Facebook Twitter
గ్రామీణ జీవితాన్ని పూర్తిగా అవలోకనం చేసుకున్న వరలక్ష్మి

 

గ్రామీణ జీవితాన్ని పూర్తిగా అవలోకనం చేసుకున్న వరలక్ష్మి

 


       తెలుగు కథా రచయిత్రుల్లో కె. వరలక్ష్మి స్థానం విశిష్ఠమైంది. కేవలం ఉన్నతవర్గాలు, కులాలకు చెందిన స్త్రీ జీవితాలనే కాకుండా బిసి, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన స్త్రీల జీవితాలను అత్యంత సహజంగా రాశారు. గ్రామీణ జీవితాన్ని పూర్తిగా అవలోకనం చేసుకున్న వరలక్ష్మి తన రచనల్లో వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. కేవలం స్త్రీని స్త్రీ కోణం నుంచి కాకుండా సమాజం దృష్టితో చూడడం ఈమె రచనల్లోని ప్రత్యేకత. మారుతున్న సామాజిక పరిణామాల్లోని వ్యక్తుల, కౌటంబిక జీవనం, వృత్తులపై ఆధారపడిన వారి జీవన సరళిని సూక్ష్మ దృష్టితో పట్టుకొని రచనలో అందిస్తున్నారు వరలక్ష్మి. వ్యక్తి ఒంటరై పోతున్న నేటి తరుణంలో వారి జీవన సంవేదనల్ని, ఘర్షణల్ని వివరిస్తున్నారు కథల ద్వారా.
     కె. వరలక్ష్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేటలో 1946 అక్టోబరు 24న జన్మించారు. మొదటి కథను ఎనిమిదో తరగతి చదువుకునే రోజుల్లోనే రాశారు. రంగనాయకమ్మ వంటి స్త్రీవాద రచయిత్రుల రచనల్ని చదువుతూ తనదైన దృక్పధాన్ని ఏర్పరచుకున్నారు. ఇప్పటి వరకు సుమారు వందకు పైగా కథలు రాశారు. నాలుగు నవలికలు రాశారు. కవితలు, వ్యాసాలు కూడా రాశారు. అంతేకాదు కొన్ని నాటికలు కూడా రచించారు. 1985 నుంచి కథలు రాస్తున్నారు. ముద్రితమైన వీరి మొదటి కథ "రిక్షా". ఈ కథ జ్యోతి మాసపత్రికలో ముద్రితమైంది. ఇంటర్య్వూ, ఆశాజీవులు, ఆనకట్ట, ఆగమనం, ఆకస్మికం, కుక్క కరిచింది, గండుచీమలు, క్షతగాత్ర, ఎవరి హోప్ లెస్ ఫెలో, ఏ గూటి చిలుక, చెవిలో పువ్వు, గమనం, గుప్తం, ఛిద్రం, స్పర్పపరిష్వంగం, సంధ్యాసమస్యలు, సమానత్వం వంటి ఎన్నో కథలు వీరి ఇతివృత్తాన్ని నేపథ్యాన్ని, శిల్ప చతురతను పట్టిస్తాయి.

      వీరి కథలు జీవనరాగం, మట్టి - బంగారం, అతడు - నేను సంపుటాలుగా వచ్చాయి. వీటిలో మొత్తం 47 కథలు ఉన్నాయి. ఇంకా "ఆమె" పేరిట కవితా సంపుటిని కూడా వెలువరించింది. "విహంగం" అనే అంతర్జాల పత్రికలో "నా జీవనయానం" పేరుతో ఆత్మకథను రాశారు."అతుడు - నేను" కథలో ప్రేమించి పెళ్లి చేసుకున్న స్త్రీని భర్త, అత్త ఎంతో వేధిస్తారు. కానీ భర్తకు పక్షవాతం, అత్తకు వయసు వచ్చి మంచాన పడ్డప్పుడు ఓపికతో ఆమె సేవలు చేస్తుంది. చేస్తూ స్నేహితురాలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ- జీవించడానికి ముఖ్య లక్షణం ప్రేమ, ఇతరులను జీవింపజేయడానికి కావల్సింది ముఖ్య లక్షణం మనుషుల మీద నమ్మకం, జాలి, దయ, ప్రేమ. ప్రపంచాన్ని, మనుషుల్ని ప్రేమించలేని స్థితి విషాదకరమైంది అని చెప్తుంది. ఇది కేవలం కథలోనే కాదు. ప్రతి మనిషి తెలుసుకోవలసిన జీవన సూత్రం. అలానే "పక్షులు" కథలో భార్యా భర్తలు విడిపోయేటప్పుడు కొడుకు తండ్రి దగ్గరే ఉంటాను అంటాడు. 15 ఏళ్లు పెంచిన తల్లిని కాదని తండ్రి దగ్గరకు వెళ్లడానికి గల కారణం అతని దగ్గర డబ్బు ఉండడమే. అప్పుడు ఆ తల్లి పడే వేదనను ఈ కథ సహజంగా వర్ణిస్తుంది. మరో కథ "గండుచీమలు". ఈ కథలో మధ్యతరగతి రైతు సొంత ఇంటిని కూడా అమ్మి కొడుకును ఇంజినీరింగ్ చదివిస్తాడు. అతనికి పెద్ద ఉద్యోగం వచ్చిన తర్వాత, ఊళ్లో ఇల్లు కట్టాలనుకొని తండ్రికి డబ్బు ఇచ్చి, ఆబాధ్యతను అప్పజెప్తాడు. తండ్రి చాలా ప్రేమగా, కష్టపడి ఇంటిని కట్టిస్తాడు. కానీ చివరకు ఆ ఇళ్లు గుత్తేదారుకు అద్దెకు ఇవ్వడానికి అని తెలుస్తుంది. ఇలా మానవ సంబంధాల్లో వచ్చిన ఆర్థిక మార్పును మానవీయ కోణంలో చెప్తాయి వీరి కథలు.
       "మట్టి- బంగారం" కథలో గొల్లల అయోద్ది రాముడు గొర్రెల పెంచుతుంటాడు. కానీ ఆ గొర్రెలను అమ్మి పెంకులు తయారు చేసే మిల్లులో వాటా దారునిగా చేరతాడు. చివరకు దివాలా తీస్తాడు. కానీ ముసల్ది ముందే ఓ జీవన సత్యాన్ని చెప్తుంది- ఎవడన్నా పేణం ఉన్న జీవాలమ్ముకొని పేణం లేని మిల్లు కొనుక్కుంటాడ్రా.. అని. మొత్తంమీద వరలక్ష్మి కథలు సగటు స్త్రీ జీవన సంవేదనల్ని, కుటుంబ సామాజిక హింసల కలగాపులగాల మధ్య నలుగుతున్న స్త్రీల బాధల్ని వివరిస్తాయి. ఎరుకలు, చాకలి, గొల్ల, మేదర, తప్పెటగుళఅలు, భోగం, కోయ, గిరిజన కులాల స్త్రీల జీవితాల లోతులను పట్టిస్తాయి. తరచి చూపిస్తాయి. అసలు ఈమె కథలు పల్లె వాతావరణంలోని స్త్రీల ఆర్థిక, మానసిక స్థితుల నుంచే పుట్టాయి. తనకు తెలిసిన, చూసిన, అనుభవించిన సంఘటనలు, సన్నివేశాల నుంచే కథా వస్తువును ఎన్నుకుంటారు వరలక్ష్మి. స్త్రీల అణచివేత, దౌష్ట్రీకానికి బలవడం, ఎదురు తిరగలేని నిస్సహాయత వీరి కథల్లో బలంగా కనిపిస్తుంది.
      కె. వరలక్ష్మి కథా శిల్పం విషయానికి వస్తే కథ రాసినట్లు కాకుండా చెప్తున్నట్లు ఉంటుంది. కథ ఎత్తుగడకు, ముగింపుకు సంబంధం ఉంటుంది. వీరి శైలి గోదావరి జిల్లాల్లోని బడుగల జీవన నిరలంకార సౌందర్యంతో ఉంటుంది. వీరికి ఎన్నో అవార్డులు వచ్చాయి. చాసో పురస్కారం, రంజనీ అవార్డు, ఆటా తానా పురస్కారాలు, అభో విజా, రంగవల్లి అవార్డు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం, 2014లో సుశీలా నారాయణరెడ్డి అవార్డు వచ్చాయి. "పల్లెటూళ్లో చెరువుకెళ్లి చిన్నబిందెతో మంచి నీళ్లు తెచ్చుకునే ఒకమ్మాయి, ఈ లోకంలో కథా రచయితగా నిలదొక్కుకునేలా చేసిన సాహిత్యానికి నేనెప్పుడూ తలవంచి నమస్కరిస్తాను" అని వినమ్రంగా చెప్తారు కె.వరలక్ష్మి   

.....డా. ఎ.రవీంద్రబాబు