Facebook Twitter
తెలుగు కథకు నిలువుటద్దం- కొడవటిగంటి

 

తెలుగు కథకు నిలువుటద్దం- కొడవటిగంటి

 

తెలుగు కథా సాహిత్యం అనగానే ఓ పదిమంది గుర్తుకువచ్చినా చాలు... అందులో కొడవటిగంట పేరు లేకపోతే ఆ కాస్త జాబితా కూడా అసమగ్రంగా మిగిలిపోతుంది. అంతలా తెలుగు కథ మీద తనదైన ముద్ర వేశారు కొడవటిగంటి కుటుంబరావు అలియాస్‌ కొ.కు.

కొడవటిగంటి 1909లో తెనాలిలో సనాతన ఆచారాలను సద్దుచేయకుండా పాటించే వ్యవస్థలో జన్మించారు. చిన్నప్పుడే తల్లీతండ్రీ మరణించడంతో మేనమామ చెంతనే పెరిగారు. తరువాత కాలంలో కొన్నాళ్లు విజయనగరంలోనూ విద్యను అభ్యసించారు. శాస్త్రీయ దృక్పథం నిదానంగా బలం పుంజుకుంటున్న రోజులవి. రష్యాలో విప్లవం సాధ్యమైన సమయమది. బహుశా ఆ సందర్భం కొ.కు ఆలోచనా ధోరణిని ప్రభావితం చేసి ఉంటుంది. పైగా ఆనాటి సాంస్కృతిక కేంద్రాలు అనదగిన తెనాలి, విజయనగరం, చెన్నైలో జీవించడం వల్ల కూడా ఆయనలోని భావాలు ఆధునిక దిశగా పయనించి ఉంటాయి. ఈ భావాలకి సృజన కూడా తోడవడంతో పుంఖానుపుంఖాలుగా రచనలు వెలువరించారు.

కొ.కు మొదటి రచన 1930లో ప్రచురితం అయ్యింది. అప్పటి నుంచి తను చనిపోయే 1980 వరకూ ఆయన విస్తృతమైన సాహిత్యాన్ని వెలువరించారు. కథ, నవల, నాటిక, పాపులర్‌ సైన్స్‌ రచనలు, అనువాదాలు... ఇలా కొ.కు సమగ్ర సాహిత్యం దాదాపు పదిహేను వేల పేజీలకు చేరుకుందంటే ఆయన సృజన ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. ఒక పక్క చందమామలో సంపాదకత్వం వహిస్తూనే ఇంతటి సాహిత్యాన్ని సృష్టించడం మరో విశేషం. చందమామ ప్రస్తావన రాగానే అది తెలుగువారి జీవితంలో మమేకం అయిపోయేందుకు కొ.కు చేసిన కృషిని తలుచుకొని తీరాలి. 1952లో చందమామలో చేరిన కొడవటిగంటి తను చనిపోయేదాకా అందులోనే పనిచేశారు. తన దగ్గరకు వచ్చే రచనలను క్షుణ్నంగా పరిశీలించి, ఉత్తమమైనవాటిని ఎంపిక చేయడమే కాదు... వాటిలో ఏవన్నా లోపాలు ఉంటే వాటిని పాఠకులు తగినట్లుగా తిరగరాసేవారని అంటారు. అందుకనే చందమామ తెలుగువారికి ఓ మర్చిపోలేని బాల్యాన్ని మిగిల్చింది.

 

చందమామలో కుదురుకునేవరకూ ట్యూషన్‌ మాస్టారుగా, కార్మికునిగా, కాపీరైటరుగా, గుమాస్తాగా... ఇలా కొ.కు రకరకాల వృత్తులలో జీవించారు. కానీ ఆయన ప్రవృత్తి మాత్రం సాహిత్యంగానే ఉండేది. చిన్నప్పుడు తన మనసులో ముద్రవేసుకున్న కోస్తా జీవితాలను, మరణించేవారకూ కూడా తన కథలలో ప్రతిబింబిస్తూనే వచ్చారు. మధ్య తరగతి జీవితాలు, ఛాందస భావాలు, చదువులు, వితంతు వివాహాలు వంటి సమస్యలన్నింటినీ కొ.కు మార్క్సిస్టు దృక్పథంతో కథలుగా మలిచారు.

కొడవటిగంటి రచనలు చూసేందుకు సాదాసీదాగా సాగిపోయినట్లు ఉంటాయి. శిల్పంలో వంపులూ, పదాల విరుపులూ కనిపించవు. కానీ రచన పూర్తయ్యాక మాత్రం ఒక కొత్త విషయం బోధపడినట్లూ, ఏదో సమస్య గురించి అవగాహన కలిగినట్లూ కనిపిస్తుంది. కొ.కు పాత్రలన్నీ సామాన్యవైనవే. కానీ అలా సహజమైన మనస్తత్వాల కారణంగానే అవి మన జీవితంలో తారసిల్లే పాత్రలుగా కనిపిస్తాయి. అందుకు ఉదాహరణగా చదువు నవలను చెప్పుకోవచ్చు. ఇందులో ప్రపంచం తల్లకిందులైనా కూడా తన చదువు సాగడమే ముఖ్యం అనుకునే సుందరం పాత్రతో కొ.కు ఏకంగా ఒక తరానికి ప్రతినిధినే పరిచయం చేస్తారు. సుందరం తన చదువుని సాగించడం, నిదానంగా జాతీయ భావాల వైపుగా ప్రభావితం కావడమూ, మధ్యతరగతి జీవితంలో కుదురుకోవడం వంటి అంశాలతో చదువు నవల సాగుతుంది. జాతీయోద్యమం, ప్రపంచ యుద్ధాల నేపధ్యంలో సాగే ఈ నవల కొకు రచనలలోనే అత్యంత ప్రసిద్ధంగా పేర్కొంటారు.

కొ.కు విస్తృతంగా రచనలు చేసినా కూడా వాటిలో ఏ ఒక్కటీ నిరుపయోగంగా, లక్ష్యరహితంగా కనిపించకపోవడం విశేషం. అలవోకగా రాసేసినట్లు తోచినా, ఒకో కథనీ చెప్పేందుకు ఆయన ఒకో ప్రక్రియను ఎన్నుకొన్నారు. అందుకు ‘తాతయ్య’ కథని ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక చిన్న పిల్లవాడి కోణంలోంచి ఈ కథ సాగుతుంది. సంప్రదాయబద్ధమైన ఒక కుటుంబంలో ఉన్న పరిస్థితులను ఆ పిల్లవాడే మనకి చెబుతూ ఉంటాడు. అందులో నిరసన ఉండదు, విమర్శ ఉండదు. కానీ పిల్లవాడు చెప్పే ప్రతిమాటా మనలో ఆలోచనని రేకెత్తిస్తుంది. ఆ పిల్లవాడి చుట్టూ ఉన్న కుటుంబం అతనిలో ఎలాంటి అభిప్రాయాలను చొప్పించేందుకు ప్రయత్నిస్తుంది, వివిధ ఆచారాల పట్ల అతనిలో ఎలాంటి ఛాందస భావాలను నాటబడతాయి అన్నది అతని మాటల్లోనే చెబుతారు రచయిత. మోకాలు లోతు బురదలో సర్కసుని చూడటం, సోడాని తాగడం వంటి చిన్నచిన్న అనుభవాలు అతనిలో ఎలాంటి సంతోషాన్ని కలిగించాయో చెబుతూనే.... వనభోజనాల దగ్గర్నుంచీ చావు దాకా అతనిలో కలిగే స్పందనల దాకా ఒక నిర్మలమైన వ్యక్తిత్వాన్ని మన కళ్లకి కడతారు.

కొడవటిగంటి కేవలం సమస్యలని ఎత్తిచూపడం మాత్రమే చేయలేదు! చాలాసందర్భాలలో వాటికి తగిన పరిష్కారాలను కూడా సూచిస్తారు. సమస్య తనదాకా వస్తే మనుషులు ఎలా ప్రవర్తిస్తారో కూడా విశదీకరిస్తారు. ‘దాలిగుంటలో కుక్కలు’ అనే కథలో అప్పటివరకూ పేదవారి అసహాయత గురించీ, ధనవంతుల దాష్టీకాల గురించీ తెగ మదనపడిపోయే కుటుంబం... తన పొలంలోని కూలీలు సమ్మెకు దిగారని తెలియగానే, ప్లేటుని ఎలా ఫిరాయిస్తుందో చెబుతారు కొ.కు.

కొడవటిగంటి రచనల్లో సున్నితమైన హాస్యం కనిపిస్తుంది. ఒక చిన్న కదలికనీ, మాటనీ, ప్రతిస్పందననీ పదాల్లో చూపించగలిగే నేర్పు కనిపిస్తుంది. అందుకనే తెలుగు కథ ఉన్నన్నాళ్లూ కొ.కు ప్రస్తావన ఉంటుంది. ప్రభావమూ ఉంటుంది.

- నిర్జర.