Facebook Twitter
కె. ఎన్. వై. పతంజలి


 కె. ఎన్. వై. పతంజలి

 

                                                
          అతనిదో విలక్షణమైన శైలి. భాషలో, వస్తువులో తొణికిసలాడే వ్యంగ్యం. సమాజాన్ని, మనుషులను తలకిందులు చేసి చూడాలనే తత్వం. మనుషుల్లోని వైవిధ్యాన్ని, విలక్షణతని తనదైన ప్రత్యేక కెమరాతో చూసే చూపు. తనకోసం మాత్రమే రచనలు చేస్తాను అని నిక్కచ్చిగా చెప్పగల ధైర్యం. అపారమైన పాండిత్యం, ఆ పాండిత్యాన్ని మాండలిక భాషలో సొగసుగా వ్యక్తం చేయగల ప్రతిభ. అతనే కె.ఎన్.వై. పతంజలి. ఏ కొద్ది సాహిత్యాభిమానం ఉన్నవారికైనా పతంజలి గురించి తప్పక తెలిసే ఉంటుంది. మనుషుల వ్యక్తిత్వాల్లోని వైరుధ్యాన్ని అన్ని కోణాల నుంచి చిత్రించిన రచయత ఆయన. పతంజలి అంటే జర్నలిస్టు, కథ, నవలా రచయిత. కాలమిస్టు. వ్యాస రచయిత. వైద్యుడు. వ్యంగ్యానికి పెట్టింది పేరు.
         పతంజలి అసలుపేరు కాకర్లపూడి నారసింహ యోగ పతంజలి. విజయనగరం జిల్లాలోని అలమండలో మార్చి 29, 1952న జన్మించారు. చిన్ననాడే తండ్రి వద్ద ఆయుర్వేద శాస్త్రాన్ని నేర్చుకున్నాడు. 11వ ఏటనే రచనా వ్యాసంగాన్ని ప్రారంభించాడు. 1975 నుంచి 84 వరకు ఈనాడులో, 1984 నుంచి 90 వరకు ఉదయం పత్రికల్లో పాత్రికేయ వృత్తిలో పనిచేశారు. తర్వాత ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభలలో ముఖ్యమైన బాధ్యతలు చేపట్టారు. టి.వి - 9లో, సాక్షి పత్రిక ఆవిర్భావంలో ఎడిటర్ గా విధులు నిర్వహించారు. సింధూరం సినిమాకు మాటలు రాశారు. అందుకు వీరికి నంది పురస్కారం కూడా లభించింది. వీరు నవలలు, కథలతో పాటు కొన్ని ప్రత్యేకమైన రచనలు కూడా చేశారు.
నవలలు- పెంపుడు జంతువులు, ఖాకీవనం, పిలక తిరుగుడు పువ్వు, గోపాత్రుడు, వీర బొబ్బిలి, ఒక దెయ్యం ఆత్మకథ, అప్పన్న సర్దార్, మేరా భారత్ మహాన్, రాజుల లోగిళ్లు..
కథలు- వేట కథలు, జ్ఞాపక కథలు, శభాషో మోపాసా.. వంటి సంపుటాలు.
ఇతర రచనలు - పతంజలి భాష్యం, గెలుపు సరే బతకడం ఎలా...
        వీరు మరణించిన తర్వాత స్నేహితులు, అభిమానులు, సహోద్యుగులు కలిసి వారి అనుభూతుల్ని, అభిప్రాయాలను, వీరి రచనల్లోని గొప్పతనాన్ని వ్యాసాల రూపంలో పుస్తకంగా తెచ్చారు. అదే పతంజలి తలపులు.
         పతంజలి రచనలను అర్థం చేసుకోవాలంటే 1970 ల నుంచి సమాజాన్ని అవగతం చేసుకోవాలి. తెలుగునేలపై వచ్చిన సాంస్కృతిక, రాజకీయ మార్పులను, ఉద్యమాలను తెలుసుకోవాలి. 1975లోని ఎమర్జన్సీ నుంచి అన్నమాట.  బాల్యంలో భూస్వాముల ఇళ్లల్లోని గొప్పలు, యవ్వనంలో విశాఖతీరంలోని అనుభవాలు, ఉత్తరాంధ్రలోని ఉద్యమాల ప్రభావం అన్నీ వీరి రచనల్లో అంతర్గతంగా కనిపిస్తాయి. ఇంకా శ్రీశ్రీ, పురిపండ అప్పల స్వామి, కారా మేస్టారు, రావి శాస్త్రి, చెకోవ్, మొపాసా, గురజాడ, చాసో, ఆస్కార్ వైల్డ్, వేమన, సెర్వాంటిజ్ ల ప్రభావం కూడా ఉంది. అందుకే చమత్కారం, వ్యంగ్యం, విలక్షణమైన వచనశైలి వీరి సొంతం. పాత్రచిత్రణ, సన్నివేశాల కల్పన, సంభాషణలు... సరికొత్తగా తటిల్లతల్లా మెరుస్తుంటాయి. ప్రతి రచనలో అంతుచక్కని లోతు, అర్థం చేసుకున్నంత విస్తృతి కనిపిస్తుంది.
           ఖాకీవనంలో ప్రభుత్వం తరపున ప్రజలపై ధౌర్జన్యం చేసే వాళ్లే అధికార వర్గాన్ని నిలదీయడం చూడొచ్చు. వీరబొబ్బిలిలో రాజుల లోగిళ్లలో పుట్టి పెరిగి వారి మాటలతో పాటు, మర్యాదలు, పెంకితనాన్ని నేర్చుకున్న గ్రామసింహం (కుక్క) తీరును వ్యంగ్యంగా అర్థం చేసుకోవచ్చు. నావల్ల ఈ దివాణానికి కళ, కాంతి అని విర్రవీగే కుక్క అది. చూపున్న పాట కథలో గుడ్డివాడు తన ప్లూటులో విప్లవాన్ని ఉద్దేశించే పాట పాడితే... అది పోలీసును ఎలా భయపెడుతుందే వివరించాడు. అడల్డ్ స్టోరీలో- పువ్వును ముద్దు పెట్టుకుంటే పుప్పొడి, పెళ్ళాన్ని ముందు పెట్టుకుంటే కుంకుమ పెదాలకు అంటుకుంటాయి అన్నాడు. నువ్వే కాదు నవలికలో డబ్బు మనుషుల్ని ఎలాంటి దైన్యానికి దిగజారుస్తుందో తెలియజేశాడు. న్యాయం, మీడియా అన్నీ వ్యవస్థలూ అవినీతి మయం అయ్యాయని రుజువు చేశాడు. అసలు పతంజలి సృష్టించిన పాత్రలు వెక్కిరిస్తాయి, చమత్కారంగా సంభాషిస్తాయి, పాఠకుల గుండెలను బరువెక్కిస్తాయి, తర్కంతో మెప్పిస్తాయి. మానవ స్వభావం, ఆశలు, నిరాశలు, అన్నీ వ్యవస్థీకృతం అని చెప్పకనే చెప్తాయి. మనల్ని మేడిపండు వొలిచినట్లు వొలిచి మనలోని లోపాల్ని పురుగుల్లా బైటకు చూపెడతాయి.
      తన రచనల గురించి పతంజలి స్వయంగా చెప్తూ- నేను వ్యంగ్యాన్ని ప్రత్యేకంగా రాయను, మనుషుల్లో ఉన్నదే రాస్తాను అంటారు. చెడును. దుర్మార్గాన్ని వెక్కిరిస్తే నాకు సంతోషం. వ్యంగ్యంలో నా బాధ, క్రోధం ఉంటాయి. రాయకుండా ఉండలేను కాబట్టే రాస్తున్నాను అని చెప్పుకున్నారు. పతంజలి రచనలు చదవడానికి ధైర్యం కావాలి. లోకం మీద కసితో కురిసే వారి వాక్యాల కత్తుల బోనులోకి ప్రవేశించాలి అంటే ఆ పదును తట్టుకోగలగాలి.  వీరికి రావిశాస్త్రి పురస్కారం, చాసో పురస్కారం లభించాయి. వీరి రచనల మొత్తాన్ని మనసు ఫౌండేషన్ రెండు సంపుటాలుగా తెచ్చింది. వీరి నవలికలను నాటకాలుగా మలచి ప్రదర్శించారు.
         ఇలా మనిషిలోని హిపోక్రసీని, సమాజంలోని అంతర్గత విలువల పతనాన్ని రచనల్లో చెప్పిన పతంజలి క్యాన్సర్ తో 2009లో మరణించారు. ఆయన గురించి ఆయన ఆప్తులు, తోటి రచయితలు ఎన్నో జ్ఞాపకాలను పంచుకున్నారు.
          "మిత్రులందరికీ ఆయన స్మృతి ఒక దవనం. అది పరమళిస్తూ ఉంటూ నెమరు వేసుకునే కొలది బాధగానూ, రుచిగానూ, శక్తి నింపేట్టుగానూ, నిలబెట్టేట్టుగానూ ఉంటుంది" అన్నారు ప్రముఖ కవి శివారెడ్డి. "ఏదో ఒక పేజి చదివాక, మన రక్తంలోకి జొరబడాతడు" అని ఆయన రచనల్లోని గొప్పతనాన్ని చెప్పారు అరసవిల్లి కృష్ణ.
                చివరిగా పతంజలి 1984లో జరిగిన ఎన్నికల సందర్భంగా రాసిన వాక్యాలను గుర్తుచేసుకుందాం. ఎందుకంటే అవి ఇప్పటికీ వాస్తవాలు కనుక-
            "మనమీద మనకు కొంత అసహ్యం వేస్తుంది.
            మన మీద మనకు కొొంత రోత పుడుతుంది.
            మన బుద్ది గడ్డి తింటున్నదని తెలిసి సిగ్గేస్తుంది.
            ఎన్నికల పతాకాలు విప్పేసిన తర్వాత, గుడారాలు పీకేసిన తర్వాత పట్టాభిషేక మహోత్సవం ముగిసిన తర్వాత తుపాకి ఇంకా మనకే గురిపెట్టి ఉందని తెలుస్తోంది.
            మన ఓటే మనల్ని కాటేసిందని తెలుస్తుంది
           ఈ మొహం మరో అయిదేళ్ల వరకూ ఎవరికీ చూపించలేం గదా అనిపిస్తుంది. దిగులేస్తుంది.

- డా. ఎ. రవీంద్రబాబు