Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? ఆశాపూర్ణా దేవి - బెంగాలి




మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి?

ఆశాపూర్ణా దేవి - బెంగాలి

 


ఆశాపూర్ణా దేవి జ్ఞానపీఠ్ ఎవార్డ్ గ్రహీత, కలకత్తాలో పుట్టింది. రచయిత్రులందరూ తెలుసుకోవాల్సింది, గర్వించాల్సిందీ, గుర్తుంచుకోవాల్సిందీ ఏంటంటే ఈమె మొట్టమొదటిగా జ్ఞానపీఠ్ ఎవార్డ్ కై ఎంపికైన రచయిత్రి. పెద్ద కుటుంబం, ఆడపిల్లలు, మగపిల్లలు, చుట్టాలు. అతి చాందస కుటుంబం. ఆడపిల్లలనేకాదు మగపిల్లలకు కూడా ఇంట్లోనే ట్యూటర్ ని పెట్టి చదువు చెప్పించారట. ఆడపిల్లలకి అది కూడా నిషిద్ధమే అయినా, తల్లి విద్యావంతుల కుటుంబం నుంచి రావటం, పుస్తకాలంటే ఉన్న పిచ్చి ప్రేమ వల్ల, మగపిల్లల పక్కన కూర్చునే రాయటం చదవటం సొంతంగా నేర్చుకున్న పరిస్తితి. వీరంతా కనపడిన పుస్తకమల్లా పోటీ పడి చదవటం, చర్చించుకోవటం, శ్లోకాలు అప్పచెప్పుకోవటం లాంటివే కాలక్షేపాలు. ఇదే ఉత్సాహంలో పదమూడేళ్ళ వయసులో ఒక కవిత రాసి రహస్యంగా ఒక పత్రికకి పంపిందట ఆశాపూర్ణ. ఆ కవిత అచ్చేయడమే కాకుండా, ఇంకా కధలూ కవితలూ రాసి పంపమని కోరాడట ఆ పత్రిక సంపాదకుడు. అలా మొదలయిన ఆమె డెబ్భైఏళ్ళ సాహిత్య ప్రస్థానం చనిపోయేవరకూ తారాస్థాయిలోనే కొనసాగిందట. పదిహేనేళ్ళకి పెళ్ళయింది. అయితే గృహిణిగా తన బాధ్యతలు నిర్వహిస్తూ ఆమె చేసిన కృషి అనితర సాధ్యం.

గాంధీ గారి స్వతంత్ర పోరాటం, రాజకీయంగా అనిశ్చిత పరిస్తితులు, మారుతున్న సమాజం, మత ఘర్షణలు, వేర్పాటు వాదాలు అన్నీ కలగలిపి ఉన్న వాతావరణంలో పెరిగిన ఆమెకు చిన్నప్పటినుండే కొన్ని జీవితాశయాలు, సాహిత్యాభిలాష, ఆడవారిపై సమాజంలో ఉన్న చిన్న చూపు, సంప్రదాయాల పేర వారికి జరుగుతున్న అన్యాయాల పట్ల నిర్దిష్టమైన అభిప్రాయాలు ఏర్పడ్డాయి.

ఆమె 242 నవల్లు, 37 కధా సంకలనాలు, కధల సంఖ్య 3000, 62 చిన్న పిల్లల పుస్తకాలు రచించిందట. ఈమె రచనల సంఖ్య మీద కొన్ని తేడాలు కనిపించినా వికీపీడియా సంఖ్యనే నేను తీసుకున్నాను.ఒకసారి కళ్ళు తిరుగుతాయి ఈ సంఖ్యలు చూస్తే. ఎలా సాధ్యమా, గృహిణి గా బాధ్యతలని నిర్వర్తిస్తూ అనేది అలోచనకందని విషయం. ఆమె రచనలన్నీ కుటుంబ జీవితం మీదా, ఆడవారి సమస్యలు, స్వేఛ్చకోసం చేసే వారి పోరాటాలమీదా, కేంద్రీకృతమైనవి. మహాశ్వేతా దేవితో సమానమైన రచయిత్రిగా ఈమెను బెంగాలు పాఠకులు గుర్తించినా, ఈమె ప్రతిభ దేశమంతా గుర్తింపబడలేదు. ఈమెకూ మహాశ్వేతా దేవికీ ఉన్న భేదమల్లా, ఈమె రచనలు కుటుంబల్లోని స్త్రీ పురుష సంబంధాలు, సమస్యలూ అయితే, మహాశ్వేతాదేవి ఈ పరిధి దాటి రచనలు చేసింది. ఇంత ఎక్కువగా రాసిందని ఆమె రచనల్లో వైవిధ్యం లేదనో, ఒకే మూసలో పోసినట్లు ఒకే రకమైన కధలూ, నవల్లూ అనుకుంటే పొరపాటే. అద్భుత కధా రచియిత్రిగా ఆమె పేరు బెంగాలు, అస్సాం రాష్ట్రాల్లో తెలియనివారు ఆమె కధలు చదవని పాఠకులు లేరంటే అతిశయోక్తి కాదట.

ఈమె కొచ్చిన ఎవార్ద్స్ కుదిస్తే ఇది. అతి ప్రతిష్టాత్మకమైన సాహిత్య అకేడమీ ఫెల్లోషిప్ కూడా ఆమెకు వచ్చింది. రాయటం చదవటం ఇంట్లో నేర్చుకుని, కేవలం స్వయంకృషితో ఇంత గుర్తింపు తెచ్చుకోవటం ఎంతో గొప్ప విషయం.

    The Lila Prize from the University of Calcutta (1954)
    The Bhutan Mohini Dasi Gold Medal (1966):
    The Raindrop Memorial Prize from the Government of West Bengal (1966)
    The Jnanpith Award (1976) for Prothom Protishruti[3]
    The Haranath Ghosh Medal from the Bangiya Sahitya Parishad (1988)
    The Jagattarini Gold Medal from the University of Calcutta (1993)


26 ఏళ్ళ వయసు వరకూ ఈమె కేవలం చిన్నపిల్లల కోసమే రాసిందట. ఆ తరవాతే ఆమె పెద్దవాళ్ళ నవలలు రాయటం మొదలు పెట్టింది. ఆమె ప్రతిభ తెలియడానికి ఒక కధని ఇక్కడ ప్రస్తావిస్తాను. చిన్న మస్త అనే కధలో ముఖ్య పాత్ర జయాబొతి ఒక విధవరాలు. తన కొడుకే తన ప్రాణంగా, ప్రపంచంగా బ్రతుకుతుంటుంది. పెద్దవాడయ్యాకా అతనికి పెళ్ళి చేస్తుంది. కోడలు వస్తుంది. వీరిద్దరికీ, చిన్న చిన్న విషయాలపైనే గొడవలు రావడం మొదలవుతుంది. తన విధవతనాన్ని ఎత్తి చూపుతూ కోడలు అన్న మాటలకు ఎంతో మనసు కష్టపడ్డ జయబొతి దేవుడిని తన కోడలికి తగిన పాఠం నేర్పమని వేడుకుంటుంది. కొన్నాళ్ళకి దురదృష్టవశాత్తూ, కొడుకు ఏక్సిడెంట్లో చనిపోతాడు. ఇద్దరికీ ప్రపంచం తలకిందులవుతుంది. అతి కష్టం మీద ఈ దుఖమ్నుంచి కోలుకుంటుంది జయబొతి. కానీ కధ ఇక్కడ అంతమవదు. జీవితంలో దెబ్బతిన్నాకా పొగరణిగిపోయిన కోడలిని ఎంతో ప్రేమ ఒలకపోస్తూ భోజనానికి రమ్మన్నపుడు కోడలు ప్రవర్తించిన తీరు చూసి ఒక సన్నటి చిరునవ్వు, విజయగర్వంతో కూడినది ఆమె పెదవులపై మెరుస్తుంది.

జయబొతిలో కొడుకు పోయిన దుఖం, విధవరాలుగా పడ్డ కష్టాలు, అంతకన్నా మించి, కోడలు తనమీద సానుభూతి కూడా లేకుండా అవమానించిందన్న, కోపం, పగ ఇన్ని ఇమోషన్స్ ఉన్నాయి. చివరగా, కేవలం కోడలి మీద పగతో అలోచిస్తే, ఆమెకూ తగిన శాస్తి జరిగిందని, విధవరాలుగా తను పడ్డ కష్టం ఏమిటో తెలిసొస్తుందన్న సంతోషం. ఇవన్నీ ఒకదానికొకటి పరస్పర విరుద్ధ భావోద్వేగాలే. అదే కదా మనిషికి ఎప్పుడూ సంఘర్షణ. ఎప్పటికీ ఇలాంటి ఏదో ఒక మానసిక సంఘర్షణలో పడి కొట్టుకపోవడమే మనిషి కలవాటు.

అయితే మనం ఇక్కడ ఆలోచించాల్సింది స్త్రీల సమస్యల పట్ల సానుభూతి ఉండి వారి పరిస్తితులు మారాలని, సమాజం మారాలని ఆశించిన ఆశాపుర్ణాదేవి ఇలా రాసి పాఠకులని, ఆమె రచనలని ఎంతో ఇష్టపడే పాఠకులని ఆమె ఎందుకు నిరాశ పర్చినట్టు? ఒక తల్లి పాత్రని అలా చిత్రించి ఆడవారిని ఆమె ఎందుకు ఇబ్బంది పెట్టినట్టు. ఆమె అభిమానులు కొందరు ఈ కధ చదివాకా ఆమె రచనలు చదవటం మానుకున్నారట. కానీ ఆడవారు కూడా, రాగ ద్వేషాలకి అతీతులేంకారు. ఆడవారి సమస్యల గురించి మాట్లాడితే, సీరియళ్ళలో ఆడ విలన్ల మాటేమిటి, భార్యా పీడితులైన, బాధితులైన భర్తల మాటేమిటని కొందరు అడుగుతారు. అసలు ఆడదాన్ని దేవతగా గుర్తించే ముందు ఒక మామూలు మనిషని గుర్తించడం ముఖ్యం కదా. ఆమె దేనికీ అతీతురాలు కాదు. అతీతం అనుకున్నపుడే ఆడవారిలోని దుర్గుణాలు మరీ ఎక్కువగా బాధిస్తాయి. నా ఉద్దేశ్యంలో ఒక రచయిత్రిగా ఇలాంటి స్టాండ్ తీసుకోవటానికి ఆరోజుల్లో చాలా గట్స్ కావాలి. అవి ఆమెకు పుష్కలంగా ఉన్నాయి. ఆమె కధలే కాదు, కధలను మలిచే తీరు కూడా అంతే ప్రతిభావంతంగా లోతుగా అలోచింపచేసేవిగా ఉంటాయట. మీకెప్పుడైన ఆశాపూర్ణాదేవి అనువాదాలు చదివే చాన్స్ వస్తే మాత్రం మిస్సవకండి. ఆమె ఒక అద్భుతమైన రచయిత్రి.

 

 

 

....Sivapurapu Sharada