Facebook Twitter
అభ్యుదయ సాహిత్యపు అగుడుజాడ గురజాడ

అభ్యుదయ సాహిత్యపు అగుడుజాడ గురజాడ

- సతీష్ రెడ్డి జడ్డా

   

     జాతీయతాస్ఫూర్తి భారత దేశమంతటా వెల్లివిరుస్తున్న రోజుల్లో కలం పట్టిన యోధుడు గురజాడ. పాశ్చాత్య నాగరికత వ్యామోహంలో పడి భారత యువత కొట్టుమిట్టాడుతున్న సమయంలో వారికి భారతీయ సంస్కృతి, చరిత్ర, సాహిత్య వైభవాలను గుర్తుచేయడంతోపాటు పాశ్చాత్య లోకానికి భారతీయ ఔన్నత్యాన్ని తెలియజేయాల్సిన చారిత్రక అవసరాన్ని గుర్తించిన దీర్ఘదర్శి- గురజాడ.
 
తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి,  డామిట్‌! కథ అడ్డం తిరిగింది, పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్‌ లాంటి మాటలను ప్రజలకు ఊత పదాలుగా మార్చిన అద్భుతరచయిత గురజాడ. తెలుగు సాహిత్యానికి సరికొత్త అడుగుజాడలు చూపించిన గురజాడ 151వ జయంతి సందర్భంగా ఆయన సాహితీ గమనాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం.

కన్యాశుల్కం నాటకంతో సమాజంలో దురాచారాలను ప్రశ్నించిన సంఘ సంస్కర్త గురజాడ. ముఖ్యంగా ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు లాంటి పాత్రలు ప్రజలు మనసులో చెరగని స్ధానం సంపాదించాయి.

తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన సాహితీకారుడు గురజాడ అప్పారావు. హేతువాది 19 వ శతాబ్దంలోను, 20 వ శతబ్ది మొదటి దశకంలోను ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజలకు మార్గదర్శనం చేస్తూనే ఉన్నాయి. రాశిలో తక్కువైనా, ఆయన రచనలన్ని వాసికెక్కినవే. వ్యావహారిక భాషలో రచనలు చేయడం చేతకానితనం భావించే ఆ రోజుల్లో సామాన్యుడికి అర్ధమయ్యే సరళమూన భాషల్లో ఎన్నో రచనలు చేశారు గురజాడ.

సాహితీ రంగానికి ఆయన చేసిన సేవలకు గాను అభ్యుదయ కవితా పితామహుడు, కవి శేఖర లాంటి బిరువులతో సత్కరించారు. కన్యాశుల్కం, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, నీ పేరేంటి, పెద్దమసీదు, మాటా మంతి లాంటి రచనలు ఆయన్ని ఎప్పుడు మనకు గుర్తు చేస్తూనే ఉంటాయి.

దేశ భక్తునిగా, సంఘసేవకునిగా, సాహితీవేత్తగా, ఆంధ్రుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గురజాడ అప్పారావు 1915 నవంబర్‌ 30న తన అపార సాహితీ సంపదను మనకు వదిలేసి తను మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.