగులోకి వ‌చ్చిన డ‌బ్బింగ్ సినిమాల‌తో ఇక్క‌డా బ్ర‌హ్మాండ‌మైన ఇమేజ్‌ను ఆయ‌న తెచ్చుకున్నాడు. మౌన‌రాగం, ద‌ళ‌ప‌తి, నాయ‌కుడు, ఘ‌ర్ష‌ణ‌, రోజా, బొంబాయి, యువ వంటి సినిమాలు ఆయ‌న కాకుండా ఇంకొక‌రు అలా తీయ‌గ‌ల‌రా? ఇద్ద‌రు స‌వ‌తి సోద‌రుల మ‌ధ్య 'ఘ‌ర్ష‌ణ' ఎలా ఉంటుందో, 'బొంబాయి'లో మ‌త ఘ‌ర్ష‌ణ‌లు ఎలా జ‌రిగాయో ఆయ‌న చూపించిన విధానం అపూర్వం.

విక్ర‌మ్ కూడా మొద‌ట్లో తెలుగులో న‌టించిన వాడే. కానీ పేరు తెచ్చుకోలేక‌పోయాడు. త‌మిళంలో పేరు తెచ్చుకున్నాక వచ్చిన డ‌బ్బింగ్ సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కూ ద‌గ్గ‌ర‌య్యాడు. బాలా డైరెక్ట్ చేసిన‌ 'శివ‌పుత్రుడు' సినిమా నుంచి అత‌ని హ‌వా మొద‌లైంద‌ని చెప్ప‌వ‌చ్చు. 'అప‌రిచితుడు' సినిమా అత‌డి క్రేజ్‌ను ఎన్నో రెట్లు పెంచింది. 'శివ‌పుత్రుడు' సినిమాయే సూర్య‌నూ మ‌న‌కు ప‌రిచ‌యం చేసింది. మ‌ణిర‌త్నం సినిమా 'యువ'తో అత‌డు మ‌న‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు. 'గ‌జిని' సినిమా తెలుగులో సూర్య‌కు మంచి మార్కెట్ తెచ్చిపెట్టింది.

తెలుగువాళ్ల‌కు తెలిసిన స్టార్లు లేక‌పోయినా, క‌థ‌తో, పాట‌ల‌తో డ‌బ్బింగ్ సినిమా కూడా సూప‌ర్ హిట్ అవుతుంద‌నీ, సంవ‌త్స‌రం పాటు ఆడుతుంద‌నీ మ‌న‌కు అనుభ‌వంలోకి తెచ్చిన సినిమా మాత్రం 1983లో వ‌చ్చిన‌ 'ప్రేమ‌సాగ‌రం'. టి. రాజేంద‌ర్ అనే డైరెక్ట‌ర్ రూపొందించిన ఈ సినిమాలో ప్రేమికులుగా ప‌రిచ‌య‌మైన గంగ‌, న‌ళిని.. అటు త‌మిళ‌, ఇటు తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించారు. అపురూప ప్రేమ‌క‌థాచిత్రంగా 'ప్రేమ‌సాగ‌రం' ఇప్ప‌టికీ ఇండియ‌న్ ఫిల్మ్ హిస్ట‌రీలో నిలిచింది.

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.