Facebook Twitter
భయారణ్యం


 

భయారణ్యం

ఇదే నిజం
ఇక్కడ మనుష్యులనుంచి
మనుష్యులకే రక్షణ అవసరం
వేల సంవత్సరాల పూర్వీకుల నుంచి
మనల్ని మనమే  కాపాడుకోవలసిన
విపరీత అడవిమార్గం!

నలువైపులా సముద్రమున్నా
మనుషుల్లో ఆవరించిన అరణ్యాల గురించే
ఇన్ని రక్షణ వలయాలు !

'బారాటాంగ్' అడవుల్లో
పెద్ద పెద్ద వృక్షాల  మాటున
ఆసక్తిగా చూసే ఆ కళ్ళకి
కార్లు, రంగురంగుల బట్టలు
అన్నీ భయం కల్గించే వింతలే!
విల్లంబులతో ప్రాణాలు కాపాడుకునేవాళ్ళు
తేనె పూసిన  కత్తులకేసి
అడుగులేందుకు వేస్తారు!

సునామీ వచ్చిపోయినంత వేగంగా
మాయమైపోతున్న మానవత్వాన్ని
వెదుకుంటున్న వెర్రివాళ్ళు
తమ పేరు మీద ఏ పథకంలో ఎంతో
ఎవరి జేబులో ఎంతో
వాళ్ళకేం తెల్సు
ఆ మన ఆదివాసీలు
అండమాన్ అమ్మ ప్రకృతిలోఒదిగి
పర్యావరణాన్ని మనకోసమే కాపాడుతున్నారు
వాళ్ళ అడుగుజాడల్ని గుర్తుపట్టగలిగితే
మనం ఇంకా మనుషులుగా మిగిలినట్టే



భవానీదేవి