Facebook Twitter
మాలతీచందూర్

 

మాలతీచందూర్

మాలతీ చెందూర్ పరిచయం చెయ్యాల్సిన అవసరం లేని పేరు. ఎన్నో ప్రముఖ పత్రికల్లో కాలమిస్టుగా పనిచేశారు. తెలుగు, తమిళం, ఇంగ్లిషు భాషల్లో కథలు, నవలలు, విజ్ఞాన పుస్తకాలు రాశారు. గుర్తింపు పొందిన ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థల్లో సభ్యులుగా, వివిధహోదాలలో పనిచేశారు. నిత్యం పుస్తకాలు చదువుతూ, ఎంతోమంది సమస్యలకు సమాధానాలు, సలహాలు ఇస్తూ జీవించారు. చెన్నైలో స్థిరపడినా తెలుగు వారికి మాలతీ చెందూర్ రచనల ద్వారా దగ్గరే ఉన్నట్లు అనిపించేది.
           మాలతీచందూర్ 1930లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా నూజివీడులో జన్మించారు. వీరి తల్లిదండ్రులు జ్ఞానాంబ, వెంకటేశ్వర్లు. ప్రాథమిక విద్యాభ్యాసం నూజివీడు, ఏలూరులో అభ్యసించారు. ఎనిమిదో తరగతిలో ఉండగానే మేనమామ ఎన్.ఆర్. చందూర్ తో వివాహం జరిగింది. 1947లో భర్తతో కలిసి చెన్నై నగరానికి వెళ్లారు. కళాశాలకు వెళ్లి చదువుకోకున్నా నిత్యం పుస్తకాలు చదువేవారు. ప్రైవేటుగా ఎం.ఎ. పట్టా పుచ్చుకున్నారు. వీరికి శ్రీశ్రీ, ఆరుద్ర, నారాయణరెడ్డి వంటి కవులతో పరిచయాలు ఉండేవి. వీరిల్లు కూడా సాహితీ ప్రముఖులతో కళకళలాడుతుండేది.
           మాలతీచందూర్ 1950ల నుంచి రచనలు చేయడం ప్రారంభించారు. వీరి మొదటి కథ రవ్వల దుద్దులు. ఇది ఆనందం వారపత్రికలో వచ్చింది. ఆ తర్వాత భారతి లాంటి ప్రముఖ పత్రికల్లో ఎన్నో కథలు ముద్రితమయ్యాయి. సుమారు వందకు పైగా కథలు రాశారు. ఈ కథలలో ఆకాలం నాటి స్త్రీల దయనీయ స్థితి, సామాజిక కట్టుబాట్ల మధ్య నలుగుతున్న స్త్రీల మనస్థితి, వారి నిస్సహాయత ఎక్కువగా కనిపిస్తుంది. వీరి మొదటి నవల 1955లో వచ్చింది... చంపకం - చదపురుగులు. నవలలు కూడా 40 వరకు రాశారు. శిశిరవసంతం నవలలో- మనిషిలోని మంచితనమే భగవంతుడు అని చెప్తుంది. ఆ అంతర్నిగూఢ శక్తే మనిషిని మహోన్నతుడ్ని చేస్తుంది అనే సందేశం ఇస్తుంది. ఏమిటీ జీవితాలు నవల మనోవిశ్లేషణాత్మక ధోరణిలో సాగుతుంది. హృదయనేత్రి నవల- స్వాతంత్ర్య పోరాట కాలంలో జరిగిన చీరాల - పేరాల నేపథ్యంలో సాగుతుంది. ఇంకా వీరి రచనల్లో శతాబ్ది సూరీడు, కాంచనమృగం, మనసులో మనసు, మధుర స్మృతులు, ఆలోచించు, భూమిపుత్రి, ఏమిటీ జీవితాలు, క్షణికం, సద్యోగం, కృష్ణవేణి, వైశాఖి, కలల వెలలు, ఏది గమ్యం ఏది మార్గం,  రాగం అనురాగం, రెక్కల చుక్కలు, బ్రతక నేర్చిన జాణ, రేణుకాదేవి ఆత్మకథ లాంటివి ముఖ్యమైనవి.
       మొదటి స్త్రీ కాలమిస్టుగా పేరు తెచ్చుకున్నమాలతీచందూర్ ఎన్నో పత్రికల్లో కాలమ్స్ నిర్వహించారు. ఆంధ్రప్రభ పత్రికలో ప్రమదావనం పేరిట వీరు నిర్వహించిన కాలమ్ వీరికి మంచి గుర్తింపు తెచ్చింది. మొత్తం మీద పది లక్షలమంది ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆ సమాధానాలు ఇవ్వడం కోసం ఎన్నో పుస్తకాలు చదివేవారు. ఆమెకు ఓపిక ఎక్కువ, సమాధానాలు సూచించే విషయంలో రాగ ద్వేషాలకు అతీతంగా ప్రవర్తించేవారు. జగతి అనే మాస పత్రికకు సంపాదకులుగా కూడా వ్యవహరించారు.  స్వాతి వార పత్రికలో మాలతీ చందూర్ నిర్వహించిన నన్ను అడగండి శీర్షిక చాలా కాలం కొనసాగింది. పాతకెరటాలు అనే శీర్షికలో సుమారు 300లకు పైగా ఆంగ్ల నవలలను పరిచయం చేసిన ఘనత వీరిది. మహిళలకోసం ప్రత్యేకంగా అందాలు - అలంకారాలు, మధుర జీవనం, వంటలు - పిండివంటలు కాలమ్స్ కూడా నిర్వహించారు. ఒక్క ఈ తరం పిండివంటలు పుస్తకరూపంలో వచ్చి 33 సార్లు ముద్రణ పొందింది.
           మాలతీ చందూర్ స్త్రీవాదం అంటే- స్త్రీ తనకిష్టమైన పనులు చేయగలిగే మానసిక స్వేచ్ఛ కలిగి ఉండడమే అంటారు. స్త్రీ హృదయం సున్నితం, సౌకుమార్యం అలానే దృఢత్యం, స్థిరత్వం కలిగిందని చెప్తారు. చాలామంది ఈమె కాలమ్స్ చదివి స్ఫూర్తి పొంది ఆమెను చూడడానికి వెళ్లేవారు. వారిని చిరునవ్వుతో ఆహ్వానించి, ఆతిధ్యం ఇచ్చేవారు మాలతీచందూర్. వీరి రచనలు ఇతివృత్తంలోను, కథాకథనంలోను ప్రత్యేకంగా ఉంటాయి. మాలతీ చందుర్ కు లౌకికజ్ఞానం ఎక్కువ. మానవ సంబంధాల గొప్పతనం తెలుసు. జీవితంలో అనేక సమస్యలకు పరిష్కారం చూపేవారు. ఎంతమందికో తన పరిష్కారాల ద్వారా  జీవితాలను చక్కదిద్దేవారు. స్త్రీ పరిపూర్ణంగా ఎదగాలి. సామాజిక స్పృహ కలిగి ఉండాలి అనుకునే మాలతీచందూర్ స్త్రీల సమస్యలను భిన్న కోణాలలో ఆలోచించి రచనల్లో ఆవిష్కరించారు. ఊహల్లో కాల్పనిక జగత్తులో, పదహారేళ్ల కన్నెపిల్లల కలల్లా వీరి రచనలు ఉండవు. నిత్యం జీవితంలో తారసపడే మనుషులు, వారి సమస్యలు, కష్టాలు, ఆలోచనలు, ధైర్యాలు... వీరి రచనల్లో కనిపిస్తాయి.
                మాలతీచందూర్ మనిషిని పరిపూర్ణంగా అర్థం చేసుకోడానికి పుస్తకపఠనమే మార్గం అంటారు. పుస్తక పఠనం వల్ల ఆర్ద్రత, ఎదుటి మనిషిని అర్ధం చేసుకోగల స్పందన, అన్నిటిని మించి ఒక ఉన్నత ప్రపంచంలోకి అడుగుపెట్టగల అవకాశం లభించింది అని చెప్తారు. అంతేకాదు వీరి రనచలు గత శతాబ్దకాలంలో స్త్రీల జీవితాల్లో వచ్చిన మార్పులకు ప్రతిరూపాలు, ముఖ్యంగా శతాబ్ది సూరీడు నవలను 100 సంవత్సరాలలో బ్రాహ్మణ స్త్రీల జీవితాల్లోని పరిణామాలకు ఆధారమని చెప్పవచ్చు.
             కాలమిస్టుగా, రచయితగా పేరు తెచ్చుకున్న మాలతీ చందూర్12 సంవత్సరాలు సినిమా సెన్సార్ బోర్డు మెంబరుగా, వినియోగదారుల ఫోరమ్ మెంబరుగా, సామాజిక సంస్థల్లో సభ్యులుగా, ఆంధ్ర మహిళాసభ మహిళా హాస్టల్ ఛైర్ పర్సన్ గా... పలు హోదాలలో పనిచేశారు. రామలక్ష్మి ఫౌండేషన్ లాంటి ఉన్నతమైన అవార్డును, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. 84 ఏళ్ల వయసువరకు సుదీర్ఘ సాహితీ వ్యవసాయం చేసిన మాలతీచందూర్ చివరకు కాన్సర్ వ్యాధితో చనిపోయారు. 

               

-  డా. ఎ.రవీంద్రబాబు