Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? కె సరస్వతి అమ్మ

సరస్వతి అమ్మ మొదటి కధ 1938 లో అచ్చయ్యింది. అదే ఆమె ప్రస్థానానికి ప్రారంభం అత్యంత శక్తివంతమైన మొదటి మలయాల స్త్రీవాద రచయిత్రిగా. ఆమె తన కధల ద్వారా పురుషులు ఎలాంటివారో స్త్రీలకి చెప్పే ప్రయత్నం చేసింది. వారితో సమానమైన హక్కులు, జీవితం కావాలంటే స్త్రీలు పురుషులపై ఆధారపడి జీవితాన్ని గడుపుతూ అందులోనే సౌఖ్యం వెతుక్కునే తత్వాన్ని మానుకోవాలనీ, తమ కాళ్ళ మీద తాము నిలబడాలంటే ఇంతకుముందుకన్నా ఎంతో కష్టపడాలనీ చెప్పింది. ముఖ్యంగా ప్రేమ విషయంలో మగవాళ్ళంటే ఆడవారికుండే భ్రమలని తొలగించే ప్రయత్నం చేస్తూ, పితృస్వామ్యం, సాంప్రదాయం మీద దాడి చేసింది. అందుకు ఆమెను పురుష ద్వేషిగా నిందిస్తూ, అప్పటి సమాజం పూర్తిగా ఆమెను ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యం చేసింది. అలా ఆమె ఎంత శక్తివంతంగా స్త్రీవాద రచనలు చేసినా ఆమెకు రావలిసిన గుర్తింపు రాలేదు. వ్యక్తిగతంగా తాను పెళ్ళి చేసుకోకూడదని నిశ్చయించుకుని పట్టభద్రురాలై, గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం చేస్తూ ఒంటరిగా చివరివరకూ రచనా వ్యాసంగంతోనే తన జీవితంలోని ఖాళీలను పూరించుకుంది. ఆంగ్లంలోకి తర్జుమా చేసిన ఆమె కధలని ఎన్నో అమెరికన్ పుస్తకాల్లో ఇష్టంగా చదువుకుంటారంటే చూడండి ఆమెను బయటివారు గుర్తించినా తన రాష్ట్రంలో, దేశంలో ఆమె పేరు మరుగునే ఉండిపోయింది. ఆమె కధలు "Stories from a forgotten feminist” అన్న పేరుతో ఇంగ్లీష్ లోకి అనువదించబడ్డాయి. ఆమె రాసినవి 12 కధా సంకలనాలు, ఒక నవల ఒక వ్యాస సంకలనం (A world in which there are no Men) అచ్చయ్యాయి.

సరస్వతి అమ్మ వ్యక్తిగత జీవితానికొస్తే, ఉన్నత నాయిర్ కుటుంబానికి చెందినా, కుటుంబ కలహాలు ఆమెను ఎక్కువగా బాధించేవి. తండ్రి ప్రేమతో చెప్పే కధలు మాత్రమే ఆమె చిన్నతనపు తీపి జ్ఞాపకాలు. ఇవన్నీ చిన్నపుడే ఆమెను సన్యాసినిగా జీవితం గడపటానికి ప్రేరేపించాయి. ఇలాంటి బాధలోనే ఆమె తన గురువుగా భావించే రబింద్రనాత్ ఠాగోర్కి ఉత్తరాలు రాసేదట. ప్రేమ లేని జీవితాల్లో, మనుషుల మధ్య బంధాలు, బాంధవ్యాలు కేవలం ఒక నిరాసక్త ఋణానుబంధమే తప్ప వేరేమీ ఆమెకు కనిపించక ఒంటరి బ్రతుకు వేపు వెళ్ళింది. తన అక్క కొడుకునే ఆమె తన కొడుకులా పెంచుకుంది. కానీ ఆ బంధంతో కూడా కొన్ని సమస్యలు వచ్చి ఆ అబ్బాయి ఆమెను విడిచి వెళ్ళినపుడు, అతని తల్లి కూడా తనని అనుమానించినపుడు, సరస్వతి అమ్మ పూర్తిగా నైరాశ్యంలో మునిగిపోయి, తన రచనా వ్యాసంగాన్ని కూడా కొనసాగించలేక ఆపేసింది. ఏ సమస్యలైతే ఆమెలోని రచయిత్రిని నిద్రలేపాయో, అలాంటి పరిస్తితులే ఆమె లోని సృజనా శక్తిని చంపేసాయి.

56 ఏళ్ళ వయసులో ఆమె మరణం ఎవరికీ వార్త కాలేదు. కానీ, పురుషులు ఆక్రమించిన డయాస్ పైకెక్కి నేనూ రచయిత్రిని, నేనూ కొన్ని కధలు రాసాను అని ధైర్యంగా నిలబడగల సత్తా ఉంది ఆమెకు. స్త్రీని శీలవతిగా, సావిత్రిగా, ఆమె చుట్టూ ఒక పాతివ్రత్యపు ఆరా (aura) సృష్టించడమో, లేకపోతే పురుషుడి జీవితాన్ని నాశనం చేసే మోహినిగానో స్త్రీని చిత్రించటం తప్ప పురుష రచయితలు చేసిందేంటని ఆమె ప్రశ్నించింది. అయితే ఆమె కోపం, పోరాటం పురుషుడిమీద కాదు, పురుషాధిక్య సమాజం మీద. సమానత్వం, గౌరవం, ప్రేమా ఉన్న స్త్రీ పురుష బంధాలని ఆమె ఆశించింది. అందమైన పురుషుడి ప్రేమ కోసం పరితపించే స్త్రీలను కూడా ఆమె విమర్శించింది. ఒక స్త్రీ సమానత్వాన్నీ, స్వేఛ్చనీ కోరుకుంటే పెళ్ళి అనే బంధంలో పడకూడదని ఆమె భావించింది. ప్రేమికుడుగా ఉన్న పురుషుడు, భర్త కాగానే ఎలా మారతాడో ఆమె తన పాత్రల్లో చూపెట్టింది. స్వతంత్ర పోరాటంలో స్త్రీల పాత్ర ఎంతైనా ఉందని గుర్తించిన ఆ రోజుల్లో, సమాజ పునర్నిర్మాణంలో స్త్రీలు భాగస్వాములవ్వాలంటే, విద్య అతి ముఖ్యమైన అంశమని ఆమె భావించింది. నిజానికి విద్యావంతులైన స్త్రీలకి ఆ రోజుల్లో కనిపించింది, స్త్రీల అణిచివేత, మతం, సాంప్రదాయం పేరిట పురుషాధిక్యత, కుటుంబ జీవనంలో స్త్రీలు ముఖ్య పాత్ర పోషిస్తూ కూడా, ఎందుకూ పనకిరానివాడైనట్లున్న పురుషుడి సేవలో నిరంతరం జీవనం గడుపుతూ కూడా, అత్యంత బలహీనులుగా చిత్రింపబడుతూ మగ్గుతున్న స్త్రీలే కనిపించారు. రచయిత్రులందరూ, స్త్రీవాద రచనలు చేయడానికి ఇదొక ముఖ్య కారణం.

ఎన్నో యుగాలుగా సమాజం ఎంతో గౌరవిస్తున్న విలువల్ని ఆమె నిర్భయంగా ఖండించింది. భర్తని అనుక్షణం కనిపెట్టుకుని ఉందాల్సిన, సేవ చెయ్యాల్సిన బాధ్యతని స్త్రీకప్పగించిన సమాజ నీతిని ఆమె ప్రశ్నించింది. దీనికి ప్రతిగా ఆమె రచనలపైనే కాదు వ్యక్తిగతంగా కూడా ఆమెపై విమర్శకులు దాడి చేసారు. పురుషాధిక్యతనెట్లా ఆమె ప్రశ్నించిందో పెళ్ళితోనే తమ జీవితాలకు సార్ధకత అనుకునే స్త్రీల బలహీనతను కూడా ఆమె అంతే నిరసించింది. అసలు స్త్రీవాదం ఇదేనేమో. నిష్పక్షపాతంగా ఆలోచిస్తే, మగవారు మారాల్సిన అవసరం ఎలా ఉందో, ఆడవారు మారాల్సిన అవసరం కూడా అంతే ఉంది. ఇద్దరిలోనూ మార్పు వచ్చినపుడే అది అసలైన స్త్రీ పురుష సమానత్వానికి దారి వేస్తుంది. ఆమె కధల్లో భావోద్వేగాలకి సంబంధించిన అంశాలకన్నా మేధస్సుకి సంబంధించిన అంశాలే ఎక్కువని విమర్శకుల వాదన. ఆమె పురుష ద్వేషి కాదు, అందుకు భిన్నంగా స్త్రీలు యుగ యుగాలుగా తమ ఆత్మలకు వేసుకుంటున్న బానిసత్వపు సంకెళ్ళను తెంచే ప్రయత్నం చేసింది. ఆమె కధల్లోని స్త్రీ పాత్రలు తమ జీవితాల్లో స్వేఛ్చని కోరుకుంటాయి, జీవన సాఫల్యతనీ, సార్ధకతనీ కోరుకుంటాయి. అయితే ఇలాంటి పాత్రలు కేవలం ఊహాజనితమే, వివాహ వ్యవస్థకి బలయిన స్త్రీలే కాని, అప్పుడున్న సమాజంలో అలాంటి స్త్రీలు ఆమెకు కనపడలేదు. అందుకే ఒక స్త్రీ తనను మగాడు అర్ధం చేసుకోవాలని ఆశించటంకన్నా తనను తాను అర్ధంచేసుకునే ప్రయత్నం చెయ్యాలంది. మలయాల సాహిత్య ప్రపంచంలో, తరవాత మాధవికుట్టీ లాంటి రచయిత్రులకి దారి చూపిన ఈమె స్త్రీ వాదానికి కొత్తర్ధం చెప్పినట్టనిపిస్తుంది.

Marriages are Made in Heaven అనే కధలో, మాధవి తల్లి తండ్రులు తమ కూతుళ్ళకు కట్నమిచ్చి అల్లుళ్ళను కొనుక్కోకూడదని నిశ్చయించుకుంటారు. ఇదేదొ ఆశయం కోసం కాదు, అంత డబ్బు తేలేక. నేను కట్నం తీసుకోలేదు అలాగే నా కూతుళ్ళకూ ఇవ్వను అని, నిజంగా అందరికీ కట్నమిచ్చి పెళ్ళి చేసే పక్షంలో అడుక్కుతినవల్సి వస్తుందని అనుకుంటారు. పెళ్ళి అయ్యే సమయం వస్తే వరుడు వెతుక్కుంటూ వస్తాడని నమ్ముకుంటారు. కాని నలుగురు ఆడపిల్లలూ 15 ఏళ్ళ వయసు దాటి పెరిగినా వరుడు రాడు. ఎదిగిన ఆడపిల్లలున్న ఇళ్ళు తేలిగ్గా నిప్పంటుకుంటాయని సామెతట. అయితే నిప్పు ఇంటికి కాదు తల్లి తండ్రుల గుండెలకు మాత్రం ఖచ్చితంగా అంటుకుంటుంది. ఈ పరిస్తితిలో చేసేది లేక పెద్ద పిల్లయిన 23 ఏళ్ళ మాధవికి కట్నం 200 రూపాయలనుంచీ బేరమాడి చివరకు 500 రూపాయలకు కుదుర్చుకుంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మధ్యవర్తి ద్వారా బేరసారాలన్నీ కుదిరాకే పెళ్ళి చూపులకు వస్తారు. వివాహం చేస్తారు. అప్పట్నుంచి మాధవికి అత్తగారు, ఆమె మాట దాటని భర్త నుంచి కష్టాలు మొదలవుతాయి.

వివాహం జరిగిన కొద్ది రోజులకి మాధవి తండ్రి వచ్చి, మాధవి వేస్కున్న నగలు తీసి ఇవ్వమంటాడు. వీరి మాటలు విన్న అత్తగారు నగలతో బాటు మాధవిని కూడా తీస్కెళ్ళిపోమంటుంది. ఏమీ చెయ్యలేక తండ్రి వెనక్కి వెళ్ళి భార్యకి విషయం చెప్తాడు. ఆమె ఉపాయంతో, కొత్త (గిల్టు) నగలు చేయించి, మాధవి అత్తగారి ముందే ఆమెకు వేసి, పాత నగలు తీస్కెల్తారు. అయితే కొద్ది రోజుల తరవాత మాధవిని భర్త మామగారింట దిగబెట్టి వెళ్తాడు, మర్నాడు తీసుకువెళ్తానని చెప్పి. కాని నెలలు గడిచిన ఆ మరునాడు రాదు సరికదా, అతను వేరే అమ్మాయిని రెండో పెళ్ళి చేసుకోడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుస్తుంది. అంతే కాకుండా పెళ్ళిచూపుల్లో మాధవిని కాకుండా ఇంకో అందమైన అమ్మయిని చూపి వాళ్ళని మోసం చేసారని నింద వేస్తారు. మాధవి తల్లి తండ్రులు ఈ విషయం కోర్టులో తేల్చుకోవాలని అనుకుంటుండగా, గ్రామ పెద్దలు పంచయితీ పెడతారు. తేల్చాల్సిన విషయం పెళ్ళి చూపుల్లో వారు చూసింది మాధవినా కాదా అని. మాధవి తల్లి దేముళ్ళకు మొక్కుకుంటూ ఉంటుంది, కేసు గెలవాలనీ, ఓడిపోతే తాము చేయించిన నకిలీ నగల విషయం అందరికీ తెలుస్తుందేమోనని భయపడుతుంటుంది. విచారణలో మాధవి పెళ్ళిచూపులకు వచ్చిన వారు ఏ రంగు బట్టలు వేస్కున్నారు, ఎక్కడ కూర్చున్నారు, ఏమేం మాట్లాడారు, ఏమేం పిండివంటలు ఎవరు ఎన్ని సార్లు వేయించుకున్నారు లాంటి విషయాలతో సహా చెప్పేసరికి కాదనలేక నిజం ఒప్పుకుంటారు. చివరగా గ్రామ పెద్ద అంటాడూ, ఇంత తెలివైన పిల్లకి పెళ్ళి చేసే బదులు చదువు చెప్పిస్తే బాగుండేది కదా అని.
ఉన్నతమైన ఆశయాలున్న మనుషులు కూడా సమాజంలో ఉన్న పరిస్తితులకి ఎలా లొంగిపోవాల్సొస్తుందో, ఎలా దిగజారాల్సొస్తుందో ఆమె చూపిస్తుంది. స్వర్గంలోనే నిర్ణయింపబడతాయనే పెళ్ళిళ్ళు, ఎంత వ్యాపారం, బేర సారాలు జరుగుతాయో, ఇంటికొచ్చే కోడలికి పెట్టే తిండి కూడా అనవసరపు ఖర్చు కింద జమకట్టే అత్తగారిళ్ళు, ప్రేమ లేని వివాహాలూ దాంపత్యాలూ అన్నిటినీ ఆమె తన కధల్లో ఎండగడుతుంది.

ఢెబ్బైల్లోగాని పుంజుకోని స్త్రీవాద సాహిత్యానికి, బలమైన పునాదులు ఆమె వేసినా, అనామకంగానే, ఎవరి మద్దతూ, సహకారం లేకుండా, వ్యకిగత జీవితంలోనూ, సాహిత్య ప్రపంచంలోనూ కూడా ఒంటరి ప్రయాణం చేసి నిష్క్రమించిన సరస్వతి అమ్మను ఈవిధంగా గుర్తు చేసుకోవడం నాకు సంతోషంగా ఉంది.

-Sharada Sivapurapu