Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? నిరుపమా దేవి (1883-1951)

 

 

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? నిరుపమా దేవి (1883-1951)

 

 

బెర్హంపూర్లో పుట్టిన ఈమెకు విద్యాభ్యాసం ఇంట్లోనే. పెళ్ళయిన సంవత్సరం లోపే అంటే 14 ఏళ్ళకల్ల భర్తను పోగొట్టుకుని జీవితమంతా విధవ రాలిగా గడిపేసింది. ఈమె అన్నగారూ, శరత్ చంద్ర చట్టోపాధ్యాయ్ కలిసి నడిపే ఒక పత్రికలోకి కధలు రాయమని ఈమెను ఇద్దరూ ప్రోత్సహిస్తారు. కొంచం ఆదరించి ప్రేమించే కుటుంబ సభ్యులున్నా కూడా, చెయ్యగల్గిన సహాయం ఏమీ లేదు ఒక విధవరాలికి. సంఘ సంస్కర్తలెప్పుడూ, సమాజంకన్నా ఒకడుగు ముందుంటారట. అలా ముందుకేసిన ఒకడుగు పరిమితిలో ఆమె విద్యాభ్యాసం (ఇంటనే)జరగడమూ, రాయమని ప్రోత్సహించడమూ సాధ్య పడ్డాయి అంతటి పేరున్న రచయిత అయిన శరత్ చంద్రకు కూడా. అలా కధలనుంచి, నవలల వరకూ ఎదిగి, స్వర్ణకుమారి (బంగ్లా లో మొట్ట మొదటి నవల రాసిన రచయిత్రి, రబీంద్రనాత్ ఠాగోరు అక్కగారు) తరవాత నవల్లు రాసిన బంగ్లా స్త్రీగా ఈమె పేరు తెచ్చుకుంది.

ఈమె రాసిన పది దాకా నవలల్లో అన్నీ కూడా కుటుంబ గాధావిష్కరణలే, బాగా పేరు తెచ్చిన నవల దీదీ అనే నవల. అవి స్వాతంత్ర్యోద్యమం పుంజుకుంటున్న రోజులు కాబట్టి ఆమె ఎన్నో కవితలు, పాటలు కూడా రాసిందట. అన్నీ కూడా అప్పటి పత్రికల్లో అచ్చయ్యేవి. ఆమె చేసిన సాహిత్య సేవకు గుర్తింపుగా ఆమెకు Calcutta University నుంచి "భుబన్మోహిని గోల్డ్ మెడల్ 1938, ఇంకా జగత్తారిణీ గోల్డ్ మెడల్ 1943" పురస్కారాలు లభించాయి.

స్వర్ణకుమారీ దేవి మొదటి నవలా రచయిత్రి అయినా, ఆమె నవలలు, చారిత్రిక అంశాలపై గానీ, వాస్తవ దూరమైన, ఊహాజనిత ప్రేమ గురించి కానీ సాగాయి. అసలు స్వర్ణ కుమారి రాసినవి మాత్రమే కాకుండా అప్పటి వరకూ వచ్చిన నవలల మూలాంశాలు సాధారణంగా అవే. అప్పటి మానవ సంబంధాలే కధాంశాలుగా సాగిన నవలలకి బంగ్లాలో శ్రీకారం చుట్టింది మాత్రం నిరుపమా దేవి.

నిరుపమా దేవి ఆడవారిపై రుద్దబడిన సాంఘిక దురాచారాల గురించి, బలవంతపు పెళ్ళిళ్ళ గురించి, భర్తల వివాహేతర సంబంధాల గురించి, విధవలైన స్త్రీలపై ఆచారాల పేరిట జరిగే అత్యాచారాల గురించి ధైర్యంగా రాసిన మొట్టమొదటి కొద్దిమంది స్త్రీ రచయిత్రుల్లో ఒకరు. శరత్ చంద్ర కూడా అదే టైంలో అవే అంశాల మీద కధలూ నవల్లు రాశాడు కాని, నిరుపమా దేవి రచనల్లో, ఒక స్త్రీ ధృక్కోణం నుంచి స్త్రీల సమస్యలు బయటపడి ఇంకాస్త వాస్తవిక ధృక్పధంతో సాగుతాయి.

ఆమె నవలల్లోని విధవ స్త్రీ పాత్రలు కౄరమైన సంఘ నియమాలను ఎదిరించి ప్రేమలో పడి, సంఘం చేత నలిపేయబడ్డ వారు. కొన్ని సార్లు మతాంతర ప్రేమలు కూడా ఆమెకు వస్తువులే. అసలు స్త్రీలు చదువుకోవడానికి స్వేచ్ఛ లేని రోజుల్లో విధవ అయుండి ఇలాంటి ప్రేమల గురించి రాస్తే సమాజం ఏమైపోవాలి? కానీ ఇలా రాయడానికి ఎంత ధైర్యం కావాలి? ఆ ధైర్యాన్ని, స్పూర్తినీ నిరుపమాదేవి తన తరవాతి రచయిత్రులకు అందించింది. పధ్నాలుగు ఏళ్ళకే విధవ అయిందని ఒక వాక్యంలో చెప్పేస్తాము కాని, ఒక పూర్తి జీవితాన్ని, అసంపూర్ణంగా గడుపుతూ, సామాజిక స్పృహతో రాయడానికి ఎంత మనోస్థైర్యం కావాలని అలోచిస్తే అర్ధమవుతుంది వాళ్ళు పడ్డ కష్టం. కాల్పనిక నవలా సాహిత్యానికి శరత్ చంద్ర అప్పటికే రారాజుగా వెలుగుతున్న రోజుల్లో వీరు రాయడం, వీరికి శరత్ చంద్ర కూడా అభిమాని అవడం చాలా సంతోషం కలిగించే విషయం.

నిరుపమా దేవి రాసిన ప్రతి కధా, నవలా స్త్రీల జీవితం లోని ఒక విలక్షణమైన అంశాన్ని గురించి రాసినవే. బాల్యంలోనే విధవ అయి వైవాహిక జీవితాన్ని అనుభవించక పోయినా, వివాహితల సమస్యల గురించి, భర్తల అక్రమ సంబంధాలు, భార్య ఉండగానే రెండవ పెళ్ళిళ్ళు వల్ల స్త్రీలు పడ్డ మానసిక సంఘర్షణ స్త్రీ కోణం నుంచి రాసిన తీరు అద్భుతం. ఎన్నో పాత్రలు సమాజ నియమాలను ఉల్లంగిస్తూ ప్రవర్తించినా, అన్నిట్లోనే తిరుగుబాటు ఒక్కటే పరిష్కారంగా చూపదు. ఉదాహరణకి 'దీదీ' అనే నవలలోని స్త్రీ పాత్ర చిన్న వయసులోనే పెళ్ళి చేసుకొని అత్తవారింటికి వస్తుంది. పట్నంలో చదువుకుంటున్న, అభ్యుదయ భావాలు కల భర్త, అక్కడ, ఉన్న తల్లిని కూడా పోగొట్టుకుని అనాధ అయిన ఒక పేద పిల్లపై జాలిపడి చేరదీస్తాడు. ఆ తరవాత అమెను వివాహం చేసుకుంటాడు. కాని ఈమె మాత్రం తన అత్తవారింట ఉండిపోతుంది. మంచం పట్టిన మామగారికి సేవ చేస్తుంది. ఆ ఇంటి సం రక్షణ భారాన్నంతా మోస్తుంది. వాళ్ళ పొలాలు, పనివాళ్ళు, ఆస్తుల వ్యవహారాలన్నీ చూస్తుంది. ఇది ఎంతవరకూ సాగుతుందంటే, ఆఖరికి భర్త కూడా అన్ని విషయాలకూ ఆమె మీద ఆధారపడేంత. రెండవ భార్యని కూడా స్వంత చెల్లిలిలాగానే ప్రేమించేంత. ఇదంతా చేయడం వల్ల ఆమె జీవితంలో మార్పు రాదు. కానీ ఓపికతో వ్యవహరించి, తనకన్యాయం చేసిన సమాజాన్నీ కుటుంబాన్నీ విడవకుండా, ఎదురుతిరగకుండా అందులోనే ఉంటూ తనపై సానుభూతినీ, తద్వారా ప్రేమనీ పొందేట్టు చేసుకోవడం, ఒక Passive revolution, నిశ్శబ్ద పోరాటం. ఆమె చెప్పదల్చుకున్న, చూపెట్టదల్చుకున్న అన్యాయాన్ని ఇంకా ఎఫ్ఫెక్టివ్ గా జనాలకి చూపెట్టటం.

బిధిలిపి అనే నవల లోని ముఖ్య పాత్ర తనకంటే వయసులో చాలా పెద్దవాడైన పురుషుడితో ప్రేమలో పడుతుంది. శ్యామిలీ అనే నవల ఒక గుడ్డి అమ్మాయి ప్రేమ కధ. అనుకర్ష అనే నవలలోని ఒక భక్తురాలు ఒక సాధువుతో ప్రేమలో పడుతుంది. ఇలా ఆమె రచనల్లోని పాత్రలు చాలా విలక్షణంగా, తామున్న కాలానికి అందనంత దూరంగా ప్రవర్తిస్తుంటారు. ఒకవేళ అటువంటి సంఘటనలూ, సందర్భాలూ ఆరోజుల్లో ఉన్నా వాటి గురించి రాసిన ధైర్యం చేసింది , మిగతావారు రాయడానికి ధైర్యం చేసేందుకు బాట వేసింది నిరుపమా దేవి తన రచనల ద్వారా.

తన జీవితపు చివరి రోజుల్లో వైష్ణవ సంప్రదాన్ని పాటిస్తూ, మధురలో తన శేష జీవితాన్ని గడిపిందట.

 


 

 

 

 

 

-Sharada Sivapurapu