Facebook Twitter
నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషువా

 

గుర్రం జాషువా

కులానికి, కలానికి ఉన్న సంబంధాన్ని తెంచి, స్వయంగా కవిగా ఎదిగిన విశిష్ట కవి జాషువా. అవమానాలను, అవహేళనలను ఎదుర్కొని లోకం తనవైపు తలెత్తి చూసేలా కవిత్వాన్ని రచించిన కవి జాషువా. ఆనాటి భావకవుల్లా కాకుండా జీవితంలోంచి కవిత్వాన్ని సమాజంపై కుమ్మరించిన వ్యక్తి జాషువా. తనలోని అగ్రహజ్వాలలను అక్షరాలుగా వెలిగించి సంస్కరణోద్యామానికి సాహిత్యాన్ని బాసటగా నిలిపిన కవి జాషువా. ఎక్కడా ఊహా ప్రేయసులు, మితిమీరిన స్త్రీ వర్ణనలు, స్వహపోక కల్పనలు లేకుండా వాస్తవాన్ని వినూత్నంగా చెక్కిన కవి జాషువా. గబ్బిలం నుంచి ఫిరదౌసిి వరకు, స్వప్నకథ నుంచి అందరూ మెచ్చే శ్మశానవాటిక వరకు ఆయన కవిత్వం విశిష్టమైంది. విలక్షణమైంది.
       గుంటారు జిల్లా వినుకొండలో 1895, సెప్టెంబరు 28న జన్మించారు జాషువా. తండ్రి వీరయ్య, తల్లి లింగమాంబ. చిన్ననాటి నుంచే అంటరాని తనానికి, అవహేళనలకు గురయ్యారు. కులం రిత్యా పాఠశాలలో, చుట్టూ ఉన్న సమాజంలో... స్వతహాగా అబ్బిన కవితా రచనకు తగిన గుర్తింపును కూడా పొందలేక పొయ్యారు. చివరకు ప్రాధమికోపాధ్యాయునిగా ఉద్యోగం సంపాదించారు. మూకీ చిత్రాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కందుకూరి, చిలకమర్తి లక్ష్మీనరసింహం, తిరుపతి వెంకటకవుల సాన్నిహిత్యంతో, ప్రోత్సాహం లభించింది. ఆకాశవాణిలో కూడా పనిచేశారు. తను జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను, అవమానాలనే నేపథ్యంగా గ్రహించి అనేక కావ్యాలు రాశారు. అయితే జాషువా పద్య రచననే తన వాహికగా ఎన్నుకున్నారు. అయినా కొన్ని నియమాలను ఛేధన చేశారు.
          అనాథ, స్వప్నకథ, గబ్బిలం, కాందిశీకుడు, ముసాఫరులు, ఫిరదౌసీ, ముంతాజ్ మహల్, క్రీస్తు చరిత్ర, శిశువు వంటి  ఖండకావ్యాలు రాశారు. వీటితోపాటు నేతాజీ, బాపూజీ పేరిట జాతీయ నాయకులు జీవితాలను పద్యకావ్యాలుగా రచించారు. రాష్ట్రపూజ, కొత్తలోకం, నాగార్జునసాగర్ కావ్యాలూ రాశారు. నాకథ అనే పేరుతో స్వీయచరిత్రను పద్యరూపంలో రాసుకున్నారు. వీరి క్రీస్తుచరిత్ర కావ్యానికి కేంద్రసాహిత్య అకాడమీ బహుమతి లభించింది. వీరి కావ్యాలలోని కొన్ని వాక్యాలు నేటితరం కవులకు కరాతలామలకం అయ్యాయి. పత్రికల వాళ్లకు శీర్షికలుగా ఉపయోగపడ్డాయి. దళితవాదం వచ్చాక వీరి కీర్తి ప్రతిష్టలను గుర్తించడం ఎక్కువగా జరిగిందని చెప్పాలి.    
        వీరు రాసిన ఫిరదౌసి కావ్యంలోని-
        రాజు మరణించె నొక తార రాలిపోయె
        కవియు మరణించె నొకతార గగనమెక్కె
        రాజు జీవించె రాతి విగ్రహములందు
       సుకవి జీవించె ప్రజల నాలుకల యందు
       ఈ పద్యం నేటి రాజకీయ నాయకులకు, కవులకు మధ్య ఉన్న సంబంధాన్ని, మరణించిన తర్వాత వారి భవితవ్యాన్ని తెలియజేస్తుంది.
        జాషువా రచించిన మరో అద్భుతమైన కావ్యం గబ్బిలం. దీనిలో ఓ అంటరాని కులంలో పుట్టిన ఓ పథికుడు తన బాధను శివాలయంలో ఉన్న గబ్బిలంతో విన్నవించుకుంటాడు. ఈ విన్నవించుకునే క్రమంలో జాషువా... కుల వ్యవస్థ, సమజంలోని హెచ్చుతగ్గులు, వర్ణ వ్యవస్థను నిరసిస్తూ ఎన్నో అద్భుతమైన పద్యాలు రాశారు. ఈ కావ్యంలో
          ఆ యభాగ్యుని రక్తంబు నాహరించి
         యునుప గజ్జెలతల్లి జీవనము సేయు
         గసరి బుసకొట్టు నాతని గాలిసోక
         నాల్గుపడగల హైందవ నాగరాజు... అని కుల వ్యవస్థపై ధ్వజమెత్తారు.
          జాషువా విగ్రహారాధనను నిరసించాడు. పేదల్ని కాదని విగ్రహాలకు పెళ్లిళ్లు చేయడానికి అనవసరమైన ఖర్చులు చేస్తున్నారని ఆనాడే విమర్శించారు.           
         ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించుగాని దుః
         ఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్
         మెతుకు విదల్పరీ భరత మేదిని, ముప్పది మూడుకోట్ల దే
         వత లెదబడ్డ దేశమున భాగ్యవిహీను లక్షుత్తులాఱనే... అని అన్నారు.
         ఇలా సమాజంలోని చీకటి కోణాలని దర్శించారు.
          ఇక వీరు రాసిన శ్మశానవాటికలోని పద్యాలు సత్యహరిశ్చంద్ర నాటకంలో భాగాలయ్యాయి. ఎందరికో ఇష్టమై ప్రజల నోళ్లలో నానుతున్నాయి. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో గఱగిపోయే... లాంటివి... జీవన తాత్వికతను, మానవ జీవితంలోని సత్యాన్ని ఆవిష్కరిస్తాయి.
         జాషువాకు కవికోకిల, కవితా విశారద, నవయుగ కవిచక్రవర్తి, కళాప్రపూర్ణ, పద్మభూషణ లాంటి బిరుదులు వచ్చాయి. రాష్ట్ర శాసనమండలిలో సభ్యులుగా కూడా ఉన్నారు. చివరకు 1971, జులై 24 న ఈలోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఆయన వ్యక్తిత్వం, వ్యధ, కావ్యాల రూపంలో మాత్రం మన మధ్య ఇప్పటికీ మిగిలే ఉన్నాయి.

- డా. ఎ.రవీంద్రబాబు