Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? మమతా సాగర్

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? మమతా సాగర్

మమతా సాగర్ కన్నడ రచయిత్రి. ఆమె కవిత్వం, వ్యాసాలు, నాటకాలు, గద్యం, విమర్శ, ఆర్ట్ రైటింగ్, కాలం రైటింగ్ ఇలా అనేక ప్రక్రియల్లో రాస్తుంది. కన్నడ నుంచి ఇంగ్లీష్ లోకి ఇంగ్లీష్ నుంచి కన్నడ లోకి అనువాదాలు కూడా చేసింది. ఎన్నో పొయెట్రీ ఫెస్టివల్స్ లో పాల్గొంది. ఆమె కవిత్వం భారతీయ భాషల్లోకే కాకుండా దాదాపు పధ్నాలుగు విదేశీ భాషల్లోకి అనువాదం అయ్యాయి. ఆమె రెండు కవితా సంకలనాలు పబ్లిష్ చేసింది. ఆమె ఆర్టికల్స్ ఇంగ్లీష్ పేపర్స్లో చదివాను.

ఇంగ్లీష్లోకి అనువదించిన ఆమె ఈ కవిత ఆమె బెస్ట్ కవితల్లో ఒకటి. పంచభూతాలనేవి ఈ సృష్టికి మూలం. ఇంత అద్భుతమైన వైవిధ్యానికి కేవలం ఆ అయిదు మూలకాలే ఆధారం అంటే అలోచిస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది. వివిధ రకాలైన వృక్ష జాతులు, పూల జాతులు, రంగులు పరిమళాలు, రుచులు, ఆకృతులు, ప్రాణికోటి లోని వైవిధ్యం గురించి చెప్పనే అక్కరలేదు, ఇంకా మనిషికి తెలియని ప్రాణులు ఎన్నున్నాయో. ఒక్క భూగోళం మీదే ఇంత వైవిధ్యానికి అయితే ఇంకెక్కడన్న ప్రాణం ఉంటే మరి అవి ఎలా ఉంటాయో.

సృష్టి అనేది నిరంతర ప్రక్రియ, సృష్టి అవుతున్నది మాత్రం మార్పు చెందుతూనే వస్తోంది. మార్పు లేకుండా జరుగుతున్నది సృష్టి. కేవలం పంచభూతాలనుంచే జరుగుతున్న ఈ సృష్టి అంతా ఒక నిర్ణీత జీవిత కాలం తరవాత నశించి మళ్ళీ అవే పంచభూతాల్లో కలిసి పోతుంది. అంటే ప్రాణం ఉన్నా లేకున్నా ప్రతి జీవి ఉనికి పంచభూతాల్లో ఉంది. ఒక నిర్ణీత సమయంలో, ఒక నిర్ణీత పరిస్తుతుల కలయిక ప్రభావాల వల్ల పంచభూతాల్లో ఉన్న ఉనికి ఒక నిర్దేశిత ఆకృతిని పొంది ప్రాణం పోసుకుంటుంది. ఉనికిలోకి వచ్చిన ఆ ప్రాణిలోనూ కనపడకుండా అవే పంచభూతాలు ఉంటాయి. అయినా అవి విడిగా బయటా ఉంటాయి. ప్రాణం ఉన్న జీవి, మెదడు కూడా అభివృద్ధి చెందిన జీవి మానవుడు ఇప్పుడు పంచభూతాలను తన చేతిలో పెట్టుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఇది మానవుడి పురోగతికి పంచభూతాలపై అతని విజయానికే దారి తీస్తుందో, సర్వ ప్రాణికోటి వినాశనానికే దారితీస్తుందో చెప్పలేము.

ప్రాణంలో, ఉనికిలో పంచభూతాలు ఎలా ఉన్నాయో, బయట ఉన్నవే లోపల, లోపల ఉన్నవే బయటా ఎలా ఉన్నాయో, ఈ చిన్న కవితలో అందంగా చెప్తుంది మమతా సాగర్. కవిత చిన్నదే అయినా అది రేపే ఆలోచనల దుమారం మాత్రం పెద్దదే.

 

నది

నా చేతుల దోసిలిలో నది ఉంది
ఇక నది లోపల ఉన్నాయి
ఆకాశం, మేఘాలు, సూర్యుడు.
నా చేతులు విదిలించేస్తే
నది చుక్కలుగా ఒలికిపోతుంది
ఆకాశం, మేఘాలు, సూర్యుడు నాపైనంతా పడతాయి.

అదే చేతుల దోసిలి గిన్నెతో నదిని నే తాగితే
అప్పుడు నాలోనే ఉన్నాయి
ఆకాశం, మేఘాలూ, సూర్యుడు.

నాకు చెప్పండిప్పుడు ఎవరు ఎవరిలో ఉన్నారో.


సృష్టిలో ప్రతిజీవి ప్రాణం పోసుకున్నాక దాని జీవితం ఒక ప్రవాహంలా సాగుతుంది. ప్రాణం ఉన్నంతవరకూ గతం నుంచి వర్తమానం ఆతరవాత భవిష్యత్తు అన్నీ ఒక ప్రవాహంలా సాగుతూనే ఉంటాయి. గతానికి వర్తమానానికీ భవిష్యత్తుకీ తెగని లంకె ఉండటాన్ని ఈ ప్రవాహం సూచిస్తుంది. ఒక రకంగా కాలం అనేదే ఈ ప్రవాహం. జీవితం అనేది ప్రవాహంలాగా వెనక్కి వెళ్ళినపుడూ అంటే గతంలోనూ ఉంటుంది, వర్తమానంలోనూ ఉంటుంది భవిష్యత్తులోనూ ఉంటుంది. అయితే ఈ ప్రవాహంలో పడి కొట్టుకు పోవడం అంటే ఎవరి జీవితాన్ని వాళ్ళు జీవించడమే. కాకపోతే నిజానికి ఎవరి జీవితంలో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు. ఆకు విడిపోయి రాలిపోయి ప్రవాహంలో పడి కొట్టుకుపోయిన సంగతి గాలికి గానీ, చెట్టుకి గానీ, నీటికి గానీ చేపకి గానీ దేనికీ తెలియదు. ఎవరి లోకం వారిది, ఎవరి మైకం వారిది. అదే జీవితమనుకుంటా. పైకి కనిపించకపోయినా, ఎంతో భావగర్భితమైన కవిత, ఎంతో తాత్వికత నిండిన కవిత అని నాకనిపించింది. దీనికి వేరేమైనా అర్ధం కూడా ఉండచ్చునేమో, కవి హృదయం ఏంటో ఒకొక్కరికీ ఒక్కోలా అర్ధం కావచ్చనుకుంటా. అది కూడా కవిత గొప్పదనమేమో.

దాగుడుమూతలు

ఓ గాలిపటంలా గాలిని లాలిస్తూ
చెట్టు నుంచి ఒక ఆకు
రాలుతోంది
తేలుతూ
ఊగుతూ
ఇప్పుడొక పడవైంది నది నీటిలో

రంగు రంగుల చేపలతో పాటుగా
ప్రకాశించే బంగరు రంగు నీటిపై
పచ్చని మెరుపులా
త్వరత్వరగా ప్రయాణిస్తూ
ప్రవాహంతో కొట్టుకుపోయింది

నీటికి తెలియదు
గాలికి తెలియదు
చెట్టుకి తెలియదు
చేపకి తెలియదు
ఈ దాగుడుమూతలాట

 

- Sharada Sivapurapu