మరో ప్రయోగం చేస్తున్న నాగార్జున
on Jan 13, 2015
టాలీవుడ్ కింగ్ నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. అక్కినేని మూడు తరాలు నటించిన ప్రయోగాత్మక చిత్రం ‘మనం’ సినిమా తరువాత నాగార్జున నటిస్తున్న సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయన’. దీంతో ఈ సినిమాపై అభిమానులలో అంచనాలు బాగానే వున్నాయి. ఇదిలా ఉంటే, నాగార్జున మరో ప్రయోగం కూడా చేయబోతున్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నాగార్జున నిర్వహిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా ఉండబోతుందని సమాచారం. ఆ మూవీలో కూడా నాగార్జునే నటిస్తాడని వినికిడి. షోకి మరింత పాప్యులారిటీ తెచ్చే ప్రయత్నంలో ఈ ప్రాజెక్ట్ చేపట్టబోతున్నారని తెలుస్తోంది. నిజానికి ‘కౌన్ బనేగా క్రోర్ పతి’ని బేస్ చేసుకునే ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. మరి నాగార్జున తెరకెక్కించే ఈ సినిమా ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.