Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? రాసుందరి దేవి


మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? రాసుందరి దేవి


రాసుందరి దేవి బెంగాల్లో కోల్కట్టా కి దూరంగా ఉన్న ఒక చిన్న గ్రామంలో ఒక పేద కుటుంబంలో పుడుతుంది. తండ్రి చిన్నప్పుడే చనిపోతే, తల్లి, బంధువులు ఆమెను పెంచుతారు. తన తండ్రి ఇంట్లో ఒక మిషనరీ స్త్రీ అబ్బాయిలకి మాత్రమే ఒక చిన్న స్కూల్ నడిపేదీ. రాసుందరీకి చదువు చాలా ఇష్టం కానీ ఆ రోజుల్లో ఆడపిల్లలు చదువుకోకూడదు. అందుకని దొంగతనంగా ఆ పక్కనా ఈ పక్కనా దాక్కుని వింటూండేదట. ఇది ఇలా జరుగుతుండగా పన్నెండేళ్ళ వయసులో ఆమెకి పెళ్ళి చేస్తారు. అప్పట్లో పెళ్ళీడు అదే. ఎందుకు వెళుతోందో, ఎక్కడికి వెళుతోందో కూడా తెలియకుండా కొత్త మనుషులందరితో కలిసి పడవలో పెళ్ళికూతురి బట్టల్లో భర్త ఉండే చోటకి వెళ్ళాల్సినపుడు ఏడుస్తుంటే, తల్లి దేముడెప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. నువ్వెప్పుడూ ఒక్కదానివి కాదు చెబుతుంది. అది మొదలు దేముడిపై ఆమె విశ్వాశం చాలా పెరిగిపోతుంది. దేముడు ఎప్పుడూ తనతో ఉన్నాడన్న విశ్వాశం ఆమె తన రచనలో ఎప్పుడూ ప్రకటిస్తూనే ఉంటుంది.

అమర్ జీబన్ అనే ఆమె ఆత్మ కధ ఆమె చిన్నతనమ్నుంచి ఆమె కధని చివరి వరకూ రాసుకొస్తుంది. ఇది ఆమె చేసిన ఒకే ఒక్క రచన. ఈ ఒక్క రచన వల్ల ఆమె ఎందుకు ఇంత పేరు తెచ్చుకుంది అనేది, అది రాయటానికి ఆమె ఎంత కష్టపడిందీ, ఎన్ని అడ్డంకులు సమాజపరంగా ఎదుర్కొంది, అసలు ఆనాటి సమాజం ఏతీరులో ఉంది, అందులో ఆడవారి పర్తిస్తితి ఏంటి అనే విషయాల వల్ల కానీ మనకి అర్ధమవదు. అన్నిటి కన్నా గొప్ప విషయం ఏంటంటే ఇది రాసి ఆమె బెంగాలీలోనే కాకుండా, భారత దేశంలోనె మొట్ట మొదట ఆత్మ కధ రాసిన స్త్రీగా పేరు తెచ్చుకుంది. అంటే పురుషులెవరో ఆమెకన్నా ముందు రాశారని కాదు. ఆమెదే మొట్టమొదటి ఆత్మ కధ భారత దేశ సాహితీ చరిత్రలో.

ఇక ఆమె రాయడానికి ఎంత కష్టపడిందో, అక్షరాలు ఎలా నేర్చుకుందో తెలుసుకుందాం. ఆరోజుల్లో ఆడవాళ్ళు చదువుకోకూడదు, అలా ఊరికే అంటే కుదరదు కదా వాళ్ళను భయపెట్టాలి బెదిరించాలి, చదువుకుంటాను అని అనకుండా. ఎలా అంటే, ఆడవాళ్ళు చదువుకుంటే మొగుడు చనిపోతాడు, ఆడది విధవ అవుతుంది, విధవ అయితే ఎంత కష్టం ఆడవాళ్ళకి తెలుసు కదా. సగం మంది ఆమాటకే జడిసి ఊరుకుంటారు, ఇంక మరి మొగుడుగారిని చంపిన పాపానికి శిక్ష కూడా ఉండాలిగా, అది వెలివేయటం తక్కువలో తక్కువ శిక్ష అయితే, ప్రాణం తియ్యడం పెద్ద శిక్ష. ఇంక ఎవరు ధైర్యం చేస్తారు చదవడానికి గాని చదివించడానికి గాని. ఆరోజుల్లో పెద్ద మనుషులైనా ఉన్నత వర్గాల తండ్రులైనా తమ ముద్దుల కూతుళ్ళకి చదువు రహస్యంగా చెప్పినా, అది వారు కూడా రహస్యంగా ఉంచే పక్షంలోనే. అది కూడా పెళ్ళితో కట్టు. ఇదీ బెంగాల్లోని గ్రామీణ వాతావరణం స్త్రీలకి సంబంధించినంత వరకూ. ఇక పెళ్ళితరవాత కట్టుబాట్లు, బాధ్యతలూ, ఆచార వ్యవహారాలు అన్నీ కూడా స్త్రీలను నాలుగ్గోడల మధ్య బంధించేవే కానీ ఎటువంటి వెసులుబాటయితే లేదు కదా.
ఇటువంటి సామాజిక వత్తిడి ఉన్నపుడు రాసుందరి దేవి రహస్యంగా తన కొడుకు పుస్తకంలోంచి కొన్ని పేజీలు, భర్త చదివే చైతన్య భాగవత్ అనే పుస్తకం లోని పేజీలు చింపి అక్షరాల్ని తను విన్న శబ్దాలని బట్టి మాచ్ చేసుకుంటూ తన 25 వ ఏట మొదలుపెట్టి 40 లు దాటాక రాయటం చదవటం నేర్చుకుంటుంది. ఇదంతా మొదట ఆమె చదవాలనుకున్న గ్రంధం ఆ చైతన్య భాగవత్ కోసమే చేస్తుంది. తరవాత చిన్నగా రోజులు తారీకులు గుర్తు పెట్టుకుంటూ తన కధ రాయటం మొదలు పెడుతుంది. ఈ క్రమంలోనే ఆడదైన కారణంగా ఇలా దొంగలాగా చదువుకోవాలా అని ప్రశ్నిస్తుంది. ఇంట్లో ఎవరూ చూడకుండా, తనకు దొరికే అతి కొద్ది తీరిక సమయాల్లో ఎవరూ చూడకుండా రాయటం ఎంత కష్టం. అయితే ఈమె చదవటం నేర్చుకోవడం కొన్నేళ్ళకి ఇంట్లో తెలుస్తుంది, కాని అదృఇష్ట వసాత్తూ ఎవరూ దాన్ని పట్టించుకోరు. కొడుకు రాయటానికి కావాల్సిన ఇంక్, పేపర్ అవీ తెచ్చిస్తాడు కానీ ఎవరూ ఆమెకు నేర్పరు.

ఈమె సుమారు పధెనిమిదేళ్ళ వయసు నుండి 41 సంవత్సరాల్లో 13 సార్లు గర్భం దాల్చి అందులో 7 గురు పిల్లల్ని పోగుట్టుకుంటుంది. భర్త డబ్బున్న ఆసామే అయినా ఇంట్లో పనిమనుషులని పెట్టని కారణంగా ఇంటెడు చాకిరి, పిల్లలు, గర్భాలు, వంట పని, ఇంక ఇతర ఆచారాలు ఇంట్లో పశువుల పని అంతా కూడా ఎటువంటి సహాయం లేకుండా ఒంటరిగా, ఎవరి సానుభూతి లేకుండా చేసుకురావటం. ఆడదై పుట్టినందుకు ఇంత పని నిర్విరామంగా చెయ్యాల్సి రావటాన్ని నిరతం ప్రశ్నించుకుంటూ సాగుతుంది ఆమె రచన.

ఇంత కష్టపడి, ఏ గురువూ లేకుండా నేర్చుకున్న విద్యతో వచనంలో సాగిన ఆమె రచనా శైలి అద్భుతం అని ఆమె రాసిన రెండవ ఎడిషన్కి ముందు మాట రాసిన జ్యోతిరింద్రనాత్ ఠాగోర్, రవీంద్రనాథ్ ఠాగోర్ అన్నగారు మెచ్చుకుంటాడు. జ్యోతిరింద్రనాత్ ఠాగోర్ ఒక ఎడిటర్, నాటక కర్త, పైంటర్, సంగీత విద్వాంసుడు. ఆమె ఆత్మకధ మొదటి ఎడిషన్ ఆమె భర్త చనిపోయిన తరవాత తన 60 వ ఏట ప్రచురిస్తుంది. రెండవది ఆమె 88వ ఏట 1897 లో ప్రచురిస్తుంది. ఇలా ఆమె సమాజం నుంచి నిందను, భర్తకేమైనా జరిగే పక్షంలో ఎదుర్కోడానికి అతన చనిపోయేవరకు ఆగుతుంది. భర్త చనిపోయాకా భార్యకి హిందూ మతం చేసే రిచ్యువల్స్ ని ఆమె బాధాకరంగా వర్ణించి నిరసిస్తుంది. నాలుగ్గోడలకి పరిమితమైన జీవితం, నిరంతర శ్రమనూ, ప్రేమకూ, సానుభూతికీ నోచుకోని, గుర్తింపు లేని జీవితాన్నీ ఆమె నిరసిస్తుంది. ఆమె కధనే ఆమె చెప్పినా ఇది ఒక రకంగా సమాజం స్త్రీల పట్ల చూపే వివక్షను, పితృస్వామ్యం లోని నిరంకుశత్వాన్నీ వర్ణిస్తూ చేసిన తిరుగుబాటు కొంచం వీక్ అయినా కూడా, ఆనాటి స్త్రీల జీవితాలెలా ఉన్నాయో తెలిపే అద్భుత ప్రయత్నం.
ఒక జీవిత కాలమంతా ఒకే ఒక ఆశ, ఆశయంతో, తన బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూ సమాజానికి ఎదురీదకుండా, రహస్యంగా తన Life's missionసాధించడం, అలా చేయడంలో ఒక record సృష్టించడం నిజంగా ఒక ఆదర్శనీయమైన అద్భుత ప్రయాణం ఏమో. ఆమె రాసిన ఆత్మ కధ అలాంటి ఎన్నో రచనలకి భవిష్యత్తులో పునాది లాంటిదనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదేమో.

రెండు వేరు వేరు ప్రదేశాల్లో, వేరు వేరు సంస్కృతులుల్లో, కాలాల్లో జరిగే కధల గురించి రాసినా, Alice Walker రాసిన The Colour Purple అనే పుస్తకంలో ప్రొటాగనిస్ట్ సిలీ జీవితంలో జరిగే విషయాలూ రాసుందరి జీవితమూ ఒకే రకంగా ఉంటాయి. ఇద్దరికీ దేముడిమీద అపారమైన నమ్మకం, దేముడితో జరిగే సంభాషణలూ, విన్నపాలూ, ప్రశ్నలూ ఆడవారి దుఖ భరిత జీవితం గురించి బాధ పడటం ఇవన్నీ కూడా ఒకేలా ఉంటాయి.

 

 

 

 

- Sivapurapu Sharada