ALSO ON TELUGUONE N E W S
  'ఆర్.ఆర్.ఆర్'లో ఎన్టీఆర్ సరసన నటించేది ఎవరు? బ్రిటన్ బ్యూటీ డైసీ ఎడ్గార్ జోన్స్ తప్పుకున్న తర్వాత పలువురి పేర్లు వినిపించాయి. హిందీ హీరోయిన్లు శ్రద్ధా కపూర్, పరిణితి చోప్రా, కృతిసనన్... దక్షిణాది భామ నిత్యా మీనన్ తదితరుల్లో ఎవరో ఒకరిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. వీటిపై దర్శకుడు రాజమౌళి గాని... 'ఆర్.ఆర్.ఆర్' యూనిట్ సభ్యులు గాని స్పందించలేదు. పుకార్లు షికార్లు చేశాయి. అయితే... రాజమౌళి దృష్టిలో వీరెవరూ లేరట! విదేశీ భామ కోసమే ఆయన అన్వేషణ సాగిస్తున్నారట. కథ ప్రకారం విదేశీ భామకు, ఎన్టీఆర్ కు మధ్య లవ్ ట్రాక్ ఉందట. అందువల్లనే, డైసీ ఎడ్గార్ జోన్స్ ను తీసుకున్నారు. ఆమె తప్పుకోవడంతో ఆ స్థానంలో మరో విదేశీ భామను ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నారట. ఈ తరుణంలో రాజమౌళికి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ సలహా ఇచ్చారట. శ్రీలంక సుందరి జాక్వలిన్ ఫెర్నాండేజ్ ని కథానాయికగా తీసుకోమని కోరారట. ఇవ్వడానికి జాక్వలిన్ శ్రీలంక దేశస్థురాలు అయినా... ఆమెలో బ్రిటిష్ పోలికలు ఉంటాయి. సో... ఎన్టీఆర్ కు జోడీగా ఆమెను ఎంపిక చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 'ఆర్.ఆర్.ఆర్'లో ఇద్దరు బాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు. సినిమాలో మరో హీరో రామ్ చరణ్ కి జోడీగా అలియా భట్ నటిస్తుండగా... ఓ కీలక పాత్రలో అజయ్ దేవగణ్ నటిస్తున్నారు. జాక్వలిన్ కూడా ఎంపికైతే హిందీలో సినిమాకు మరింత క్రేజ్ వస్తుంది.
  పాపం... యువ హీరో నిఖిల్ అదృష్టం అసలు ఏమాత్రం బాగోలేదు. ఇప్పటికే విడుదల కావాల్సిన అతని తాజా చిత్రం 'అర్జున్ సురవరం' మరోసారి వాయిదా పడింది. ఇంతకు ముందు సినిమా యూనిట్ జనాలే సినిమా విడుదలకు అడ్డు పడ్డారు. రషెస్ చూసి మళ్లీ రీషూట్ చేయాలని నిర్ణయించుకోవడంతో విడుదల వాయిదా పడింది. అయితే... అప్పట్లో ఇవేవీ బయటకు చెప్పలేదు. విడుదల వాయిదా పడుతున్న విషయాన్ని మాత్రం ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. 'స్వామి రారా', 'కార్తికేయ' సినిమాల విడుదల కూడా ఇదేవిధంగా వాయిదా పడ్డాయని... విడుదల వాయిదా పడిన తన ప్రతి సినిమా విజయం సాధించిందని నిఖిల్ చెప్పాడు. ఇప్పుడు సినిమా ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు విడుదల చేసుకోవచ్చు. కానీ, విడుదల చేయలేని పరిస్థితి. ప్రేక్షకుల్లో భయంకరమైన క్రేజ్ కల హాలీవుడ్ సినిమా 'అవెంజర్స్ ఎండ్ గేమ్'కి రెండు తెలుగు రాష్ట్రాలలో మెజారిటీ థియేటర్లు కేటాయించారు. ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి టాక్ తెచ్చుకున్న 'జెర్సీ', విమర్శకుల సమీక్షలతో సంబంధం లేకుండా వసూళ్లలో దూసుకువెళ్తున్న 'కాంచన 3' కొన్ని థియేటర్లలో ఉన్నాయి. దాంతో నిఖిల్ 'అర్జున్ సురవరం'కి థియేటర్లు దొరకడం లేదు. చేసేదేంలేక సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయమై ముందుగా ఏయషిన్ సినిమాస్ ‌స్పష్టత ఇచ్చింది. దాపరికాలు లేకుండా థియేటర్లో దొరకని కారణంగా విడుదల వాయిదా వేస్తున్నట్టు... మహర్షి విడుదల తర్వాత మంచి తేదీ చూసి విడుదల చేస్తామని ఏషియన్ సినిమాస్ పేర్కొంది. తర్వాత నిఖిల్ స్పందించాడు. "సినిమా విడుదలను వాయిదా వేయడం బాధాకరం అయినప్పటికీ...  డిస్ట్రిబ్యూటర్ల నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. నేను కూడా ప్రేక్షకుల గ్రాండ్ రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నా. ఈ సమయంలో నాకు ప్రేక్షకులతో పాటు అత్యవసరం. ఇన్ని రోజులు ప్రేక్షకుల్ని వెయిట్ చేయించినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలుపుతున్నా" అని నిఖిల్ ఓ లేఖ విడుదల చేశాడు. 'మహర్షి' విడుదల తర్వాత కూడా చాలా సినిమాల్లో లైన్ లో ఉన్నాయి. వాటి మధ్య నిఖిల్ ఎప్పుడొస్తాడో?
  ఇటీవ‌ల కాలంలో హీరోల‌కు ఏదో ఒక లోపం పెట్టి సినిమాలు స‌క్సెస్ కొడుతున్నారు ద‌ర్శ‌కులు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `రంగ‌స్థ‌లం`లో రామ్ చ‌ర‌ణ్ వినికిడి లోపం ఉన్న వాడిగా న‌టించి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాడు. న‌టుడుగా త‌న సత్తాను చూపించాడు. ఈ కోవ‌లో మ‌రో మెగా హీరో మూగ వాడిగా నటిస్తున్న‌ట్టు స‌మాచారం అందుతోంది. ఒక‌సారి వివ‌రాల్లోకి వెళితే... మెగా మేన‌ల్లుగు సాయితేజ్ (సాయి ధ‌ర‌మ్ తేజ్) త‌మ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఒక సినిమా లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ పై తెర‌కెక్కుతోంది. అయితే ఈ సినిమాలో హీరో మాట‌లు రాని జాల‌రిలా న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. తొలి సినిమానే ఒక ఛాలెంజింగ్ రోల్ లో న‌టిస్తున్నాడు వైష్ణవ్ తేజ్.  దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈచిత్రంలో కేర‌ళ కుట్టి హీరోయిన్ గా న‌టిస్తోంది. త్వ‌ర‌లో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశాలున్నాయి.
  డ్యూయ‌ల్ రోల్ లో మాస్ మ‌హ‌రాజా న‌టిస్తోన్న లేటెస్ట్ సినిమా `డిస్కో రాజా`. సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతోన్న ఈ సినిమా  సంక్రాంతికి ఎట్టి ప‌రిస్థితుల్లో తీసుక‌రావ‌డ‌నికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. వి ఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఇప్ప‌టికే క్రేజ్ నెల‌కొంది. ఇటీవ‌లే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున‌ని నెక్ట్స్ షెడ్యూల్ మే మూడో వారంలో జ‌రుపుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. గ్రాఫిక్ వ‌ర్క్ ఎక్కువ‌గా ఉండ‌టంతో శ‌ర‌వేగంగా షూటింగ్ పూర్తి చేసి దానిపై దృష్టి సారించ‌నున్నాడ‌ట ద‌ర్శ‌కుడు. ఇందులో ర‌వితేజ్ తండ్రీ కొడుకులుగా డ్యూయ‌ల్ రోల్ లో న‌టిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తేనున్నారు. గ‌తంలో సంక్రాంతి సీజ‌న‌కు వ‌చ్చిన కృష్ణ‌, మిర‌ప‌కాయ్ చిత్రాలు హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఈ నేప‌థ్యంలో `డిస్కో రాజా` చిత్రాన్ని కూడ సంక్రాతికి తీసుకరానున్నారు. పాయ‌ల్ రాజ్ పుత్, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ సినిమాను రామ్ తాళ్లూరి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. చూద్దాం మ‌ళ్లీ ఈ సినిమాతో మాస్ రాజా మ‌రోసారి స‌క్సెస్ అందుకుంటాడో లేదో.
  మేనల్లుడు నాగచైతన్యతో కలిసి విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సినిమా 'వెంకీ మామ'. మరి, ఈ 'వెంకీ నాన్న' ఎవరు? ఇదేం టైటిల్ అనుకుంటున్నారా!? ఫొటో చూశారా? అందులో ఉన్నది నాన్నే మరి! ఇటీవల వెంకీ పెద్ద కుమార్తె ఆశ్రిత పెళ్లి జరిగింది కదా. ఆ పెళ్లి ఫొటోల్లో ఇదొకటి. సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫొటోలో కళ్లజోడు పెట్టుకున్న ఆవిడ నీరజ. వెంకటేష్ సతీమణి. ఆమె కాకుండా మిగతా వాళ్ళందరూ వెంకీకి కుమార్తెలే. వెంకీకి నాగచైతన్య మేనల్లుడు కనుక... మేనల్లుడి భార్య ఆయనకు కుమార్తె వరస. ఆ లెక్కన వెంకీకి సమంత కుమార్తె. కళ్ళజోడు సోఫా మీద పెట్టి కూర్చున్న అమ్మాయి (ఫొటోలో లెఫ్ట్) వెంకీ అన్నయ్య సురేష్ బాబు కుమార్తె. వెంకీకి కూడా కూతురే కదా! మిగతా ముగ్గురూ వెంకటేష్ సొంత కుమార్తెలు. పెద్ద కుమార్తె పెళ్ళిలో కుటుంబంలో కుమార్తె వరస అయ్యేవారందరితో వెంకటేష్ దంపతులు ఇలా ఫొటో దిగారన్నమాట.  
  ‘మార్పు’ అనగానే భయపడతాం. అది ఎప్పుడైనా, ఎలా అయినా, ఎవరినైనా కాస్త ఇబ్బంది పెట్టే పదం. కొత్తగా స్కూల్లో వేసిన కుర్రాడు భోరుభోరున ఏడుస్తూ స్కూలుకి వెళ్ళనని మారాం చేస్తుంటాడు. ఇంటిని, అమ్మని వదిలి కొత్త చోటుకి వెళ్ళటం అంటే వాడికి భయం. ఆ ‘మార్పు’ని ఎలా ఎదుర్కోవాలో ఆ చిన్న బుర్రకి తెలీక పేచీ పెడతాడు. కొన్ని రోజులకి ఆ మార్పుకి అలవాటు పడి, హాయిగా స్కూలుకి ఏ పేచీ లేకుండా వెళ్ళిపోతాడు. కాస్త సమయం పడుతుంది అంతే. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ, పెద్దయినా ‘మార్పు’కి భయపడుతూనే వుంటాం. రొటీన్ జీవితానికి పురోగతి నిల్:- నిజానికి అలవాటైన పరిస్థితులకు అంటిపెట్టుకున్నంతసేపూ ఎవరి జీవితంలోనూ పురోగతి వుండదు. వాటికి దూరమైనప్పుడు సహజంగానే అనిశ్చితి, అసౌకర్యం ఎదురవుతాయి. అలా ఎదురైన అసౌకర్యం సౌకర్యవంతంగా మారటానికి ‘కొద్దిగా’  సమయం పడుతుంది. అప్పుడే ఎదుగుదల సాధ్యపడుతుంది. ఉదాహరణకి కొత్తగా ఏదైనా చేయాలనే తపన ఎందరిలోనో వుంటుంది. కానీ, ధైర్యంగా ముందుకు అడుగు వేసి ఓ ప్రయత్నం చేసే సాహసం కొందరే చేయగలరు. వారు విజేతలుగా జేజేలు అందుకుంటారు కూడా. అందుకే అంటారు ‘ప్రయత్నమే పెద్ద విజయం’ అని. మనమూ పిల్లలమే:- మనమందరం కొద్దో గొప్పో స్కూలుకు వెళ్ళనని మారాం చేసే పిల్లాడితో సమానమే. కొత్త పరిసరాలు, పరిస్థితులు, వ్యక్తులు ఎదురవుతుంటే భయంతో బిగుసుకుపోతాం. ఒకోసారి అలా కొత్తవాటిని ఎదుర్కొనే ధైర్యం లేక ఏ మార్పుకి ఇష్టపడం కూడా. మన పరిస్థితి పట్ల అసంతృప్తి, మన జీవితం పట్ల నిరాశ వున్నా కూడా, కచ్చితమైన ప్రయత్నం చేస్తే జీవితం మెరుగుపడుతుందని తెలిసి కూడా ఆ దిశగా ప్రయత్నం చేయం. అందుకు రకరకాల కారణాలు చెపుతుంటాం. కానీ, ఒక్కసారి ఆ భయంలోంచి బయటకి రావాలని గట్టిగా అనుకుంటే అది ఏమాత్రం కష్టం కాదు అంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. గిరి గీసుకోకండి:- ఎవరికివారు తమ శక్తియుక్తులని సరిగ్గా అంచనా వేసుకోగలగాలి. చాలాసార్లు తమ గురించి, తమ శక్తియుక్తుల గురించి సరైన అంచనా వేసుకోలేక చాలామంది గిరిగీసుకుని  ఉండిపోతుంటారు. ఇతరులతో పోల్చుకుని బాదపడుతుంటారు.  అదే ఎలాంటి భేషజాలు లేకుండా తమ గురించి, తమ బలం, బలహీనతల గురించి అంచనా వేసుకోగలిగితే కొత్త ప్రయత్నం చేయడానికి అంతగా భయపడరు. ‘మార్పు’ వారిని వణికించదు. అందరూ శక్తిమంతులే:- ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు చెప్పే మాట ఒక్కటే. ‘‘ఈ ప్రపంచంలో తక్కువ శక్తి కలవారు ఎవరూ లేరు. తక్కువ శక్తి కలవాళ్ళమని నమ్మేవాళ్ళే ఉన్నారు. అంతే... దాని వల్లనే జీవితంలో ఎక్కడివారు అక్కడే మిగిలిపోతారు’’ ఈమాట ఎంతో నిజం. అలాగే కోరిన రీతిలో జీవితాన్ని తీర్చిదిద్దుకోగల శక్తి అందరికీ ఉంటుందన్నదే వాస్తవం. శక్తి సామర్థ్యాలను ఆశించిన రీతిలో ఎవరైనా పెంపొందించుకోగలరు. ఏదైనా ఇట్టే సాధించగలమననుకునే చిన్నపాటి ధీమాయే ‘మార్పు’ని ధైర్యంగా ఎదుర్కోగల ఆయుధం. ఆ ఆయుధం ఆధారంగా ముందుకు వెళితే అంతా విజయమే. -రమ ఇరగవరపు
      పుస్తకాలు ఎక్కువగా చదివే వాళ్ళని నమ్మకూడదు అని అన్నాడు హెన్రీ డేవిడ్ అనే ఒక రచయిత. కారణం తన ఇంటికి వచ్చిన స్నేహితుడొకరు తన దగ్గరున్న పుస్తకాన్ని చెప్పకుండా పట్టుకుపోయి, అది బాగా నచ్చటంతో తిరిగి ఇవ్వలేదట. ఆశ్చర్యపోవక్కర్లెద్దు ఇలా కూడా ఉంటారండి పుస్తక ప్రియులు. ఒక మంచి పుస్తకం మంచి స్నేహితుడు లాంటిది అంటారు. నిజంగానే ఎంత తిరిగినా, ఎంత తిన్నా, ఎంత సేపు పడుకున్నా రాని ఆనందం ఒక మంచి పుస్తకం చదివితే వస్తుంది. ఎప్పుడైనా కాస్త చికాకుగా ఉన్నా, లేదా నిస్పృహలో పడినా పుస్తక పఠనం మనని అందులోంచి బయటకి లాగగలదు. ఈ రోజు ప్రపంచ పుస్తక దినోత్సవం. ఎవరికి వారు ఒక మంచి పుస్తకాన్ని కొని మనకి ఇష్టమైన వాళ్ళకి కానుకగా ఇద్దాం. పుస్తకం మనిషికి అత్యంత ప్రియ నేస్తం కాబట్టి ఇందుకోసం కూడా ఒక ప్రత్యేకమైన రోజుని కేటాయించాలని నిర్ణయించుకున్న యునెస్కో 1995వ సంవత్సరంలో ఏప్రిల్ 23వ తారీఖుని ఖరారు చేసింది. అప్పటి నుంచి మనం ఈ ఇంటర్నేషనల్ బుక్ డేని జరుపుకుంటున్నాం. ఇదే రోజున సెయింట్ జార్జ్ జన్మదినాన్ని స్పెయిన్ లో జరుపుకుంటారు. ఇప్పటికీ స్పెయిన్ లో ప్రతి పుస్తక కొనుగోలు పై ఒక గులాబీని గిఫ్ట్ గా ఇస్తారు తెలుసా. ఈ బుక్ రీడింగ్ అలవాటు మనలో సృజనాత్మకతని పెంచుతుంది. మన ఆలోచనా విధానాన్ని కూడా మార్చుతుందనటంలో సందేహమే లేదు. అందుకే పుస్తకం చదివే అలవాటు లేకపోతే వెంటనే అలవాటు చేసుకుంటే చాలా ఉపయోగాలే ఉన్నాయండోయ్. ఒక పుస్తకం మన చిన్నప్పుడు చదివితే మనకు వచ్చే అనుభూతికి, అదే పుస్తకాన్ని కాస్త వయసులోకి వచ్చాకా చదివితే వచ్చే అనుభూతికి మద్య చాలా తేడా ఉంటుంది. కావాలంటే టెస్ట్ చేసి చూసుకోండి. రిటైరయిపోయి ఖాళీగా ఉన్న వాళ్ళు చేసే పని ఈ బుక్ రీడింగ్ అనుకుంటే పొరపాటే. అసలు వాళ్ళకన్నా జీవితాన్ని మొదలుపెట్టటానికి ప్రపంచంలోకి అడుగుపెట్టేవారికే  ఇది చాలా అవసరం. ఎందుకంటే పుస్తకాలు చదవటం వల్ల కొత్త విషయాల సేకరణ జరుగుతుంది. ఒక పుస్తకం చదివాకా అందులో ఉన్న విషయాన్ని పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉండటం వల్ల మన జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. మనం ఏదన్నా రాయాలన్నా బుక్ రీడింగ్ వల్ల మనం అలవర్చుకున్న పరిజ్ఞానం రాయటంలో  ప్రదర్శించచ్చు. ఈ పుస్తక పఠనం వల్ల అన్ని రకాల పుస్తకాలు చదవటం అలవాటయ్యి, ఏదైనా సమస్య ఎదురైనపుడు ఎలా దాన్ని హేండిల్ చెయ్యాలో కూడా మనకి చాలా సులువుగా తెలిసిపోతుంది. ముఖ్యంగా మన ఏకాగ్రత పెరుగుతుంది. కుదురుగా ఒక దగ్గర కూర్చునే అలవాటు లేని వాళ్ళు సైతం బుక్ రీడింగ్ హేబిట్ వల్ల దాన్ని అలవాటు చేసుకుంటారు. నలుగురిలో కలిసే అలవాటు లేనివాళ్ళు చాలా మటుకు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు పుస్తకం చదివే అలవాటు చేసుకుంటే ఇక ఎప్పటికి ఒంటరితనం ఫీల్ అవ్వరు. మొత్తానికి ఒక మంచి పుస్తకం అన్ని వయసుల వారిని అలరిస్తుంది. అందుకే మన లైఫ్ లో మనం ఎంత బిజీ అయిపోయినా మనకంటూ కాస్త సమయాన్ని కేటాయించుకుని పుస్తకం చదవటంలో ఉండే ఆనందాన్ని అనుభవిద్దాం. ...కళ్యాణి
  అనగనగా ఓ మహా పర్వతం. ఆ పర్వతం మీద ఓ దుర్మార్గమైన తెగ ఉండేది. ఆ తెగ ఓసారి పర్వతం మీద నుంచి కిందకి దిగి వచ్చింది. కింద మైదాన ప్రాంతాల్లో ఉండే ఓ గ్రామం మీద దాడి చేసంది. దాడి చేయడమే కాదు... వెళ్తూ వెళ్తూ తమతో పాటు ఓ పసిపిల్లవాడిని కూడా ఎత్తుకు వెళ్లిపోయింది. ఆ దాడితో గ్రామంలోని జనమంతా బిత్తరపోయారు. కాస్త తేరుకున్న తరువాత, తమ పిల్లవాడిని ఎలాగైనా సరే తిరిగి తెచ్చుకోవాలని నిశ్చయించుకున్నారు. కానీ ఎలాగా! వాళ్లు ఎప్పుడూ ఆ పర్వతాన్ని ఎక్కనే లేదయ్యే! అదో దుర్గమమైన కొండ. ఆ కొండ మీద ఉండే తెగకి తప్ప మిగతా మానవులెవ్వరికీ దాని శిఖరాన్ని చేరుకోవడం సాధ్యం కాదు. అయినా పిల్లవాడి కోసం ప్రాణాలకు తెగించి బయల్దేరారు.   గ్రామంలోని ఓ పదిమంది నిదానంగా కొండని ఎక్కడం మొదలుపెట్టారు. ఎక్కడ ఏ మృగం ఉంటుందో, ఎటువైపు నుంచి ఏ రాయి దొర్లిపడుతుందో అనుకుంటూ బిక్కుబిక్కుమంటూ బయల్దేరారు. ఎలాగొలా కొండ శిఖరాన్ని చేరుకున్నా, అక్కడ శత్రువుల కళ్లుగప్పి, వారి చెర నుంచి పిల్లవాడిని తీసుకురావడం ఎలాగా అంటూ బితుకు బితుకుమంటూ నడుస్తున్నారు.   ఒక రోజు గడిచింది, రెండు రోజులు గడిచాయి.... నాలుగు రోజులు గడిచాయి. కానీ తాము ఎటు పోతున్నామో వాళ్లకి అర్థం కాలేదు. ఒక అడుగు పైకి వెళ్తే నాలుగు అడుగులు కిందకి జారిపోతున్నారు. క్రూరమృగాలని తప్పించుకోలేక సతమతమైపోతున్నారు. తెచ్చుకున్న ఆహారం కాస్తా అయిపోయింది. ఇక మరొక్క అడుగు ముందుకు వేసే ధైర్యం లేకపోయింది. దాంతో పిల్లవాడి మీద ఆశలు వదిలేసుకుని నిదానంగా వెనక్కి తిరిగారు. తిరిగి తమ ఇళ్లకు చేరకుంటే చాలు దేవుడా అన్న ఆశతో తిరుగుప్రయాణం కట్టారు.   వాళ్లు తిరిగి వస్తుండగా దారిలో ఆ పిల్లవాడి తల్లి కనిపించింది. ‘ఎక్కడికి వెళ్తున్నావు! ఈ కొండ శిఖరాన్ని చేరుకోవడం మనవల్ల కాదు. నీ పిల్లవాడి ఆయువు ఇంతే అనుకో! అక్కడే అతను క్షేమంగా ఉంటాడని కోరుకో. మాతో పాటు వచ్చేసేయి,’ అంటూ ఆమెను చూసి అరిచారు. వారి మాటలు విన్న తల్లి మారు మాటాడకుండా దగ్గరకు వచ్చి నిల్చొంది. ‘నేను పైకి వెళ్లడం లేదు. పై నుంచి కిందకి దిగి వస్తున్నాను,’ అంటూ వెనక్కి తిరిగి తన వీపుకి కట్టుకుని ఉన్న పిల్లవాడిని చూపించింది.   ‘ఇంతమంది వల్ల కాని పని నీ ఒక్కదాని వల్ల ఎలా సాధ్యమైంది. ఇంత అసాధ్యమైన కొండని ఎక్కి, శత్రువుల కళ్లుగప్పి నీ బిడ్డను ఎలా తెచ్చుకోగలిగావు,’ అని వారంతా ఆశ్చర్యపోయారు. దానికి ఆ తల్లి చిరునవ్వుతో ‘నా పిల్లవాడిని తీసుకురావడం అంటే మీకు బాధ్యత మాత్రమే! కానీ నాకు మాత్రం జీవిత లక్ష్యం. పిల్లవాడు లేనిదే నా జీవితం అర్ధరహితం అనుకున్నాను. అందుకనే వాడి కోసం బయల్దేరాను. ఈ కొండని ఎక్కడం నాకు అంత కష్టం అనిపించలేదు. శత్రువు కళ్లుగప్పడం అసాధ్యంగా తోచలేదు,’ అంటూ చెప్పుకొచ్చింది. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం ఓ బాధ్యతగా కాకుండా జీవన గమనంగా సాగిస్తే ఏదైనా సాధించవచ్చని ఆ తల్లి నిరూపిస్తోంది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.  
  గ్లోబరీనా సంస్థ పుణ్యమా అని తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో గందరగోళం ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు 20 మంది విద్యార్థులు ఆత్మహత్యకు కూడా పాల్పడ్డారు. తాజాగా ఈ వివాదంపై తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం స్పందించారు. ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి, ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకలకు.. ముగ్గురు టీఆర్ఎస్ పెద్దలే కారణమని కోదండరాం ఆరోపించారు. వారిని కాపాడేందుకు ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని పోలీస్ స్టేషన్ గా మార్చారని మండిపడ్డారు. గ్లోబరీనా సంస్థకు ఇంటర్ విద్యార్థుల డేటాను ఎంటర్ చేసే సామర్థ్యం లేదని కోదండరాం అన్నారు. గ్లోబరీనా సంస్థ విద్యాసంవత్సరం ఆరంభం నుంచి అన్నీ తప్పిదాలే చేస్తోందని విమర్శించారు. ఫీజ్ డిటేల్స్ సిస్టంలో సరిగా ఎంటర్ చేయకపోవడంతో.. ఫీజు తేదీ ముగిసినా ఎంత మంది ఫీజ్ కట్టారో బోర్డ్ కు సమాచారం అందించలేక పోయిందని ఆరోపించారు. విద్యార్థుల ఆన్సర్ షీట్లు ఇచ్చిన తర్వాత కూడా మార్కులు సరిగా ఎంటర్ చేయలేక ఫలితాల వెల్లడికి పదిహేను రోజులు గడువు కోరారని చెప్పారు. గ్లోబరీనా సంస్థను కాపాడేందుకు ఇంటర్ బోర్డు కార్యదర్శి ప్రయత్నిస్తున్నారని కోదండరాం ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, గ్లోబరినాపై చర్యలు తీసుకుని.. బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కోదండరాం డిమాండ్ చేశారు.
  తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి కారణమైన గ్లోబరీనా టెక్నాలజీ సంస్థ వ్యవహారంపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. గురువారం విచారణ చేపట్టిన అధికారులు గ్లోబరినా టెక్నాలజీ సంస్థ ఉపయోగించిన సాఫ్ట్‌వేర్‌లోనే లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ సాఫ్ట్ వేర్ ను మార్చకపోతే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేసినా ప్రయోజనం ఉండదని, మళ్లీ అదే రీతిలో మార్కులు తప్పులతడకలుగా వస్తాయని త్రిసభ్య కమిటీ సభ్యులు  అభిప్రాయపడ్డారు. రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ ప్రక్రియలో మళ్లీ తప్పులు జరగకుండా ఉండేందుకు కమిటీ పలు సూచనలు చేయనుంది. యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన చర్యలపై ఈ రోజు సాయంత్రం త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
  తెలుగు రాష్ట్రాల్లో లగడపాటి సర్వేకి మంచి పేరుంది. ఆయన్ను ఆంధ్రా ఆక్టోపస్ అని కూడా అంటారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆయన అంచనాలు తప్పి విమర్శలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆయన సర్వే కోసం ఇప్పుడు ఏపీలో చాలా మంది ఎదురుచూస్తున్నారు. కానీ, లగడపాటి సర్వే రావడానికి ఇంకా టైముంది. అయితే లగడపాటి సర్వే టీం అంచనా ప్రకారం.. ఏపీలో జనసేన అందరూ ఊహించిన దానికంటే ఎక్కువ ప్రభావం చూపబోతుందని తెలుస్తోంది. కిషోర్ అనే ఓ జనసేన కార్యకర్త లగడపాటి సర్వే టీంలోని ఓ వ్యక్తికి కాల్ చేసి.. ఈ ఎన్నికల్లో జనసేన ప్రభావం ఎలా ఉంటుందని అడిగి తెలుసుకున్నాడు. ఈ ఫోన్ కాల్ లీక్ అయ్యి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ కాల్ లో లగడపాటి సర్వే టీంలోని వ్యక్తి మాట్లాడుతూ.. టీడీపీ, వైసీపీ పార్టీలు ఏపీలో జనసేన ప్రభావం అంతగా ఉండదని భావిస్తున్నాయి. కానీ జనసేన మంచి ప్రభావం చూపనుంది అన్నాడు. అందరూ అనుకుంటున్నట్లు జనసేనకి 5, 6 ఎమ్మెల్యే సీట్లు కాదు.. 14 నుంచి 22 ఎమ్మెల్యే సీట్లు గెలిచే అవకాశముందని అంచనా వేసాడు. అంతేకాదు జనసేన 3 ఎంపీ సీట్లు గెలిచే అవకాశం కూడా ఉందని తెలిపారు. విశాఖతో పాటు.. రాజమండ్రి మరియు నర్సాపురం ఎంపీ సీట్లు గెలుచుకోవడానికి జనసేనకు 80 శాతం అవకాశం ఉందని చెప్పాడు. మొత్తానికి ఆ లీకైన ఫోన్ కాల్ విని జనసైనికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
  మనం బట్టల ఎన్నుకోవడంలో చూపే శ్రద్ధ పాదరక్షల మీద ఉంచము. ఒకవేళ చెప్పులో, షూలో కొనుక్కోవడానికి వెళ్లినా... అవి చూడటానికి బాగున్నాయా, ఎక్కువకాలం మన్నుతాయా, తక్కువ ధరకి వస్తున్నాయా అని ఆలోచిస్తామే కానీ నడవడానికి సౌకర్యంగా ఉన్నాయా లేదా అని పట్టించుకోం. ఇలాంటి అశ్రద్ధే మన కొంప ముంచుతుందని చెబుతున్నారు నిపుణులు...   వయసు పెరిగేకొద్దీ జాగ్రత్త! కుర్రతనంలో ఎలాంటి చెప్పులు ధరించినా చెల్లిపోతుంది. కానీ వయసు మళ్లేకొద్దీ అలా కాదు! పాదం ఆకృతి మారిపోతుంది. వాటి ఒడ్డూపొడవులో మార్పులు వస్తాయి. నొప్పిని తట్టుకునే శక్తిలో తేడా ఏర్పడుతుంది. పాదం అడుగుభాగంలో ఉండే కొవ్వు, కండరాలలో కూడా పరివర్తన ఉంటుంది. కొన్ని సందర్భాలలో అయితే రెండు పాదాలకీ వేర్వేరు సైజ్ ఉన్న చెప్పులు ధరించాల్సినంతగా మార్పులు జరుగుతాయి. వీటికి తోడు ఊబకాయం, డయాబెటిస్, కీళ్లనొప్పులు వంటి సమస్యలు కూడా మనం నడిచే తీరు మీదా, పాదాల ఆరోగ్యం మీదా ప్రభావం చూపుతాయి.   ఇంత జరుగుతున్నా... పాదరక్షల గురించి మరింత శ్రద్ధ వహించాల్సిన వయసులో కూడా మనం చాలా అశ్రద్ధగా వ్యవహరిస్తాం అంటున్నారు నిపుణులు. దీనికోసం లోపెజ్  (Lopez) అనే పరిశోధకుడు ఓ రెండు సర్వేలను నిర్వహించాడు. మొదటి సర్వేలో 80 ఏళ్లు పైబడినవారు పాదరక్షల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో గమనించారు. దాదాపు 83 శాతం మంది, తమ పాదాలకంటే పెద్దవో చిన్నవో (different size) పాదరక్షలు ధరిస్తున్నట్లు తేలింది.   లోపెజ్ నిర్వహించిన రెండో సర్వేలోనూ దారుణమైన వాస్తవాలే వెలుగుచూశాయి. తగిన పాదరక్షలు ధరించనివారు తమకి తెలియకుండా చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తేలింది. పాదాలలో విపరీతమైన నొప్పి, ఇన్ఫెక్షన్లు, ఎక్కువ దూరం నడవలేకపోవడం, నడిచేటప్పుడు ఆయాసం వంటి సమస్యల దగ్గర నుంచి అదుపుతప్పి పడిపోవడం వరకూ... జీవితాన్ని తలకిందులు చేసే ఎన్నో సమస్యలు అపసవ్యమైన పాదరక్షలతో ముడిపడి ఉన్నాయని గ్రహించారు. దీని వల్ల ఏకంగా వారి జీవితమే ప్రభావితం అవుతోందని తేల్చారు.   జాగ్రత్తపడాల్సిందే! సరైన పాదరక్షలు ధరించకపోవడం వల్ల ఇన్నేసి అనర్థాలు ఉన్నాయని తెలిశాక ఇక జాగ్రత్తపడకపోతే ఎలా! అందుకనే ఏవన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, పాదరక్షల గురించి ఓసారి తమ వైద్యునితో మాట్లాడితీరాలి. పాదానికి మెత్తగా ఉండేలా, నడిచేటప్పుడు పట్టుని ఇచ్చేలా, కీళ్ల మీద ఒత్తిడిని కలిగించకుండా ఉండే పాదరక్షలను ఎన్నుకోమని చెబుతున్నారు. అలాగే పాదం ఆకారానికి తగినట్లుగా సర్దుబాటు చేసుకునే స్ట్రాప్స్ ఉండే పాదరక్షలని ధరించమని సూచిస్తున్నారు. - నిర్జర.  
  నొప్పి లేకుండా బతుకు బండి ముందుకు నడవదు. ఆ నొప్పిని పంటిబిగువున భరిస్తూ ఏదో ఒక మాత్ర వేసుకుంటూ ముందుకు సాగాల్సిందే. కానీ అన్నివేళలలా నొప్పి మాత్రలు పనిచేయవు సరికదా... వాటి వల్ల లేనిపోని సమస్యలు కూడా తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. అందుకు వెన్నునొప్పిని మినహాయింపుగా చూపిస్తున్నారు. వెన్నెలో ఉండే డిస్క్ అరిగిపోవడం దగ్గర నుంచీ కండరం వాపు వరకు వెన్నునొప్పికి కారణం ఏదైనా కావచ్చు. ఇలా నొప్పి చేసినప్పుడు ఆస్పిరిన్‌, బ్రూఫిన్ వంటి నొప్పి మందులు వాడుతూ ఉంటాము. ఈ తరహా మందులను Nonsteroidal anti-inflammatory drugs (NSAID) అంటారు. ఇవి వాపుతో పాటుగా నొప్పిని కూడా తగ్గిస్తాయన్నమాట. ఆస్ట్రేలియాకు చెందిన కొందరు పరిశోధకులు వెన్నునొప్పిలో NSAID ఫలితం ఏమేరకు ఉంటుందో గమనించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం వాళ్లు 6000 మంది రోగులని పరిశీలించారు. ప్రతి ఆరుగురు రోగులలో ఒక్కరికి మాత్రమే నొప్పి మాత్రలు పనిచేస్తున్నట్లు తేలింది. మిగతావారిలో ఈ మాత్రలు ప్రభావం చూపకపోగా జీర్ణసంబంధమైన సమస్యలు మొదలవడాన్ని గమనించారు. అల్సర్లు ఏర్పడటం, పేగులలో రక్తస్రావం జరగడం లాంటి తీవ్రమైన ఇబ్బందులు తలెత్తాయట. ఇక నొప్పి మాత్రలతో లివర్, కిడ్నీ వంటి అవయవాలు దెబ్బతినే అవకాశం ఎలాగూ ఉంది. ఇకమీదట వెన్నునొప్పి వచ్చినప్పుడు నొప్పి మాత్రల మీద ఆశలు పెట్టుకోవద్దని సూచిస్తున్నారు. దీనికి బదులుగా కాపడం పెట్టుకోవడం, విశ్రాంతి తీసుకోవడం, చిన్నపాటి వ్యాయామాలు చేయడం, ఫిజియోథెరపీ చేయించుకోవడం వంటి చికిత్సలను అనుసరించి చూడమంటున్నారు.   - నిర్జర.
ఒళ్లు తగ్గాలనీ, ఒంట్లోని కొవ్వు కరగాలని ఎవరికి మాత్రం ఆశగా ఉండదు. చేసే పనికంటే తీసుకునే ఆహారం ఎక్కువగా ఉన్న ఈ రోజులలో ఊబకాయం మన జోలికి రాకూడదని ఎవరికి మాత్రం తోచదు. ఓ పరిశోధనా ఫలితాలు అలాంటివారికి శుభవార్తలా తోచడం ఖాయం.   ఆహారమే ధ్యాస సాధారణంగా మనం ఆహారం తీసుకునే సమయం ఉదయం లేచిన దగ్గర్నుంచీ రాత్రి పడుకునేలోపు ఎప్పుడైనా ఉండవచ్చు. అంటే సుమారుగా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ఎప్పుడైనా ఆహారం తీసుకుంటూ ఉంటాం. దీనికి విరుద్ధంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటలలోపు ఆహారం తీసుకుంటే ఏమన్నా ఉపయోగం ఉందా లేదా అన్న విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేశారు అలబామా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు. ఇలా ఆహారాన్ని కాస్త ముందుగానే తీసుకునే విధానాన్ని early time-restricted feeding (eTRF) అంటారు.   అన్నీ సర్దుకున్నాయి eTRF వల్ల ఉపయోగం ఉందో లేదో తెలుసుకునేందుకు పరిశోధకులు, ఊబకాయంతో బాధపడుతున్న ఓ 11 మందిని ఎన్నుకున్నారు. వీరికి ఓ నాలుగు రోజులపాటు ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది లోపు ఆహారాన్ని అందించారు. మరో నాలుగురోజులు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండుగంటల లోపే ఆహారాన్ని తీసుకునేట్లు నిర్దేశించారు. ఈ రెండు సందర్భాలలోనూ ఒకే మోతాదు ఆహారాన్ని తీసుకున్నా కూడా, అది వారి శరీరం మీద చూపే ప్రభావంలో స్పష్టమైన మార్పులు ఉన్నట్లు గమనించారు. మధ్యాహ్నం రెండింటి లోపే ఆహారాన్ని తీసుకున్నవారిలో జీవక్రియలు చాలా చురుగ్గా ఉండటాన్ని గమనించారు. వీరిలో కొవ్వు కూడా చాలా వేగంగా కరుగుతున్నాయని తేలింది.   ఇదీ కారణం ప్రతి మనషిలోనూ ఒక జీవగడియారం పనిచేస్తుందనీ, అది ప్రకృతికి అనుగుణంగా నడుస్తుందనీ తెలిసిన విషయమే! ఈ జీవగడియారం ప్రకారం ఉదయం వేళల్లో మనలో అనేక జీవక్రియలు (metabolism) జరుగుతుంటాయి. అదే సమయంలో మన శరీరానికి ఆహారం అందటం వల్ల దానిని వీలైనంత సమర్థంగా జీర్ణం చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఎలుకల మీద ఇది వరకే చేసిన ప్రయోగాలలో కూడా eTRf వల్ల వాటిలో కొవ్వు వేగంగా కరగడమే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా దరిచేరలేదని వెల్లడయ్యింది.   eTRF తరహా ఆహార పద్ధతికి సంబంధించి ఇవి ప్రాథమిక పరిశోధనలు మాత్రమే. ఎలాంటివారు ఎంతకాలం ఈ పద్ధతిని ఆచరించవచ్చు అన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. కాకపోతే భారతీయ వైద్య విధానంలో మాత్రం ఈ తరహా ప్రయోగాలు కొత్తేమీ కాదు. ఎందుకంటే ప్రకృతి వైద్యచికిత్స ప్రకారం ఉపవాసం మొదలుపెట్టిన రోజు నుంచి మర్నాడు ఉదయం వరకు కూడా ఏమీ తీసుకోకపోవడమే సత్ఫలితాన్నిచ్చే ఉపవాసం. ఇలాంటి ఉపవాసాల వల్ల ఎంత ప్రయోజనం ఏర్పడుతుందో eTRF పరిశోధనతో మరోసారి రుజువైపోయింది.             - నిర్జర.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.