Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? త్రివేణి కన్నడ

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి?  త్రివేణి కన్నడ

 

కన్నడ సాహిత్యంలో ఆధునిక నవలా ప్రక్రియలో రాసిన రచయిత్రుల గురించి చెప్పుకోవాలంటే త్రివేణి పేరుతో మొదలెట్టకపోతే అది సంపూర్తి కాదు. స్త్రీల సమస్యలను, వారి మానసికతను మొదటిసారిగా ఆవిష్కరించిన రచయిత్రి. ఆమె 35 ఏళ్ళ చిన్ని జీవితంలో చేసిన రచనలతోటే ఆమె ఎంతో పేరు తెచ్చుకుంది. ఆమె రాసిన నవలలు ఎన్నో కన్నడలో సినిమాలుగా తీసారు. వాటికి ఉత్తమ చిత్ర పురస్కారాలు కూడా వచ్చాయి.

1928 లో మైసూరు రాజ్యలోని మాండ్యలో పుట్టింది. గోల్డ్ మెడల్తో బీ ఏ పట్టా పుచ్చుకుంది. ఎస్ ఎన్ శంకర్ అనే ఇంగ్లీష్ ప్రొఫెస్సర్ని వివాహం చేసుకుంది.

ఆమె అసలు పేరు అనసూయ. త్రివేణి అనేది కలం పేరు. ఆ పేరు కూడా, తమాషాగా వచ్చి, అలా స్థిరపడిపోయింది. ఆమెకెప్పుడూ రెండు జడలు వేస్కునే అలవాటట. కాకపోతే రెండుకాదు మూడు జడలు వేస్కునేంత జుట్టు ఉంది నీకు అని అంటే ఆమె అప్పట్నుంచి త్రివేణి అనే పేరుతో రాయటం మొదలుపెట్టిందట. ఆమె ఒక ఇరవై నవలలు, మూడు కధా సంకలనాలు రాసింది. నవలల్లోని స్త్రీ పాత్రలు అన్నిటిలోనూ వాటి మానసిక సంఘర్షణల్నీ, విభిన్న పరిస్తితులు వాటిపై ఎటువంటి మానసిక ప్రభావాన్ని చూపిస్తాయి, మానసిక సంతులనం కోల్పోయిన స్త్రీలపట్ల వారి చుట్టూ ఉన్నవారి ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న అంశాలని ఆమె స్పృశించే తీరు అత్యంత ఆకట్టుకునే విషయమే కాకుండా అది ఆమె ప్రత్యేకత కూడా.

బెల్లి మోడ అనే నవలలోని హీరో మోహన్ కు ఇందిర అనే అమ్మాయికి పెళ్ళి కుదురుతుంది. ఇందిర తన తండ్రి ఎస్టేటు బెల్లి మోడకు వారసురాలు. మోహన్ ఫారిన్లో చదువుతుంటాడు. ఇందిరను పెళ్ళిచేసుకుంటే, ఆమె తండ్రి తరవాత తనే వారుసుడినవుతానని అతనికి ఆశ. కానీ అతను చదువు ముగించుకుని వచ్చే సరికి ఇక్కడ పరిస్తితి తారుమారవుతుంది. ఇందిర తల్లి ఒక మగ బిడ్డని ప్రసవించి చనిపోతుంది. ఇక ఆస్తి తనకు రాదు కాబట్టి, మోహన్ ఇందిరను పెళ్ళి చేసుకోవడానికి నిరాకరిస్తాడు. అయితే ఆతరవాత మోహన్ కి ఏక్సిడెంట్ అవుతుంది, అప్పుడు ఇందిరే అతనికి సేవ చేస్తుంది. అప్పుడు అతనికి ఇందిరపై నిజమైన ప్రేమ కలుగుతుంది. వివాహం చేసుకుంటానని అడుగుతాడు. కానీ ఇందిర నిరాకరిస్తుంది, అతని ప్రేమ తన డబ్బు మీద కానీ తన మీద కాదని. ఈ రకమైన ముగింపు కధకి, అందులోని స్త్రీ పాత్ర ఔదార్యాన్నీ, విచక్షణనీ ఎంతో చక్కగా ఎత్తి చూపుతుంది. మంచాన పడ్డ అతనికి సేవ చెయ్యడం మానవతా దృక్పధమైతే, వివాహాన్ని నిరాకరించడం తన స్వేఛ్చనీ, స్వతంత్రాన్నీ వదులుకోకుండా, వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని తీస్కునే నిర్ణయం, ఇందిరకున్న మానసిక పరిపక్వతని సూచిస్తుంది. కల్ల బొల్లి కబుర్లు చెప్పే మగవాడిని నమ్మి మోసపోయి దుర్భరమైన జీవితాన్ని గడిపే స్త్రీ పాత్ర అమాయకత్వాన్నీ చదివి చదివి ఉన్న పాఠకులకి ఇదొక గొప్ప ఊరడింపు.

శరపంజర అనే నవలలో కావేరి, సతీష్ అనే హీరో హీరొయిన్లు ప్రేమించి తల్లితండ్రుల అనుమతితో పెళ్ళి చెసుకుంటారు. డబ్బు, అందం చదువు, ప్రేమా ఉన్న ఈ దాంపత్యం కావేరి రెండోసారి గర్భవతి అయ్యేవరకు బాగానే సాగుతుంది. బలహీనంగా ఉన్న కావేరికి ఈ కానుపు కష్టం కావచ్చని, జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టరు చెబుతుంది. కావేరికి తనను పెళ్ళికి ముందు బలవంతంగా అనుభవించిన విషయం ఒకటి గుర్తుకొచ్చి మానసికంగా వ్యధచెందుతుంటుంది. చివరికి కొంత మానసిక సంతులత కోల్పోయిన కావేరిని పిచ్చాసుపత్రిలో చేర్పిస్తారు. ఆస్తితిలోనే ఆమె తన భర్తకి తనకిష్టం లేకుండా, జరిగిన ఆ సంఘటన గూర్చి చెప్తుంది.

చివరికి పిచ్చి కుదిరి ఇంటికి తిరిగి వచ్చినా, భర్త ఆమె చెప్పిన విషయాన్ని మర్చిపోలేక ఆమెకు దూరమవుతాడు. పిచ్చాసుపత్రినించి ఇంటికి వచ్చాకా, చుట్టుపక్కల వాళ్ళు, ఇంట్లోని పనివాళ్ళు కూడా ఆమె పట్ల చిన్నచూపు చూపిస్తుంటారు. ఇంతే కాకుండా భర్త వెంటపడితే గతంలో చీకొట్టిన ఒక అమ్మాయితోనే భర్త అక్రమ సంబంధం పెట్టుకోవడం కావేరిని బాధిస్తుంది. ఈ మానసిక సంఘర్షణ తట్టుకోలేక ఆమెకు మళ్ళీ పిచ్చెక్కి అదే ఆసుపత్రిలో చేరుతుంది. ఈపాటికి అందరికీ అర్ధమయ్యే ఉంటుంది ఇదే మన తెలుగులో వాణిస్రీ నటించిన కృష్ణవేణి సినిమా అని. కన్నడలో ఈ సినిమాకి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ నేషనల్ ఎవార్డ్ వచ్చింది. ఇంకా ఎన్నో ఇతర ఎవార్డ్స్ కూడా వచ్చాయి. భార్య శీలవతి అయుండాలని కోరుకునే భర్త తను మాత్రం ఎటువంటి సంకోచం లేకుండా అక్రమ సంబంధం పెట్టుకోవడం, కావేరి మానసిక సంఘర్షణ చిత్రించే తీరు అద్భుతం. ఈ సినిమా కన్నడలో కొన్ని థేటర్లలో సంవత్సరం పాటు ఆడిందట.


ఈమెవి ఒక ఆరు నవలలు సినిమాలుగా తీసారు. ఇంకొక రచయిత్రి పరిచయంతో మళ్ళీ వచ్చే వారం.

 

-Sharada Sivapurapu