నిమ్మగడ్డయితే... ప్రవీణుడికంటే ఎక్కువా ఏంటీ?

ఎల్వీ-ఏబీవీకే దిక్కులేదు   ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ను.. తన సముఖానికి రమ్మని సీఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్  హుకుం జారీచేశారట. దానిపై నిమ్మగడ్డ వారు ఆగ్రహోదగ్రుడయి.. నా అంత ప్రముఖుడినే భేటీకి రమ్మంటారా? మీ సంగతి కోర్టులో తేలుస్తానని అగ్గిరాముడయ్యారట. ఇది ఇప్పుడు మీడియాకు పెద్ద వార్త. దానిపై బోలెడన్ని విశ్లేషణలు!   ఐఏఎస్ చదివిన నిమ్మగడ్డ వారు కూడా, మామూలు పామరుల మాదిరిగా ఆలోచించడమే హాశ్చర్యం. నిమ్మగడ్డ రమేషుల వారు రాష్ట్ర ఎన్నికల కమిషనరే  కావచ్చు. పూర్వాశ్రమంలో పెద్ద పెద్ద హోదాల్లో పనిచేసి ఉండవచ్చు. గవర్నర్‌కే సలహా ఇచ్చేంత మేధావి కావచ్చు. కానీ అవన్నీ మా ప్రవీణ్ ప్రకాష్ ముందు జాన్తానై! సారు చిన్నప్పటి నుంచీ అంతే! ఆయన దగ్గర ఉత్తరాది పప్పులు తప్ప, మరెవరి పప్పులూ ఉడకవు. అందుకే ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు పోస్టింగు పోయిన సతీష్ చంద్ర మాత్రమే మళ్లీ పోస్టింగు తెచ్చుకోగలిగారు మరి. అందుకే ఆయన దగ్గర తెలుగువాళ్ల పప్పులుడకవు. జగన్ ఉండగనే, జగన్ అంశలో పుట్టిన మరో జగన్ ఆయన! కాబట్టి.. నిమ్మగడ్డే కాదు.. ఏ గడ్డయినా ప్రవీణుల వారి కచేరీకి,  కాకితో కబురంపితే, రెక్కలు కట్టుకుని వాలిపోవాల్సిందే. దట్సాల్!   నిమ్మగడ్డదేముంది? బూతుల మంత్రి కొడాలి నాని చెప్పినట్లు, వచ్చే ఏడాది రిటైరయి, హైదరాబాద్ వెళ్లిపోతారు. కానీ ప్రవీణ్ ప్రకాష్ మాత్రం లోకల్. ఐదేళ్లూ ‘జగన్నా’ధుడి ఆలయంలోనే కొలువయి ఉంటారు. అయినా పెద్ద పెద్ద ఐఏఎస్, ఐపిఎస్సులే ప్రకాష్ ప్రావీణ్యానికి సలాములు కొట్టి గులాములవుతుంటే, వచ్చే ఏడాది రిటైరయ్యే నిమ్మగడ్డ గోడు వినిపించుకునేదెవరు? ప్రవీణేదో ముచ్చటపడి, ఆ ఎలక్షన్ వ్యవహారాలపై మాట్లాడాలి రమ్మని పిలిచారనుకోండి. వెళ్లి కాసేపు సారు చెప్పింది విని, ఇస్తే.. టీ తాగి రెండు బిస్కట్లు తిని, జీ హుజూరని వచ్చేస్తే పోయేది.   అలాకాకుండా..  అంత పెద్ద మనిషిని, అంతలావు అధికారాలున్న అధికారిని, సీఎంనే ఖాతరు చేయనవసరం లేని రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నన్నే రమ్మంటారా? హమ్మా? మీకెన్ని గుండెలు.. అసలు మీది గుండెనా? పోలవరం ప్రాజెక్టా అని,  సత్తెకాలపు చాదస్తాలకు వెళ్లి, ఆ విషయాన్ని ‘మిత్రమీడియా’కు లీకు చేయడం పిచ్చితనం కాక మరేమిటి? ఈ 17 నెలల కాలంలో,  జగనన్న తత్వం అర్ధం చేసుకోకపోవడమే నిమ్మగడ్డ తప్పు. బహుశా చాలా పథకాలకు జగనన్న పేరు పెట్టిన సర్కారు.. కేవలం ప్రభుత్వ ఉద్యోగుల కోసమే ‘జగనన్న తత్వం’ అనే పథకం పెట్టి ఉంటే, అధికారులకు ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో?!   నిమ్మగడ్డ వారి ఆవేదన అర్ధం చేసుకోదగ్గదే. ఆఫ్టరాల్ సీఎం ముఖ్య కార్యదర్శి నన్ను పిలవటమేమిటన్నది, ఆయన అంతరంగం పడుతున్న ఆవేద న కావచ్చు. కానీ, నిమ్మగడ్డ వారు కొలువు చేస్తోంది ఏపీలో అని  గుర్తుంచుకోవాలి. క్రికెట్ గ్రౌండ్‌లో కబడ్డీ ఆడకూడదు. కాదని కబడ్డీ ఆడితే ఫలితాలు ఇలాగే ఉంటాయి. అయినా.. ‘నన్నే పిలుస్తారా’ అని తెగ ఇదయిపోతున్న నిమ్మగడ్డను చూస్తే జాలి వేస్తుంది. తాను చెప్పింది చేయకుండా తల అడ్డంగా ఆడించిన, అంత పెద్ద చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యాన్నే శంకరిగిమాన్యాలు పట్టించారు. కోర్టుకెక్కి, తన ఉద్యోగం తనకివ్వాలని ఆదేశాలు తెచ్చుకున్న, డిజిపి స్థాయి సీనియర్ ఐపిఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకే ఇప్పటిదాకా, పోస్టింగు ఇవ్వకుండా చుక్కలు చూపిస్తున్నారు. కోర్టుకెళ్లిన తర్వాత ఇస్తున్న సగం జీతానికీ కత్తెర వేశారు.  మొన్నామధ్య ఓ సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటే, అంతకంటే ముందే అదే వేధింపులకు గురయి..  మరో మహిళా అధికారి చనిపోతేనే,  ఇదేమిటని అడిగే దిక్కు-దమ్ము లేదు. నిజాయితీ గల అధికారిగా పేరుండి, పెద్దాయన వైఎస్ దగ్గర కార్యదర్శిగా పనిచేసిన మాదిరెడ్డి ప్రతాప్‌ను వెళ్లగొట్టినా ఇదేం అన్యాయమని అడిగే నాధుడు లేడు.  పేరుకు ఐఏఎస్-ఐపిఎస్ అసోసియేషన్లు ఉన్నా, అవి లెటర్‌హెడ్ సంఘాలే.   మరి అంతలావు సీనియర్లే..   ప్రకాష్  ప్రావీణ్యంతో విలవిల్లాడుతుంటే, మరికొద్ది నెలల్లో రిటైరయ్యే ఈ నిమ్మగడ్డేమిటి? తన ముందు తోకాడిస్తున్నారని పెద్ద సారుకు కోపం రాదూ? మిగిలిన అధికారుల మాదిరిగా..  ఏదో వచ్చామా?.. విన్నామా?.. చెప్పిన చోట చెప్పినట్లు సంతకం చేశామా?.. వెళ్లామా?.. నెల జీతం తీసుకుంటున్నామా? అని వచ్చిన పని చూసుకుని వెళ్లకుండా,  ఇలా ఎదురు ప్రశ్నలు వేస్తే.. ‘జగన్నా’ధ ఆలయంలోని ప్రధానార్చాకులు, అర్చకులకు ఒళ్లు మండిపోదూ?.. హేమిటో ఈ అధికారులు ఎప్పుడు నేర్చుకుంటారో? ఏమో?! -మార్తి సుబ్రహ్మణ్యం 

‘అమరావతి పాపం’ ఎవరిది..?

‘అమరావతి అవమానం’ మోదీదా? బీజేపీదా?   బీజేపీ-టీడీపీ భాగస్వాములే   బాబు జాగే కొంప ముంచింది   కులం కోణంలో జగన్ నిర్ణయాలు   అనాధగా మారిన అమరావతి   కడకు దిక్కయిన కోర్టులు   విభజన నుంచి ఇప్పటివరకూ.. దేశంలో  రాజధాని నగరం లేని, ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధిలో పురోగమిస్తుంటే, ఏపీ మాత్రం అనాధగా దిక్కులు చూస్తున్న విషాదం. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ,  అక్కడి రైతులు చేస్తున్న ఉద్యమానికి మూడొందల రోజులు దాటిపోయాయి. నాటి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు, సుప్రీంకోర్టు-హైకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో.. అమరావతిలో భూమి పూజ చేసిన ప్రాంతం ఇప్పుడు శ్మశానాన్ని తలపిస్తోంది.  సీఎం జగన్మోహన్‌రెడ్డి అమరావతిని కులం కోణంలో చూసి, ‘మూడు ముక్కలాట’కు తెరలేపడమే.. ఈ విషాదానికి అసలు కారణమన్నది బహిరంగ రహస్యం. ఒక్క జగన్మోహన్‌రెడ్డి మాత్రమే కాదు.. అటు బీజేపీ, ఇటు టీడీపీ.. అంతా కలసి, అమరావతిని అనాధను చేశారన్నది ఇప్పుడు వినిపిస్తున్న ఆరోపణ.   విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. శివరామకృష్ణన్ కమిటీ, దాని పర్యటనలు, ప్రజాభిప్రాయసేకరణ, దొనకొండలో రాజధానిని పెట్టాలని కొందరు, నూజివీడు అయితే బాగుంటుందని మరికొందరి సూచనల తర్వాత.. నాటి సీఎం చంద్రబాబు నాయుడు ‘నారాయణ కమిటీ’ని తెరపైకి తీసుకువచ్చారు. కసరత్తులన్నీ పూర్తయ్యాక, అమరావతిని రాజధానిగా తేల్చారు. దానికోసం 32 వేల ఎకరాలు ఇచ్చేందుకు రైతులు ముందుకొచ్చారు. వారిచ్చిన భూమునే పెట్టుబడిగా పెట్టి, మరికొంత కేంద్రసాయంతో రాజధాని నగరాన్ని నిర్మిస్తామని బాబు ప్రకటించారు. ఆ మేరకు రైతులకు కౌలుతోపాటు, కమర్షియల్ ప్లాట్లను కూడా ఇచ్చారు. కేంద్రం కూడా 7 వేల కోట్ల నిధులిచ్చిందని, ఆ డబ్బెక్కడికి పోయిందని సోము వీర్రాజు కొంతకాలం నుంచీ ప్రశ్నిస్తున్నారు. కానీ, అప్పటి సర్కారులో బీజేపీ కూడా భాగస్వామి అన్న వాస్తవాన్ని వీర్రాజు విస్మరించడం ఆశ్చర్యం.   జగన్మోహన్‌రెడ్డి సీఎం అయిన తర్వాత, మూడు రాజధానులకు తెరలేపడంతో,  అమరావతి కథ అర్ధంతరంగా ఆగిపోయింది. అక్కడ కమ్మ వర్గానికి చెందిన వారి భూములే.. ఎక్కువగా ఉన్నాయన్న అనుమానంతోనే, జగన్మోహన్‌రెడ్డి చూపు.. అమరావతి నుంచి విశాఖకు మళ్లింది. నాడు అక్కడ శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ, ఇప్పుడు మౌనమునిగా మారారు. అమరావతిపై మీడియాలో మాట్లాడవద్దని బీజేపీ నాయకత్వం, నేతలకు లక్ష్మణరేఖ గీసింది. అధికారంలో ఉన్నప్పుడు మీనమేషాలు, తాత్కాలిక కట్టడాలతో పేరుతో పబ్లిసీటీ చేసుకున్న చంద్రబాబు..  చేతులుకాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు.. ఇప్పుడు అమరావతి జపం చేస్తున్నారు. ఆ రకంగా అంతా కలసి, అమరావతిని అనాధను చేశారు. అందుకే ఈ పాపం అందరిన్నది ఆంధ్రుల ఆరోపణ.   పాపం అమరావతి! నిలువెత్తు బుద్దవిగ్రహం సాక్షిగా, ఇప్పుడు అమరావతికి భూములిచ్చిన రైతులు.. మంత్రులతో అమ్మనాబూతులు తిట్టించుకుంటున్నారు. ధర్మాన కృష్ణదాస్‌అనే మంత్రి, రైతులను లం.. కొడుకులంటారు. మరికొందరు మంత్రులు పెయిడ్ ఆర్టిస్టులంటారు. ఇంకొందరు మంత్రులు, టీ షర్టులేసుకుని ఉద్యమాలు చేస్తున్నారంటారు.  మరికొందరు అది ‘కమ్మ’రావతి అని వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తారు. స్పీకర్ లాంటి వ్యక్తి దానిని ఎడారి, శ్మశానంతో పోలుస్తారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు, వాటిని భరిస్తూ, సహిస్తూ, జైళ్లకు వెళ్లినా.. తమ ఉద్యమాన్ని 300 రోజులు దాటించారు. ప్రస్తుతం రాజకీయ పార్టీల పాపం పుణ్యాన, అనాధగా మారిన అమరావతి.. న్యాయం కోసం న్యాయస్థానం వైపు రోడ్డుకు మోకాళ్లు ఆనించి, దీనంగా చూస్తోంది.   మోదీ ప్రధాని హోదాలో వచ్చి శంకుస్థాపన చేశారు. ఢిల్లీని మించిన రాజధానిగా మారాలన్నారు. ఢిల్లీ కూడా చిన్నబోయేలా కొత్త నగరం ఉండాలన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ రాజధాని నగరాలను, సందర్శించమని సలహా కూడా ఇచ్చారు. మేం మీ వెంట ఉన్నామని భరోసా ఇచ్చారు.  కాబట్టి బీజేపీ అమరావతి నగరాన్ని,  వాయువేగంతో నిర్మిస్తుందని భావించారు. ఆ తర్వాత అక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు భూములు కూడా కేటాయించారు. దానితో ఇంకేముంది? అమరావతి నగర నిర్మాణం, పంచకల్యాణి గుర్రంలా పరుగులు పెడుతుందనుకున్నారు.  కానీ చంద్రబాబుతో దొస్తీ చెడటంతో, బీజేపీ తీరు కూడా మారింది. దానికితోడు నిర్మాణాల తాలూకు డీపీఆర్ కూడా కేంద్రానికి ఇవ్వలేదు. అప్పటికీ కన్నా లక్ష్మీనారాయణ హయాంలో అమరావతికి అనుకూలంగానే తీర్మానించారు. ఆయన కూడా రైతులతో కలసి ధర్నా నిర్వహించారు. మౌనదీక్ష నిర్వహించారు. ఇప్పుడు పరిస్థితి అందుకు రివర్సు. బీజేపీలో అమరావతి గురించి ఎవరు మాట్లాడితే, వారిపై వేటు వేస్తున్నారు.   ఈలోగా.. ఒక జీవీఎల్, ఇంకో సోము, ఇప్పుడు విష్ణువర్దన్‌రెడ్డి రూపంలో వెలువడిన అపశకునాల బట్టి, అమరావతికి కమలం పార్టీ కూడా శల్యసారథ్యం వహిస్తోందని స్పష్టమయింది. పైగా రాజధాని వ్యవహారంలో కేంద్ర ప్రమేయం ఏమీ లేదని, అఫిడవిట్ ఇచ్చింది. దీన్నిబట్టి.. మెడ మీద తల ఉన్న ఎవరైనా, అమరావతి అంశంలో జగన్ దారిలోనే.. బీజేపీ వెళుతోందన్న విషయం అర్ధమయి తీరాలి. అందుకే అమరావతి రైతులు ఢిల్లీలో కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగినా, అక్కడే ఉన్న మోదీ నుంచి ఒక్కమాట కూడా రాలేదంటే.. ఈ వ్యవహారంలో బీజేపీ పాత్ర ఏమిటన్నది సుస్పష్టం.   ఇక అమరావతి పాపంలో, చంద్రబాబుదే సింహభాగమన్నది.. ఈ పరిస్థితి-దుస్థితి అనుభవిస్తున్న వారి మాట. అధికారంలో ఉన్నప్పుడు గెజిట్‌లో అమరావతిని చేర్చకుండా.. డిజైన్లు, అత్యుత్తమ రాజధానుల సందర్శనల పేరిట చేసిన,  ప్రచారంతో కూడిన కాలయాపనే ఈ పరిస్థితికి మూలం అన్నది,  మెజారిటీ వర్గాల అభిప్రాయం. తాత్కాలిక నిర్మాణాలతో కాంట్రాక్టర్లకు దోచిపెట్టే యోచన, పూర్తి స్థాయి నిర్మాణాలకు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అసలు జగన్ దానిపై దృష్టి సారించే అవకాశం కూడా ఉండేది కాదన్నది వారి వాదన. నిజమే కదా మరి? తాత్కాలిక సచివాలయం పేరుతో బాబు, బడా కాంట్రాక్టరుకు సర్కారు భూమి ఇచ్చి మరీ, వందల కోట్లు సమర్పించుకున్నారు. సదరు కంపెనీ నిర్మించిన సచివాలయం ఖరీదు, హైదరాబాద్‌లో నిర్మించే భవనాలతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ ఖర్చు.   నెల్లూరు నారాయణ సారథ్యంలో జరిగిన ఈ వ్యవహారంలో.. కాంట్రాక్టర్లు, వారిచ్చే కమిషన్లతో  టీడీపీ లాభపడితే, పూర్తిగా నష్టపోయింది మాత్రం రైతులేనంటున్నారు. విభజన జరిగిన వెంటనే చంద్రబాబు మేల్కొని, బెజవాడకు వచ్చి పూర్తి స్థాయి నిర్మాణాలు చేయని పాపమే.. ఇప్పుడు రైతులకు శాపమైంది. అదే  జగన్ మూడురాజధానుల ఆలోచనకు, ఊపిరిపోసిందనేది మెజారిటీ వర్గాల నిశ్చితాభిప్రాయం. అటు.. అమరావతిని ‘కమ్మ’రావతిగా ప్రచారం చేసిన వైసీపీ నేతలు, ఇప్పటివరకూ దానిని నిరూపించలేకపోయారు. అటు టీడీపీ కూడా, దానిని అబద్ధమని నిరూపించే ప్రయత్నం చేయకుండా.. నారాయణ, పుల్లారావు వంటి భూములు కొన్న  నేతలను కాపాడేందుకే ప్రాధాన్యమిచ్చింది. అమరావతి నిర్మాణ సమయంలో, నానా హడావిడి చేసిన ‘నారాయణ మాస్టారు’ ఇప్పుడు,  ఏ కలుగులో దాగున్నారో ఎవరికీ తెలియదు.   నగర నిర్మాణం అవుతుందో లేదో తెలియని అయోమయం.. మూడు పంటలు పండే భూములిచ్చి.. ఇప్పుడు నెత్తిన చేయి పట్టుకున్న రైతులే, అమరావతిని కాపాడుకునే పనిలో ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సర్కారుకు.. ఎదురొడ్డి పోరాడుతున్న వేలాది మంది రైతులు, వారి పక్షాన పోరాడుతున్న ఒక సుంకర పద్మశ్రీ, మరో వెగలపూడి గోపాలకృష్ణ ప్రసాద్, పువ్వాడ సుధాకర్, ఇంకో మార్టిన్, కంభంపాటి శిరీష, దుర్గాభవానీ, అక్కినేని వనజ వంటి జేఏసీ నేతలే, ఇప్పుడు అమరావతి కథలో హీరోలు. మరి వారంతా హీరోలయితే.. మోదీ-చంద్రబాబు-జగన్‌తోపాటు, అమరావతి గ్రామాలలో వీరవిహారం చేసి.. ఆడబిడ్డ తెచ్చుకున్న టిఫిన్ బాక్సులో ఉప్మా తిని, చివరాఖరకు కమలంతో చేతులు కలిపి.. ఇప్పుడు ఉద్యమాన్ని కాడికిందపడేసిన,  జనసేన వీరుడు పవన్ సంగతేమిటన్న సందేహం రావచ్చు.  ప్లీజ్.. ఆ ఒక్కటీ అడక్కు! అది మీ ఇష్టం!! -మార్తి సుబ్రహ్మణ్యం

కిడ్నాపర్లను గుర్తించడానికి ఐదు రోజులా! టెక్నాలజీ  తుస్సేనా! 

శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శం.. సాంకేతిక టెక్నాలజీ వినియోగిస్తూ కేసులు చేధించడంలో తెలంగాణ పోలీసులే టాప్.. రాష్ట్రంలో ఎక్కడ చీమ చిట్టుకుమన్నా గుర్తించే పరిజ్ఞానం మన పోలీసుల సొంతం.. ఇవి గత ఐదేండ్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న మాటలు.  గొప్పగా చేసుకుంటున్న ప్రచారాలు. గత ఆరేండ్లలో పోలీస్ శాఖకు భారీగా నిధులిచ్చామని, హైటెక్ సౌకర్యాలు కల్పించామని, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఆయన చెబుతుంటారు. కాని ఒక్క ఘటన తెలంగాణ పోలీసుల సత్తాకు సవాల్ గా నిలిచింది. మహబూబా బాద్ కిడ్నాప్ కేసు తెలంగాణ పోలీసుల పనితీరును ప్రశ్నించేలా మారింది. తెలంగాణ కాప్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిహసించేలా చేస్తోంది.    మహబూబా బాద్ లో జరిగిన బాలుడి కిడ్నాప్ కేసులో పోలీసుల తీరుపై చాలా ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. హైటెక్ టెక్నాలజీ ఉన్న రోజుల్లోనూ కిడ్నాపర్లను గుర్తించడానికి ఐదు రోజులు తీసుకోవడం ఏంటనే ఆరోపణలు వస్తున్నాయి. అది కూడా కిడ్నాపర్లు డబ్బుల కోసం బాలుడి పేరెంట్స్ తో మాట్లాడుతూనే ఉన్నారు. బాలుడి పేరెంట్స్ చుట్టే  పోలీసులు తిరిగారు. కిడ్నాపర్ల ఫోన్లను పోలీసులు కూడా విన్నారు. అయినా వారెవరో, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారో , కిడ్నాపర్లు ఫోన్ మాట్లాడుతున్న లొకేషన్ ఏంటో వెంటనే కనిపెట్టలేకపోయారు. ఎక్కడో అమెరికాలో ఉన్న వ్యక్తి లొకేషన్ ను మినిట్ టు మినిట్ ట్రేస్ చేసే టెక్నాలజీ ఉన్న ప్రస్తుత సమయంలో ... మహబూబా బాద్  పోలీసులకు కిడ్నాపర్లను గుర్తించడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రజల్లో కూడా ఇవే అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వం చెబుతున్న గొప్ప టెక్నాలజీ ఎక్కడ పోయిందని వారు ప్రశ్నిస్తున్నారు.    ఆదివారం సాయంత్రం దీక్షిత్ రెడ్డి కనిపించకుండా పోయారు. అదే రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. డబ్బుల కోసం కిడ్నాపర్ సోమవారం బాలుడి పేరెంట్స్ కు 11 సార్లు ఫోన్ చేశారని చెబుతున్నారు. మంగళవారం సైలెంట్ గా ఉన్న అగంతకులు బుధవారం మళ్లీ బాలుడి పేరెంట్స్ తో టచ్ లోకి వచ్చారు. డబ్బులు ఇవ్వాలని, ఇక్కడికి రావాలని, డబ్బును అక్కడ పెట్టి వెళ్లండని ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నారు. అయినా ఐదు రోజులుగా బాలుడి కోసం వెతుకుతున్న పోలీసులు మాత్రం కిడ్నాపర్ల జాడ కనిపెట్టలేకపోయారు. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ కాలంలో కూడా కిడ్నాపర్లు ఫోన్ లో మాట్లాడుతున్నా గుర్తించకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీక్షిత్ రెడ్డి కేసులో మహబూబా బాద్ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి.   అయితే మహబూబా బాద్ ఎస్పీ కోటిరెడ్డి మాత్రం కేసులో తామెక్కడ నిర్లక్ష్యం వహించలేదని చెప్పారు. కిడ్నాపర్ చాలా తెలివిగా వ్యవహరించాడని, తనను ట్రేస్ చేయకుండా ఉండటానికి ఫోన్ వాడలేదని తెలిపారు. బాలుడి పేరెంట్స్ కు ఇంటర్ నెట్ కాల్స్ చేశారని ఎస్పీ వెల్లడించారు. యాప్ ద్వారా ఇంటర్ నెట్ కాల్స్ చేయడం వల్లే కిడ్నాపర్ ను గుర్తించడం వెంటనే సాధ్యం కాలేదన్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ సాయంతో కిడ్నాపర్ వాడిన యాప్ ను గుర్తించి.. అతని మార్గంలోనే యాప్ సాయంతోనే గుర్తించామని చెప్పుకొచ్చారు. కిడ్నాపర్ యాప్ వాడటం వల్లే గుర్తించడానికి ఎక్కువ సమయం పట్టిందని ఎస్పీ తెలిపారు. అయితే ఎస్పీ ప్రకటనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం సాధారణ జనాలే హైటెక్ టెక్నాలజీని  ఉపయోగిస్తూ డిజిటల్ వండర్స్ చేస్తున్నారు. పోలీసుల దగ్గర మరింత అత్యాధునిక పరిజ్ఞానం అందుబాటులో ఉంటుంది. అయినా యాప్ ద్వారా మాట్లాడుతున్న కిడ్నాపర్ ను వెంటనే గుర్తించే టెక్నాలజీ లేకపోవడం ఏంటనే విమర్శలు జనాల నుంచి వస్తున్నాయి. టెక్నాలజీ వినియోగంలో  పూర్ గా ఉన్న ఈ పోలీసులనే .. దేశానికే ఆదర్శమని సీఎం కేసీఆర్ చెబుతున్నారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.    మహబూబా బాద్ జిల్లా కేంద్రంలోనే దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ జరిగింది. బాలుడిని బైక్ పై తీసుకుని దర్జాగా వెళ్లాడు కిడ్నాపర్. కాని ఎక్కడా సీసీ టీవీలో అవి రికార్డు కాలేదు. అంటే మహబూబా బాద్ జిల్లా కేంద్రంలో సీసీ కెెమెరాలు కొన్ని ప్రాంతాల్లోనే ఉన్నాయని దీన్ని బట్టి అర్ధమవుతోంది. అందుకే కిడ్నాపర్ విజువల్స్ ఎక్కడా చిక్కలేదని, పట్టణ శివారులోని ఒక ప్రాంతంలోనే అతడి విజువల్ రికార్డైందని తెలుస్తోంది. జిల్లా ఎస్పీ కూడా ఇదే విషయం చెప్పాడు. అయితే జిల్లా కేంద్రంలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు సరిగ్గా లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కెమెరాలు ఎక్కడ అమర్చారనే ప్రశ్నలు వస్తున్నాయి. జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే గ్రాామాలు, పల్లెల్లో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.    ఐదేండ్ల క్రితం ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో మిస్సైన బాలుడిని ఇటీవలే అసోంలోని గోలపారాలో గుర్తించి త‌ల్లిదండ్రుల చెంత‌కు చేర్చారు. తెలంగాణ స్టేట్ పోలీసులు అభివృద్ధి చేసిన ఫేస్ రికగ్నిషన్ యాప్ ద‌ర్ప‌న్ ద్వారా ఇది సాకార‌మైందని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. ద‌ర్ప‌న్ ద్వారా తెలంగాణ పోలీసులు బాలుడిని గుర్తించి ఆచూకీని క‌నుగొన్నారని ఆయన తెలిపారు. ఇంతటి టెక్నాలజీ ఉన్న తెలంగాణ పోలీసులు.. ఫోన్ లో మాట్లాడుతున్న కిడ్నాపర్లను గుర్తించడానికి ఐదు రోజులు తీసుకోవడం చర్చనీయాశంగా మారింది. మొత్తంగా మహబూబా బాద్ ఘటన తెలంగాణ పోలీసుల ప్రతిష్టకు మచ్చగా, సీఎం కేసీఆర్ గొప్పగా చేసుకుంటున్న ప్రచారానికి గండి కొట్టేదిగా మారిందనే చర్చే జనాల్లో ఎక్కువగా జరుగుతోంది.

'మిర్జాపూర్' మున్నా నిజంగానే 40 మందిని హ‌త్య చేశాడు!

  ప్రైమ్ వీడియోలో ఇటీవ‌లే 'మిర్జాపూర్ 2' సిరీస్ విడుద‌లై, వీక్ష‌కుల్లో అమిత‌మైన క్రేజ్ తెచ్చుకుంది. గ్యాంగ్ వార్స్‌, ప‌గ‌-ప్ర‌తీకారాలు, క్రూర హ‌త్య‌ల‌తో సాగే ఈ సిరీస్‌లో మిర్జాపూర్‌కు మ‌కుటంలేని మ‌హారాజు కావాల‌నుకొని ఒక‌రితో ఒక‌రు త‌ల‌ప‌డే గుడ్డు పండిట్‌, మున్నా భ‌య్యా మ‌ధ్య యుద్ధాన్ని మ‌నం చూస్తున్నాం. ఆశ్య‌ర్య‌క‌ర‌మైన విష‌య‌మేమంటే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మిర్జాపూర్‌లో మున్నా బ‌జ్‌రంగి పేరుతో నిజ‌మైన గ్యాంగ్‌స్ట‌ర్ నిన్న మొన్న‌టిదాకా ఉండేవాడు. మున్నా అంటే మిర్జాపూర్‌తో పాటు జాన్‌పూర్‌, వార‌ణాసి ప్రాంతాల జ‌నం భ‌యంతో వ‌ణికిపోయేవారు. మున్నా బ‌జ్‌రంగి అస‌లు పేరు ప్రేమ్ ప్ర‌కాశ్ సింగ్‌. తొలిసారి హ‌త్య‌కేసు, అక్ర‌మంగా ఆయుధాల‌ను క‌లిగి ఉండ‌టం అభియోగాల‌తో పోలీసు కేసు న‌మోద‌య్యే స‌మ‌యానికి అత‌ని వ‌య‌సు కేవ‌లం 17 సంవ‌త్స‌రాలు! సొంతంగా కొన్ని హ‌త్య‌లు చేసిన త‌ర్వాత మున్నా బ‌జ్‌రంగి జాన్‌పూర్‌లోని గ‌జ్‌రాజ్ సింగ్ గ్యాంగ్‌లో చేరాడు. 'మిర్జాపూర్ 2'లో జాన్‌పూర్ పేరు కూడా మ‌నం చూశాం. 1990ల‌లో ముఖ్తార్ అన్సారీ గ్యాంగ్‌తో క‌లిశాడు మున్నా. పూర్వాంచ‌ల్ ప్రాంతంలో అన్సారీ గ్యాంగ్ స‌మాంత‌ర పాల‌న సాగించిందంటారు. మావూ రీజియ‌న్ నుంచి ఆ గ్యాంగ్ కార్య‌క‌లాపాలు న‌డిచేవి. గ్యాంగ్ పోరులో భాగంగా బీజేపీ లీడ‌ర్ కృష్ణ‌ప్ర‌సాద్ రాయ్‌ను మున్నా, అన్సారీ, వాళ్ల గ్యాంగ్ స‌భ్యులు క‌లిసి హ‌త్య చేశారు. ప‌ట్ట‌ప‌గ‌లు ఆరు ఏకే-47 రైఫిల్స్‌తో, 400 బుల్లెట్ల‌తో రాయ్ శ‌రీరాన్ని జ‌ల్లెడ మాదిరి చిల్లులు ప‌డేట్లు కాల్చి చంపారు. అప్ప‌ట్లో ఆ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా అది పెను సంచ‌ల‌నం క‌లిగించింది. రాయ్‌ను హ‌త్య చేశాక మున్నా త‌న ఫ్యామిలీతో ముంబైకి మ‌కాం మార్చాడు. 40కి పైగా హ‌త్య‌లు, దోపిడీ కేసులున్న మున్నా ఆచూకీ తెలిపిన వారికి రూ. 7 ల‌క్ష‌ల రివార్డును సైతం ప్ర‌క‌టించారు. చివ‌ర‌కు ముంబై పోలీసుల స‌హ‌కారంతో ఢిల్లీ పోలీసులు 2009లో ముంబైలో ప‌ట్టుకున్నారు. జైలులో ఉండే 2012 ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అప్నా ద‌ళ్ పార్టీ అభ్య‌ర్థిగామ‌రియాహు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు మున్నా. క్రిమిన‌ల్ గ్యాంగ్స్‌తో, పొలిటీషియ‌న్స్‌తో ఉన్న సంబంధాల కార‌ణంగా అత‌డిని త‌ర‌చూ ఒక జైలు నుంచి మ‌రో జైలుకు మారుస్తూ వ‌చ్చారు. 2018 జూలైలో బాఘ్‌ప‌ట్ జైలులో స‌హ ఖైదీ, ప్ర‌త్య‌ర్థి గ్యాంగ్ స‌భ్యుడైన‌ సునీల్ రాఠీ చేతిలో హత్య‌కు గుర‌య్యాడు మున్నా బ‌జ్‌రంగి. హ‌త్య‌కు ఒక‌రోజు ముందే ఒక దోపిడీ కేసులో కోర్టులో హాజ‌రుప‌ర్చ‌డం కోసం బాఘ్‌ప‌ట్ జైలుకు అధికారులు త‌ర‌లించారు. ఇది ప‌థ‌కం ప్ర‌కారం చేసిన హ‌త్య అంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ కేసును ప్ర‌స్తుతం సీబీఐ ద‌ర్యాప్తు చేస్తోంది. కాగా, మున్నా బ‌జ్‌రంగి నిజ జీవిత ఘ‌ట‌న‌ల ఆధారంగా 'మిర్జాపూర్' సిరీస్‌లోని మున్నా భ‌య్యా పాత్ర‌ను క‌ల్పించామ‌ని దాని నిర్మాత‌లు ఎప్పుడూ ప్ర‌క‌టించ‌లేదు. మున్నా భ‌య్యా పాత్ర‌ను దివ్యేందు శ‌ర్మ పోషించాడు.

ఫైనల్ వరకు ఉండేదెవ‌రు?.. బిగ్ బాస్ 50రోజులు పూర్తి..

  బిగ్ బాస్ సీజన్ 4 రియాల్టీషో యాభైరోజుల జర్నీ పూర్తి చేసుకుంది. ఆరువారాలు హోస్ట్ గా కింగ్ నాగార్జున అలరించారు. ఇక ఏడోవారం వీకెండ్ దసరా స్పెషల్ గా నాగార్జున పెద్దకోడలు అక్కినేని సమంత హోస్ట్ గా వ్యవహరించి కంటెసెంట్లను, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్పెషల్ అపిరెన్స్ గా వచ్చిన అక్కినేని అఖిల్ తనదైన శైలీలో ఎంటర్ టైన్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 4 లో 16మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైంది. ముగ్గురు సెలబ్రేటీలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టారు. అందులో ఇద్దరు ఇంటిదారి పట్టగా కామెడియన్ ముక్కు అవినాష్ ఏడోవారం కెప్టెన్ గా హౌస్ లో కొనసాగుతున్నారు. ఎనిమిదోవారానికి హౌస్ లో 11మంది కంటెస్టెంట్లు మిగిలారు. ఇక రానున్న ఏడువారాల్లో వీరిలో ఇంటిదారి పట్టేవారిలో ముందుగా అమ్మ రాజశేఖర్, లాస్య, మెహబూబ్, మోనాల్, అవినాష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.  ఇక చివరి వరకు ఉండే కంటెస్టెంట్లు ఎవరు అన్నది ఇప్పటికే ప్రేక్షకులకు ఒక క్లారిటీ వచ్చింది. అమ్మయిల్లో హారిక, అరియానా బలమైన కంటెస్టెంట్లుగా ఉన్నారు. అబ్బాయిల్లో అభిజిత్, అఖిల్, నోయల్, సోహైల్ పోటాపోటీ పడుతున్నారు. వీరిలో నోయల్ గత సీజన్ లో విన్నర్ గా నిలిచిన రాహుల్ బెస్ట్ ఫ్రెండ్. దాంతో హౌస్ లో ఎలా మెలగాలో, బిగ్ బాస్ ను ఎలా ప్రసన్నం చేసుకోవాలో ముందుగానే తెలుసుకున్నట్లు కనిపిస్తుంది. మొదటి రెండు వారాలు తన ర్యాప్ సాంగ్స్ తో హౌస్ లో హల్ చల్ చేసినా ఆ తర్వాత సెఫ్ గేమ్ అడుతూ టాస్క్ ల్లో పెద్దగా రిస్క్ తీసుకోవడం లేదు. కామ్ గా.. ఉన్నామా.. తిన్నామా అన్నట్లు హౌస్ లో కంటిన్యూ అవుతున్నారు. అందరితో మంచిగా ఉంటూ ఇప్పటికే రెండుసార్లు హౌస్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నారు. జైలుకు వెళ్ళిన ఏకైక కంటెస్టెంటు కూడా నోయల్ లే కావడం గమనించాల్సిన విషయం. నోయల్ వ్యక్తిగత విషయానికి వస్తే సింగర్ గా సినీపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత యాక్టర్ గా చాలా సినిమాలో కనిపించాడు. ఇటీవల తన తండ్రి గురించి అబద్దాలు చెప్పాడంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. అయితే నోయల్ తమ్ముడు క్లారిటీ ఇవ్వడంతో నోయల్ పై వచ్చిన వ్యతిరేకత కాస్త తగ్గింది. ఇక అభిజిత్ మైండ్ గేమ్ ఆడుతూ నాగార్జున తోనూ కాప్లిమెంట్స్ అందుకున్నాడు.   టాస్క్ లకు దూరంగా ఉంటూ , డాన్స్ ఫర్మామెన్స్ లోనూ వెనకబడుతున్న అభి పై సమంత కూడా కామెంట్ చేసింది. కాప్లిమెంట్స్ అయినా కామెంట్స్ అయినా ఒకేలా తీసుకుంటూ చాలాచాలా సేఫ్ గా గేమ్ ఆడుతున్నాడు అభిజిత్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా శేఖర్ కమ్ముల సినీపరిశ్రమకు అభిజిత్ ను పరిచయం చేశారు. మొదటిసినిమాతోనే ఆకట్టుకున్న అభి ఆ తర్వాత మిర్చిలాంటి కుర్రాడులో నటించాడు. అభిజిత్ నటించిన పెళ్ళిగోల వెబ్ సిరిస్ కుర్రకారును అలరించింది. దాంతో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అఖిల్ అభి ఫ్రెండ్స్ కూడా కావడం అతనికి మరో ఫ్లస్ పాయింట్. బిగ్ బాస్ సీజన్ 4లో మొదటివారం నుంచి దాదాపు ప్రతివారం నామినేషన్స్ లోకి వస్తున్నాడు. అయినా ఫాల్లోవర్స్ సేవ్ చేస్తున్నారు. సింగరేణి ముద్దు బిడ్డ అంటూ నాగార్జునతో ముద్దుగా పిలిపించుకున్న సోహైల్ హౌస్ లో గట్టి పోటీ ఇచ్చే కంటెస్టెంట్ గా ఉన్నాడు. కథ వేరుంటది అంటూ మొదటి 2,3వారాలు మెడనరాలు పొంగేలా ఆవేశపడిపోయిన సోహైల్ ఆ తర్వాత నాగార్జున సూచనలతో చాలా కూల్ అయిపోయాడు. అన్నీ టాస్క్ లో బెస్ట్ గా ఫర్మామ్ చేస్తున్నాడు.  బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభంలో అరియానాతో కలిసి సీక్రెట్ రూంలో రెండు రోజులు ఉన్నాడు. ఆ తర్వాత హౌస్ లోకి వచ్చారు. మొదట్లో నాలుగైదు వారాల్లో బిగ్ హౌస్ నుంచి ఇంటిదారి పడతాడు అనిపించినా.. ఆ తర్వాత స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారాడు. కొత్తబంగారు లోకం సినిమాతో సోహైల్ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత సినిమాల్లో, సీరియల్స్ లో నటిస్తున్నా పెద్ద గుర్తింపు రాలేదు. ఇస్మార్ట్ సోహైల్ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టడంతో తనను మంచి బ్రేక్ వస్తుందన్న ఆశతో టాస్క్ ల్లోనూ బెస్ట్ గా ఆడుతున్నాడు. నేను నాలానే ఉంటా అంటూ అన్ని రకాల ఎమోషన్స్ ను బిగ్ హౌస్ లో పండిస్తున్న కంటెస్టెంట్ అఖిల్ సార్థక్. మొదటివారంలోనే కంటతడి పెట్టి సున్నిత మనష్కుడు అన్న గుర్తింపు తెచ్చుకున్నాడు.  బిగ్ హౌస్ లో గంగవ్వ ప్రిమమైన మనుమడిగా  ఆప్యాయతను అందుకున్నాడు. ఆ తర్వాత మోనాల్ తో చనువుగా ఉంటూ లవర్ బాయ్ గా పేరుతెచ్చుకున్నాడు. గత రెండువారాలుగా మోనాల్ ఎలిమినేషన్ ను అఖిల్ ప్రేమ అడ్డుకుంటుంది అంటే అర్ధం చేసుకోవచ్చు అఖిల్ కు హౌస్ లో ఎంత ప్రాముఖ్యత ఉందో...బిగ్ బాస్ హౌస్ లోని అన్ని టాస్క్ లోనూ పాల్గొంటూ ఫిట్ నెస్ వీరుడిగా గుర్తింపు పొందాడు. ఇక అఖిల్ సార్థక్ వ్యక్తిగతం జీవితానికి వస్తే సీరియల్స్ లో నటిస్తున్నాడు.  హైద‌రాబాద్ మోస్ట్ డిజైర‌బుల్ మెన్ జాబితాలో మూడో స్థానం సొంతం చేసుకున్నాడు. ఈ నలుగురిలో ముగ్గురు మాత్రం కచ్ఛితంగా ఫైనల్ వరకు ఉంటారు అన్ని ప్రేక్షకులు, నెటిజన్ల అభిప్రాయం. ఇక అమ్మాయిల విషయానికి వస్తే బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభంలో కంటెస్టెంట్లలో అమ్మాయిల సంఖ్యే ఎక్కువ. ఏడు వారాల్లో ఇంటిదారి పట్టిన వారిలో ఐదుగురు అమ్మాయిలే. గంగవ్వ తనంట తాను బిగ్ హౌస్ నుంచి బయటకు రావడంతో మొత్తం పదిమంది లేడీ కంటెస్టెంట్లలో ఆరుగురు బయటకు రాగా నలుగురు హౌస్ లో కొనసాగుతున్నారు. వీరిలో మోనాల్, లాస్య ఇంటిదారి పడతారని చివరి వరకు అరియానా, హారిక హౌస్ లో కొనసాగుతారని నెటిజన్ల అభిప్రాయం. వీరిద్దరూ కూడా తమతమ నిజజీవితాల్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోని బిగ్ బాస్ హౌస్ వరకు చేరుకున్నారు. అరియానా ఫస్ట్ డే నుంచి సూపర్ యాక్టీవ్ గా ఉంటూ అన్ని టాస్క్ లో పోటాపోటీగా ఆడుతోంది. ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్  మూడుసీజన్లలో లేడీ కంటెస్టెంట్లు ఎవరూ విన్నర్ కాలేదు. ఈ సారి లేడీ కంటెస్టెంట్ విన్నర్ కావాలన్న పట్టుదలతో ఆమె ఉన్నట్లు కనిపిస్తోంది.  ఏ టాస్క్ లోనూ వెనక్కి తగ్గకుండా గట్టి పోటీని ఇస్తోంది. అరియానా ఐదేళ్ల కిందట యాంకర్ గా వినోదరంగంలోని వచ్చారు. జెమిని కామెడీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆర్జెవీని ఇంటర్వ్యూ చేసి ఆయనతో మెప్పు పొందారు. ఇక అప్పటినుంచి ఆర్జీవీ మెచ్చుకున్న అరియానా అన్నగుర్తింపు వచ్చింది. దాంతో ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. చలాకీతనం, ముక్కుసూటిగా వ్యవరించే తత్త్వం ఆమెకు బిగ్ హౌస్ లో మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ప్రారంభంలో సోహైల్ తో కలిసి సీక్రెట్ రూంలో ఉంది ఇంటిసభ్యులను ఓ ఆటఆడుకుంద. హౌస్ లోకి వచ్చిన తర్వాత బెస్ట్ ఫర్మామెన్స్ ఇస్తోంది. రానున్న రోజుల్లోనూ ఇదే స్పీడ్ తో జాగ్రత్తగా ఆడితే ఆమె అనుకున్న కల నిజం కావచ్చు. నాల్గోసీజన్ విన్నర్ లేడీ కంటెస్టెంట్ కావచ్చు.. ఇది అరియానే కావచ్చు. కామ్ గా ఉంటూనే టాస్క్ లో మాత్రం రెచ్చిపోయి ఫర్మామెన్స్ చేస్తుంది హారిక. లక్షలాది మంది ఫాలోయింగ్ ఉన్న దేత్తడి హారిక ఫైనల్ వరకు ఉండే అవకాశాలు చాలానే ఉన్నాయి. అమెజాన్ లో మంచి ఉద్యోగం వదిలేసి యూట్యూట్ ప్రారంభించి చాలాతక్కువ కాలంలోనే నెటిజన్ల హార్ట్ లకు కనెక్ట్ అయ్యింది. సోషల్ మీడియాలో మంచిఫాలోయింగ్ ఉంది. అరియానా తన మనసులోది అరిచి చెప్పితే హారిక మాత్రం చేతల్లో చూపిస్తోంది. ఫైసల్ వరకు వీరిద్దరూ నువ్వానేనా అన్నట్లు పోటీపడే అవకాశాలు చాలా ఉన్నాయి. - య‌శోద వంగా

కరణ్‌ జోహార్‌కి క్లీన్‌ చిట్‌

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత మర్డర్‌ మిస్టరీగా మొదలైన కేసు, ఆ తరువాత డ్రగ్స్‌ మలుపు తీసుకున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్‌ కోణం వెలికి తీసే ప్రక్రియలో భాగంగా సుశాంత్‌ ప్రేయసి రియా చక్రవర్తి అరెస్ట్‌ అయ్యారు. బెయిల్‌ మీద విడుదలయ్యారు. ఆ సమయంలో 2019లో ప్రముఖ బాలీవుడ్‌ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ ఇంటిలో జరిగిన పార్టీలోనూ పలువుగు సెలబ్రిటీలు డ్రగ్స్‌ సేవించారని పుకార్లు షికార్లు చేశారు. అప్పటి పార్టీ మీద విచారణ చేయాలని కోరారు. దానిపై విచారణ చేసిన నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు... కరణ్‌ జోహార్‌కి క్లీన్‌ ఛీట్‌ ఇచ్చారు. కరణ్‌ ఇంట్లో పార్టీ మీద విమర్శలు ఇప్పటివి కావు. ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. తాజాగా నెల క్రితం శిరోమణి అకాళీ దళ్‌ నాయకుడు మంజిందర్‌ సింగ్‌ సిర్సా ఆ పార్టీ మీద కంప్లయింట్‌ చేశారు. ఆ వీడియోలో పేర్కొన్న వైట్‌ లైన్‌ మీద ఎటువంటి అనుమానాస్పద అంశాలు లేవనీ, ట్యూబ్‌ లైట్‌ను ఉద్దేశించి ‘వైట్‌ లైన్‌’ అన్నారని ఎన్సీబీ వర్గాలు తేల్చాయట. కరణ్‌కి క్లీన్‌ ఛీట్‌ ఇచ్చాయట. ఇటీవల కరణ్‌ జోహార్‌ కూడా తన ఇంట్లో జరిగిన పార్టీలో డ్రగ్స్‌ తీసుకున్నామనేది అవాస్తవమని వివరణ ఇచ్చారు.

డాక్ట‌ర్ రాజశేఖ‌ర్‌కు ప్లాస్మా థెర‌పీ!

  తీవ్ర‌మైన కొవిడ్‌-19 ల‌క్ష‌ణాల‌తో హైద‌రాబాద్‌లోని సిటీ న్యూరో సెంట‌ర్ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ ఆరోగ్యం క్ర‌మేణా మెరుగవుతున్న‌ట్లు హాస్పిట‌ల్ వ‌ర్గాలు తెలిపాయి. శ్వాస‌ప‌ర‌మైన ఇబ్బందులు ఎదుర్కొంటూ వ‌చ్చిన ఆయ‌న‌కు ఇప్ప‌టివ‌ర‌కు నాన్‌-ఇన్‌వేజివ్ వెంటిలేట‌ర్ స‌పోర్ట్‌తో కృత్రిమ శ్వాస అందిస్తూ వ‌చ్చిన వైద్యులు.. తాజాగా ఆ స‌పోర్ట్‌ను తొల‌గించారు. ఈ విష‌యాన్ని మంగ‌ళ‌వారం విడుద‌ల చేసిన హెల్త్ బులెటిన్‌లో హాస్పిట‌ల్ మెడిక‌ల్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ర‌త్నకిశోర్ తెలియ‌జేశారు. "ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఇప్ప‌టివ‌ర‌కూ అందించిన నాన్‌-ఇన్‌వేజివ్ వెంటిలేట‌ర్ స‌పోర్ట్‌ను తాజాగా తొల‌గించాం. చికిత్స‌లో భాగంగా ఆయ‌న‌కు ప్లాస్మా థెర‌పీ, సైటోసోర్బ్ డివైస్ థెర‌పీ అందించాం." అని ఆ బులెటిన్‌లో వెల్ల‌డించారు. డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ ఆరోగ్య స్థితి మెరుగ‌య్యింద‌నీ, చికిత్స‌కు ఆయ‌న బాగా స్పందిస్తున్నార‌నీ అందులో తెలిపారు. దీంతో రాజ‌శేఖ‌ర్ ఆరోగ్యం కోసం ప్రార్థ‌న‌లు చేస్తూ వ‌స్తోన్న అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

ఫోటోలు: వర్షిణి సిస్టర్ బర్త్ డే సెలబ్రేషన్స్ 

బుల్లితెర కత్రినా కైఫ్ అని యాంకర్ వర్షిణి పేరు తెచ్చుకున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన 'చందమామ కథలు'తో వెండితెరకు పరిచయమైన ఈమె.. నాలుగైదు చిత్రాలలో కథానాయికగా నటించారు. ప్రస్తుతం డాన్స్ రియాలిటీ షో 'ఢీ'లో యాంకరింగ్ చేస్తున్నారు.   వర్షిణికి ఓ సిస్టర్, బ్రదర్ ఉన్నారు. సోమవారం సిస్టర్ బర్త్ డే. ఈ సందర్భంగా ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా బయటకు వెళ్లారు. సిస్టర్ బర్త్ డేని వర్షిణి సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు ఇవిగో...

రాజకీయాలకు బలౌతున్న ఐఏఎస్ అధికారులు

ఇద్దరు అధికారులు దివంగత వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైన శాఖలు నిర్వహించిన వారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేతిలో వీరిద్దరూ తీరని అవమానాలకు గురౌతున్నారు. తండ్రి చేతిలో ఎత్తులు చుసిన వారు తనయుడి చేతిలో లోతులు చూస్తున్నారు. వారిద్దరూ సీనియర్ ఐఏఎస్ అధికారులు. ఒకరినైతే మెడపట్టుకుని బయటకు గెంటేశారు. మరొకరిని కులం పేరుతో కుళ్లపొడుస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఇద్దరు అధికారులూ కూడా చంద్రబాబు అంటే గిట్టనివారే. ఇద్దరు అధికారులు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న చూపుకు గురి అయిన వారే. ఒకరు బలయ్యారు.. మరొకరు అవుతున్నారు. ఆ ఇద్దరూ ఎవరంటే ఒకరు ఎల్‌వి సుబ్రహ్మణ్యం. రెండో వారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీనియర్ అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యంకు జగన్ కేసుల్లో సహా ముద్దాయిగా ఉన్నారని ప్రాధాన్య పోస్టులు ఇవ్వలేదు. ఒక సందర్భంలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పోస్టు ఇచ్చినా మళ్ళీ ఆయనను అక్కడ నుంచి తీసి అత్యంత చిన్నదైన యువజన శాఖకు మార్చారు. ఇక రమేష్ కుమార్ పరిష్తితి కూడా దాదాపుగా అంతే. చంద్రబాబు హయాంలో ఆయనకు ఏ కీలక శాఖ లభించలేదు. ఈ ఇద్దరూ వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతిభకు తగిన గుర్తింపు పొందారు. ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఇద్దరూ ఆర్ధిక శాఖను నిర్వహించిన వారే. ఆర్ధిక శాఖలో ఈ ఇద్దరిదీ ప్రత్యేకమైన శైలి అని వారితో సాన్నిహిత్యం ఉన్న అధికారులు అంటారు. రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడంలో బిల్లుల చెల్లింపు తదితర విషయాలలో ఎలాంటి వివాదాలు రాకుండా చూసిన వారన్న విషయాన్ని మర్చిపోలేం అని చెప్తున్నారు. ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడం, జవాబుదారీతనం, దుబారా తగ్గించడం వంటి విషయాల్లో ఈ ఇద్దరూ అనేక చర్యలు తీసుకున్నారు.వీరికి ఇంకో పోలిక కూడా ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఇద్దరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారులుగా పని చేశారు. ఈ ఇద్దరి హయాంలో తిరుమల పవిత్రత రెండింతలు పెరగడమే కాకుండా క్రమ శిక్షణ ఉండేదన్న విషయం మర్చిపోరాదు. భక్తుల సౌకర్యార్ధం ఈ ఇద్దరి హయాంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంతో సీనియర్ రాజకీయ నాయకులు ట్రస్టు బోర్డు చైర్మన్లుగా ఉన్నా కూడా ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఈవోలుగా ఉన్నప్పుడు వీరు చెప్పినట్లే నడచుకునేవారన్న పేరుండేది. వృత్తి పట్ల అంతటి నిబద్ధతతో ఈ ఇద్దరు అధికారులు పని చేశారు. అత్యంత సీనియర్ అయిన ఎల్‌వి సుబ్రహ్మణ్యం ను పక్కన పెట్టి ఆయన కన్నా జూనియర్లకు చంద్రబాబునాయుడు చీఫ్ సెక్రటరీ పదవిని అప్పగించారు. అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యని విషయం మనం చూసాం. సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేటాను పక్కన పెట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఎల్‌వి సుబ్రహ్మణ్యంను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఎన్నికల కమీషన్ ప్రధాన కార్యదర్శిగా నియమించాక సహ ముద్దాయిని సిఎస్ గా ఎలా నియమిస్తారని విమర్శించారు కూడా.   ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ ఎల్‌వీ ని కొనసాగించగా జగన్ ను అందరూ మెచ్చుకున్నారు కూడా. అయితే ఏమైందో ఏమూ కానీ కొద్ది కాలంలోనే ఎల్‌వి ని అత్యంత అవమానకరంగా పదవి నుంచి జగన్ తొలగించిన విధానం కూడా తెలిసిందే. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కూడా దాదాపుగా అలానే జరిగింది. ఆయనను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించడం చంద్రబాబుకు అస్సలు ఇష్టం లేదు. చంద్రబాబు దగ్గర పని చేయడం రమేష్ కుమార్ కూ ఇష్టం లేదని అంటారు. అయితే తన కార్యదర్శిగా పని చేసిన రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నియమించాలని అప్పటి గవర్నర్ ఇ ఎస్ ఎల్ నర్సింహన్ చంద్రబాబుపై వత్తిడి తెచ్చారనీ. గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అప్పగించారనీ అంటున్నారు. రమేష్ కుమార్ పేరు బదులు వేరే అధికారి పేరు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశామని చంద్రబాబు కూడా చెప్పారు. అటువంటి రమేష్ కుమార్ ఇప్పుడు చంద్రబాబు ఏజెంటుగా జగన్ చేతిలో ముద్ర వేయించుకోవడం దురదృష్టం. ఈ ఇద్దరూ ముక్కుసూటిగా మాట్లాడే అధికారులు. ఎలాంటి మొహమాటం లేకుండా విధులు నిర్వర్తించే వారన్న పేరుంది. అలాంటి ఈ ఇద్దరూ కూడా అత్యంత ఘోరమైన అవమానాన్ని పొందారు. ఈ అవమానాలకు వీరు అర్హులు కాదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చని అధికార వర్గాలు అనుకుంటున్నారు. నాయకులు తమ స్వంత ప్రయోజనాల కోసం అఖిల భారత సర్వీసు అధికారులకు కులాలు, ప్రాంతాలు అంటగట్టడం ఏంటని కొందరు ఆవేదన చెందుతున్నారు.

ఆంధ్ర లో బీజేపీ 'పంచ్' తంత్రం...

  * దిగుమతి నాయకులు, బిజినెస్ లీడర్లు, లాబీయిస్టులు కలిసి బీ జె పి ని ఎటు నడిపిస్తారో....  * ఇంతకీ స్థానిక సమరం లో సత్తా చూపించే ట్యాలెంట్ ఆ పార్టీకి ఉన్నట్టా, లేనట్టా....  * జి వి ఎల్ ఋతుపవనాల్లాంటి వారు... ఇలావచ్చి అలా పలకరించి, అటు నుంచి ఆటే మాయమైపోతారు  * సి ఎం రమేష్ లాబీ మాస్టర్ గా ఢిల్లీ లో ప్రసిద్ధులు.. నోకియా మాదిరి ఈయన కూడా కనెక్టింగ్ పీపుల్ నినాదాన్ని బలంగా నమ్మిన వారు  * సుజనా చౌదరి... గత్యంతరం లేని పరిస్థితుల్లో అమరావతి నినాదాన్ని భుజాన వేసుకుని చందమామ కథలో విక్రమార్కుడి మాదిరి ... వై ఎస్ ఆర్ సి పి లోని బేతాళుడి తో జగడమాడుతుంటారు  * టీ జీ వెంకటేష్.. అవసరార్ధ రాజకీయాల కు కేరాఫ్ అడ్రెస్ .... రాయలసీమ అనేది ఈయనకు ట్యాగ్ లైన్ ...దురదపుట్టినప్పుడు గోక్కోవటానికి ఉపయోగపడే ఆరో వేలుగా ఆయన ఆ నినాదాన్ని బాగా వాడేస్తారు..  * అంగ వంగ కళింగ రాజ్యాలను అవలీలగా గెలిచిన చక్రవర్తి, చివరకు ఆముదాలవలస లో ఓడిపోయినట్టు, రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ , చివరకు పవన్ కళ్యాణ్ తో కలిసి స్థానిక సమరం లో బీజేపీకి కాస్తో కూస్తో ఉన్న ఇమేజ్ ని పణం గాపెట్టే సాహసానికి ఒడిగట్టారు  ఆ ఐదుగురూ ఇంతకీ ఏమి చేస్తున్నట్టు..భారతీయ జనతా పార్టీ దిగుమతుల విభాగం నుంచి డంప్ అయిన జి వి ఎల్ నరసింహారావు , అలాగే తెలుగు దేశం నుంచి బీ జె పి లోకి దిగుమతి అయిన సుజనా చౌదరి, సి ఎం రమేష్, టీ జీ వెంకటేష్ , కాంగ్రెస్ లో నుంచి బీ జె పి లోకి షిఫ్ట్ అయిన  బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ  నారాయణ కలిసి ఈ స్థానిక సమరం లో రాష్ట్రం మొత్తం మీద కనీసం ఒక్కొక్కరికి 50 చొప్పున 250 మంది ఎం పి టి సి లు, జెడ్ పీ టి సి లను  గెలిపించుకురాగలరా అనేది చాలా పెద్ద సందేహం గా కనిపిస్తోంది. ఎందుకంటే, నిన్ననే విజన్ డాక్యుమెంట్ ని కలిసి ఆవిష్కరించిన బీ జె పి , జన సేన కంబైన్ నేతలు , చాలా పెద్ద  దృశ్యాన్నే జనం ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. వై ఎస్ ఆర్ సి పి, తెలుగుదేశం పార్టీ లకు తామే ప్రత్యామ్నాయమన్నట్టు గా ప్రకటించుకున్న ఈ ఐదుగురిదీ  వాస్తవానికి తలో దారీ.. ఎవరు , ఎప్పుడు, ఎందుకు, ఎలా మాట్లాడతారో తెలీని గందర గోళం ....  జి వి ఎల్ నరసింహ రావు ది అయితే సొంత రాజ్యాంగం, పూర్తిగా పార్టీ రాష్ట్ర శాఖ తో  గానీ, లేదా బీ జె పి లో ఉన్నతెలుగుదేశం మాజీ లతో  కానీ ఈయనకు ఎలాంటి సంబంధాలు ఉండవు.  రాష్ట్రాన్ని ఎప్పుడైనా పలకరించడానికి రుతు పవనాల మాదిరి అలా చుట్టపు చూపు గా వచ్చేసి ,  ఇలా మాయమైపోయే  జి వి ఎల్ వ్యవస్థ ల గురించి రాష్ట్ర బీ జె పి లో ఎవరికీ ఎలాంటి క్లూలు ఉండవు. ఈయన దారి రహదారి. ఈయన వ్యవస్థ ఇలాఉంటే, బీ జె పి లో ఉంటూ కూడా ఇంకాతెలుగు దేశం ఎజెండా , జెండా రెండూ మోస్తున్నట్టు కనిపించే సుజనా చౌదరి ఒక్క అమరావతి అంశం మీద తప్పించి, ఇతరత్రా ఏదీ మాట్లాడటానికి ఎక్కువగాఇష్టపడరు. జీ వీ ఎల్ కు, సుజనా కూ క్షణం పడదు. ఆయన ఎడ్డెం అంటే ఈయన తెడ్డెం అనే రకం.. ఏ మాత్రం పొసగని,పొంతన లేని పరస్పర భిన్నమైన అభిప్రాయాలు గల వీరిద్దరూ ఉత్తర ధృవం, దక్షిణ ధృవం మాదిరి ఒకే పార్టీ లో ఉంటూ కూడా కామన్  ఎజెండా తో పని చేసిన దాఖలాలు ఇప్పటివరకూ అయితే లేవు.   ఇహ, సి ఎం రమేష్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆయన తన బిజినెస్ వ్యవహారాలను బీ జె పి తో ముడి కట్టేసి, ఏ పార్టీ లో ప్రయాణిస్తున్నాడో కూడా మర్చే పోయి, మొన్నటికి మొన్న పరిమళ్ నత్వాని ని జగన్ మోహన్ రెడ్డి దగ్గర ప్రవేశ పెట్టడం లో కీలక పాత్ర పోషించిన  ఘనుడు. గుర్తు చేస్తే కానీ తానూ బీ జె పి లో ఉన్నాననే విషయం గుర్తుండని ఈయన కు  బీ జె పి, జన సేన కలిసి పోటీ  చేస్తున్న విషయం తెలుసో లేదో అని కూడాపార్టీ శ్రేణులు గుసగుస లాడుకుంటున్నాయి.  ఇహ వీరందరినీ సమన్వయము చేసుకుని  ముందుకెళ్తున్నట్టు భావిస్తూ , బాహ్య ప్రపంచం ముందు ఆవిష్కృతమయ్యే  వ్యక్తి మరెవరో కాదు... సాక్షాత్తూ  రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. ఈయన, పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణించటానికి అంతగాసుముఖం గా లేదు...కారణమేమిటంటే, చంద్రబాబు నాయుడు లాంటి యోధులతో పోరాడిన తన రాజకీయం , చివరకు ఇలా ఏ పూట ఎక్కడ ఉంటారో కూడా తెలీని పవన్ కళ్యాణ్ పార్టీతో కలిసి పని చేయాల్సిన దుస్థితికి దిగజారటమేమిటని  తరచూ తనలో తానె కుమిలి పోతున్నట్టు సమాచారం.  ఇహ, టీ జీ వెంకటేష్ అయితే మరీను..... రాయలసీమ నినాదాన్ని తన ట్యాగ్ లైన్ గాచేసుకుని కాలక్షేపం చేసేస్తూ... ప్రస్తుతానికి బీ జె పి లో నివసిస్తూ ....ఈ స్థానిక ఎన్నికల సమరం లో తన పాత్ర ఏమిటో కూడాతెలీకుండా జీవనం వెళ్లదీస్తున్నారు. మొత్తానికి ఈ పంచ పాండవులు స్థానిక సమరం లో తమ 'పంచ్ ' పవర్ ఏమిటో ఈ నెలాఖరు లోగా చుపిస్తారేమోననే బోలెడు , ఇంకా గంపెడాశతో బీ జె పి అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

ఏపీలో వంద కోట్ల దందా.. రియల్ క్రైమ్ స్టోరీ

సినిమాలలో ఎన్నో క్రైమ్ స్టోరీలు, ఎన్నో కిడ్నాప్ సీన్లు చూసుంటారు. అయితే.. కాకినాడలో జరిగిన ఈ రియల్ స్టోరీ ముందు ఆ రీల్ స్టోరీలన్నీ చిన్నబోతాయి. పేరున్న రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న అధికారులు.. ఇలా భారీ తారాగణం నటించిన.. ఆ రియల్ స్టోరీ టైటిల్ వచ్చేసి.. "ఓ కిడ్నాప్, వంద కోట్ల స్కాం". 'నేనే రాజు నేనే మంత్రి' మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. మీరు ఏ పార్టీకి ఓటేసినా మేమే అధికారంలో ఉంటామని. అవును.. కొందరు రాజకీయ నాయకులు.. ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తే.. ఆ పార్టీలోకి జంప్ చేస్తారు. అలాగే అధికారులు కూడా.. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలని కాకాపడుతూ వారి ఆటలు సాగిస్తుంటారు. ఈ రియల్ స్టోరీ వింటే అది నిజమని మీకే అర్ధమవుతుంది. కాకినాడలోని సర్పవరంకి చెందిన ఆకుల గోవిందరాజు అనే వ్యక్తికి భోగాపురంలో వంద కోట్ల విలువైన 18 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ ఒక్క విషయం చాలదా.. మాఫియా కన్ను ఆయన మీద పడటానికి. ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్న గద్దకి కింద ఉన్న కోడిపిల్ల కనిపించినట్టు.. మాఫియా వాళ్ళకి ఎక్కడున్నా విలువైన ల్యాండ్స్ కనిపిస్తాయి కదా. అలాగే, బలగ ప్రకాష్ అనే మాఫియా లీడర్ కి.. ఆకుల గోవిందరాజుకి చెందిన ల్యాండ్ పై కన్నుపడింది. ఇంకేముంది ఏకంగా పోలీసులనే రంగంలోకి దింపాడు. ఇక పోలీసులైతే ఓ అడుగు ముందుకేసి ఏకంగా కిడ్నాప్ కే తెరలేపారు. 2017.. సెప్టెంబర్ 19 .... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. మధ్యాహ్నానికి- సాయంత్రానికి నడుమ సూర్యుడు మండిపోతున్న సమయం... అబ్బా ఏమన్నా ముహూర్తమా... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. ఇదే కిడ్నాప్ కి సరైన ముహూర్తం అనుకున్నారేమో పోలీసులు... AP 30 AB 6655 నెంబర్ గల ఇన్నోవా కార్ లో.. పోలీసులు ఆకుల గోవిందరాజు ఇంటికి వచ్చారు. కారు నెంబర్ ఫ్యాన్సీగా ఉన్నా, ఆ ఖాకీలు చేసే పని మాత్రం ఏ మాత్రం పద్దతిగా లేదు. వాళ్ళు చేసే పనేంటో ఆ చుట్టుపక్కల ఉన్నవారికి తెలియదు. కొత్త మొహాలు కావడంతో.. చుట్టుపక్కల వారు కొందరు ఆశ్చర్యంతో, కొందరు అనుమానంతో చూస్తున్నారు. వాళ్ళు అలా చూస్తుండగానే.. దొంగల రూపంలో వచ్చిన పోలీసులు.. గోవిందరాజుని ఇన్నోవాలో పడేసి.. జెట్ స్పీడ్ లో హైవే ఎక్కారు. పోలీసుల భాషలో చెప్పాలంటే దీనినే కిడ్నాప్ అంటారు. కారు హైవే మీద దూసుకెళ్తుంది. ఆ స్పీడ్ చూస్తే.. అంబులెన్స్ డ్రైవర్ కావాల్సిన వ్యక్తి ఇన్నోవా డ్రైవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. డ్రైవర్ స్టీరింగ్ పట్టుకుంటే.. మనం ఖాళీగా ఉండి ఏం చేస్తాం అనుకున్నారేమో.. మిగతా పోలీసులు గోవిందరాజు పనిపెట్టారు. కారు.. కాకినాడ నుంచి భోగాపురం చేరేవరకు.. అంటే దాదాపు నాలుగు గంటల పాటు... గోవిందరాజుని భయపెట్టారు.. బెదిరించారు.. చిత్రహింసలు పెట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే నరకం చూపించారు. కారు సాయంత్రం 6 గంటలకు భోగాపురం సబ్ రిజిస్టార్ ఆఫీస్ కి చేరుకుంది. ఖాకీలకు భయపడ్డాడో, కాసులకు కక్కుర్తి పడ్డాడో తెలియదు కానీ.. సబ్ రిజిస్టార్ పందిళ్లపల్లి రామకృష్ణ.. సాయంత్రం 4:30 కే రిజిస్ట్రేషన్ కాగితాలు సిద్ధం చేసి.. పదేళ్ల తర్వాత ఫారెన్ నుంచి రిటర్న్ వస్తున్న ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తున్నట్టు.. గుమ్మం వైపు చూస్తూ పోలీసుల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో పోలీసులు గోవిందరాజుని తీసుకొని గుమ్మంలోకి అడుగు పెట్టనే పెట్టారు. గుమ్మంలో వాళ్ళ అడుగు పడిందో లేదో.. సబ్ రిజిస్టార్ మోహంలో వెలుగు వచ్చింది. గోవిందరాజు మోహంలో భయం పెరిగింది. భయంతో చూస్తుండగా ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉన్న మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనిపించాడు. జర్నీలో పోలీసుల చిత్రహింసలతో భయపడిపోయిన గోవిందరాజు.. బలగ ప్రకాష్ ని చూసి మరింత భయపడ్డాడు. బలగ ప్రకాష్.. పోలీసుల మాదిరి సాగదియ్యలేదు.. కమర్షియల్ సినిమాల్లో విలన్ లాగా ఒక్కటే డైలాగ్ కొట్టాడు.. "సంతకం పెడతావా? సమాధిలో పడుకుంటావా?".... ఆ ఒక్క డైలాగ్ తో గోవిందరాజు భయం చావుభయంగా మారిపోయింది. ఎదురుగా మాఫియా లీడర్.. చుట్టూ భోగాపురం సీఐ నర్సింహారావు, ఎస్సైలు తారక్, మహేష్.. హెడ్ కానిస్టేబుల్ గోవిందరావు.. ఉన్నారు. ఎస్సైల పేర్లు తారక్, మహేష్ అని హీరోల పేర్లు ఉన్నాయి కానీ.. వాళ్ళ బిహేవియర్ మాత్రం పెద్ద విలన్ల పక్కన ఉండే చెంచా విలన్లు లాగా ఉంది. అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులే.. మాఫియా లీడర్ తో కలిసిపోయి.. చిత్రహింసలు చేసి బెదిరిస్తుంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో, వంద కోట్లు కంటే విలువైన ప్రాణం కోసం, అన్యాయం ముందు తలవంచి గోవిందరాజు సంతకం పెట్టాడు. ఆ ఒక్క సంతకంతో.. గోవిందరాజు మొహంలో తప్ప.. అక్కడున్న అందరి మొహాల్లో లక్ష్మీకళ ఉట్టిపడింది. అన్నట్టు ఇంత జరుగుతున్నా అక్కడ ఇతరులు ఎవరూ లేరా? అని మీకు అనుమానం రావొచ్చు. అక్కడ నిజంగానే ఎవరూ లేరు.. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ముహూర్తం అలాంటిది మరి. శూన్యమాసం-అమావాస్య.. బుద్ధి ఉన్నోడు ఎవడైనా రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాడా? వీళ్లంటే.. వంద కోట్ల కబ్జా ల్యాండ్ కాబట్టి.. బుద్ధిని పక్కనపెట్టి.. బెదిరించి.. రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు. ఇప్పుడు అర్థమైందా వాళ్ళ శూన్యమాసం-అమావాస్య కాన్సెప్ట్ ఏంటో?!!.. ఈ కిడ్నాప్- కబ్జా వ్యవహారంపై.. సర్పవరం పోలీస్ స్టేషన్ లో 330/217 నెంబర్ తో కేస్ రిజిస్టర్ అయింది. అదేంటో.. FIR కూడా అయిన తరువాత.. చార్జిషీట్ దాఖలు చేయడానికి.. రాజమౌళి RRR చేయడానికి తీసుకునే టైం కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు సర్పవరం పోలీసులు. రెండున్నరేళ్లుగా నాన్చుతూనే ఉన్నారు. ఈ విషయం గురించి.. ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కాకినాడ పోలీసులు రిపోర్ట్ కూడా పంపారు. కానీ చార్జిషీట్ దాఖలు చేసే విషయంలో సర్పవరం సీఐ డిలే చేస్తూనే ఉన్నాడు. ఏంటి ఆ సీఐ ధైర్యం?.. భయపడితే భయపడటానికి ఆయన పోస్ట్ మ్యాన్ కాదు.. పోలీసోడు.. దానికితోడు పొలిటిషీయన్స్ సపోర్ట్ ఉన్నోడు. అవును.. ఈ వ్యవహారంలో.. బడా పొలిటిషీయన్స్ సపోర్ట్ కూడా ఉంది. అదే పోలీసుల ధైర్యం... శ్రీకాకుళం జిల్లాకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత.. అలాగే గత ప్రభుత్వ హయాంలో విప్ గా పనిచేసిన నేత.. వీరిద్దరి సాయంతో సర్పవరం పోలీస్ స్టేషన్ ని ఫుల్ గా influence చేసే ప్రయత్నం బలంగా నడుస్తుంది. అందుకే చార్జిషీట్ కి మోక్షం కలగట్లేదు. ఇంత పెద్ద కిడ్నాప్- కబ్జా జరిగితే అస్సలు చర్యలే తీసుకోకుండా ఎలా ఉన్నారని అనుకుంటున్నారేమో... అబ్బో చాలా పెద్ద చర్య తీసుకున్నారు. భోగాపురం ఇన్స్పెక్టర్ ని బదిలీ చేసారు. అదేంటి!!.. అంత జరిగితే కేవలం బదిలీనా అనుకోవద్దు.. రాజకీయ ఒత్తిళ్లు అలాంటివి మరి.. అర్థంచేసుకోవాలి... ఇంకో విషయం ఏంటంటే.. ఈ వ్యవహారం డీజీపీ ఆఫీస్ కి కూడా చేరింది. మరి ఇంకేంటి.. వెంటనే అందరి మీద చర్యలు తీసుకొని ఉంటారుగా అంటారా? అబ్బో.. మీరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సినిమాలు చూసి బాగా మోసపోయారు... అలాంటి పప్పులు ఇక్కడ ఉడకవు. వాస్తవానికైతే... CRPC 41A కింద డీజీపీ నియమించే ఓ సీనియర్ అధికారి.. విచారణ జరిపి.. తదుపరి చర్యల వరకు.. ఆ సీఐని సస్పెండ్ చేసే అవకాశముంది. కానీ ఇక్కడ అలాంటిదేం జరగలేదు. ఏదో ఫార్మాలిటీకి బదిలీతో సరిపెట్టారు. గోవిందరాజు ని బెదిరించి వంద కోట్ల విలువైన ల్యాండ్ అన్యాయంగా లాక్కున్నారు. అయినా తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. పైగా గోవిందరాజునే ఇంకా టార్చర్ చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లలో భాగంగా.. ప్రస్తుత సర్పవరం సీఐ మరియు అర్బన్ డీఎస్పీ.. గోవిందరాజుని పదేపదే తిప్పించుకుంటున్నారు. ఇక కాకినాడలో ఉద్యోగం వెలగపెడుతున్న.. ఇప్పటి ఓ మంత్రిగారి బావమరిది.. రంగంలోకి దిగడంతో ఈ కేసు మరింత డైల్యూట్ అయింది. అసలే భోగాపురంలో ఎయిర్ పోర్ట్ అంటున్నారు. రెక్కలున్న విమానాలు వస్తున్నాయి అంటే.. ఆటోమేటిక్ గా భూముల ధరలకు రెక్కలొస్తాయి కదా.. అందుకే పోలీసులు- పొలిటీషియన్స్ అండతో మాఫియా ఇంతలా రెచ్చిపోతుంది. అంతేకాదు.. ఈ వ్యవహారం వెనుక.. 2017 ప్రాంతంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పనిచేసిన ఓ కలెక్టర్ మరియు ఎస్పీ పాత్ర ఉన్నట్టు.. సెక్రటేరియట్ వర్గాల వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. టీడీపీ పెద్దతలకాయలకు సన్నిహితులైన ఈ ఐఏఎస్, ఐపీఎస్ లు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా తమ హవా కొనసాగించడం... అందరినీ ముక్కు, మూతి ఇలా అన్నింటి మీదా వేలేసుకునేలా చేస్తుంది. ఇంతకీ ఆ ఐఏఎస్ & ఐపీఎస్ ఎవరు? * ఒకరు.. పరుల అవినీతి మీద కాంతివంతంగా దండెత్తే ఐఏఎస్... * ఇంకొకరు.. పొద్దునలేస్తే సుభాషితాలు చెప్పే పాలమీగడ లాంటి ఐపీఎస్.. ఈయనకి టెక్నాలజీ మీద గ్రిప్ బాగా ఎక్కువ. ఈ వ్యవహారంలో వీరిద్దరి పాత్ర కూడా ప్రముఖంగా ఉంది. 'వంద గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు కూలిపోతుంది' అన్నట్టు.. ఈ అవినీతి రాబందులను భయపెట్టే గాలివాన ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనుసన్నల్లో.. ఐఏఎస్, ఐపీఎస్లు, పోలీసులు, పొలిటీషియన్స్ అండతో జరిగిన ఈ అన్యాయంపై.. గోవిందరాజు కొద్ది నెలలుగా పోరాడుతూనే ఉన్నాడు. న్యాయం కోసం ఆయన ఎక్కని గుమ్మం దిగని గుమ్మం లేదు. సన్నిహితుల సాయంతో న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఆ పోరాడంతో కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి అప్పుడు జరిగింది తప్పుడు రిజిస్ట్రేషన్ అని పేర్కొంటూ... భోగాపురం రిజిస్టార్ డాక్యుమెంట్ రైటర్.. 2019 అక్టోబర్ 19 తేదీన.. 164 CRPC స్టేట్మెంట్ ని.. కాకినాడ ఫస్ట్ అడిషనల్ జ్యూడిషల్ సివిల్ జడ్జ్.. ముందట ఇచ్చాడు. అంతేకాదు.. సీసీ కెమెరాలతో దొంగలని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల పుణ్యమా అని అడ్డంగా బుక్ అయ్యారు. సర్పవరం లో కిడ్నాప్ చేసి.. భోగాపురం తీసుకెళ్లిన.. నాలుగు గంటల తతంగమంతా.. పలు చోట్ల సీసీ కెమెరాలలో రికార్డు అయింది. క్షవరం అయితే కానీ ఇవరం రాదని.. సీసీ కెమెరాలు చూసి దోషులని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల సంగతి మర్చిపోయి ఇలా దొరికిపోవడం కామెడీగా ఉంది. మొత్తానికి కొద్దికొద్దిగా కదులుతున్న తీగతో.. దందా చేసి ఇన్నాళ్లు డొంకలో దాక్కున్నవారు.. ఇప్పుడిప్పుడే భయంతో వణుకుతున్నారు. ముఖ్యంగా డీజీపీకి కంప్లైంట్ వెళ్లడంతో ఐఏఎస్, ఐపీఎస్ ఒణికిపోతున్నారట. మరి ముఖ్యంగా ఆ ఐపీఎస్ అయితే.. డైపర్ వేసుకొని తిరుగుతున్నాడని టాక్... ఇప్పటికే ఆ ఐపీఎస్ గడిచిన రెండు నెలల్లో.. బలగ ప్రకాష్ టీం తో.. ఒకే హోటల్ లో 17 సార్లు సిట్టింగ్ వేశాడు. దీన్నిబట్టే అర్థంచేసుకోవచ్చు ఆ ఐపీఎస్ ఎంతలా వణికిపోతున్నాడో!! తప్పుని సరిదిద్దాల్సిన పోలీసులే.. ఇంత పెద్ద తప్పు చేశారు. ఈ విషయం డీజీపీ దృష్టికి కూడా వెళ్ళింది. మరి ఆయన ఈ కిడ్నాప్-కబ్జా వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?.. బాధితుడికి ఎప్పుడు న్యాయం చేస్తారు? ఆయన ఇలాగే మౌనంగా ఉంటే ప్రజలకు పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం పోతుంది. ఇక ఈ విషయంలో సర్కార్ కూడా అడుగు ముందుకేసి బాధితుడికి న్యాయం చేయాల్సిన అవసరముంది. అవినీతి రహిత పాలనే అందించడమే తమ లక్ష్యమని చెప్పుకునే అధికారపార్టీ.. అవినీతి-అన్యాయం చేసిన వారికి.. పరోక్షంగా అండగా ఉండటం ఎంత వరకు కరెక్ట్? గత ప్రభుత్వం మీద, అప్పుడు వారికి సన్నిహితంగా ఉన్న కొందరు అధికారులపైనా.. ఇప్పటి అధికారపార్టీ నేతలు పదేపదే అవినీతి ఆరోపణలు చేస్తుంటారు. మరి ఈ వ్యవహారం మీద ఎందుకు నోరు మెదపడం లేదు? ఇందులో తమ పార్టీ నేతలు కూడా ఉన్నారా? లేక పార్టీ సీనియర్ నేతైన మంత్రి గారి బావమరిది ఇన్వాల్వ్ అయ్యాడని వెనకడుగు వేస్తున్నారా? ప్రభుత్వం దీనిపై స్పందించాలి. ఈ భోగాపురం భాగోతం వెనుకున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి.. బాధితుడికి న్యాయం చేయాలి. లేదంటే ప్రభుత్వం మీద కూడా నమ్మకం పోతుంది.  

క‌విత‌, ష‌ర్మిలా రాజ్య‌స‌భ‌కు వెళ్తారా?

తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్ల కోసం అధికార టీఆర్ఎస్‌లో పోటాపోటీ నెలకొంది. షెడ్యూల్‌ ప్రకారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్‌ మార్చి 6న జారీ కానుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది.  సామాజిక కోణంలో తమకు అవకాశం దక్కుతుందని పలువురు సీనియర్లు భావిస్తుండగా, ఇప్పటివరకు పార్టీ తరఫున రాజ్యసభ పదవులు దక్కని వర్గాల వారూ ఆశగా ఎదురుచూస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.  నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవితను ఈసారి పార్టీ తరఫున రాజ్యసభకు పంపిస్తార‌నే ప్ర‌చారం విస్తృతంగా జరుగుతోంది. అయితే సి.ఎం. కేసీఆర్ ఆలోచ‌నే ఎలా వుందో ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు. కెటిఆర్ సి.ఎం. అవుతారా? క‌వితా రాజ్య‌స‌భ‌కు వెళ్తారా?  అయితే హ‌రిష్‌రావు ఈ ప‌రిణామాల‌పై ఎలా స్పందిస్తారు? అనే అంశంపై టిఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌ల్లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న సీఎం కేసీఆర్‌ తన తరఫున ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ప్రయత్నాలకు నమ్మకమైన వారి కోసం అన్వేషిస్తున్నారు.  రాజ్యసభ సీటు భర్తీ సామాజిక కోణంలోనే ఉంటుందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు భావిస్తున్నారు. ఏపీ కోటాలో పదవీ విరమణ చేస్తున్న టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు వయసు రీత్యా ఈసారి అవకాశం ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. రెడ్లకు అవకాశం లభిస్తే, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, మాజీీ స్పీకర్‌ కె.ఆర్‌.సురే్‌షరెడ్డి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి మధ్య పోటీ ఉంటుందని చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మండవ వెంకటేశ్వరావు, తుమ్మల నాగేశ్వరరావు పేర్లు పరిశీలించవచ్చని అంటున్నారు. బీసీలకు అవకాశం ఇస్తే సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య పేర్లు పరిశీలిస్తారని చెబుతున్నారు. ఎస్సీ కోటాలో భర్తీ చేయాలని భావిస్తే కడియం శ్రీహరి, మాజీ ఎంపీ మంద జగన్నాథం పేర్లు పరిశీలిస్తారని అంటున్నారు. ఎస్సీల్లోనే మాలలకు అవకాశం ఇవ్వాలని అనుకుంటే, టీఎ్‌సఐఐసీ చైర్మన్‌ గాదరి బాలమల్లు, ఎస్టీ అయితే సీతారాంనాయక్‌ పేరు ఉండొచ్చని అంటున్నారు. అనూహ్యంగా ఒక పారిశ్రామికవేత్తను టీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభకు పంపాలని అనుకుంటే హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి పేరు పరిశీలించవచ్చని చెబుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ స్థానాలు ఎవరికీ కేటాయించాలని ఇన్నాళ్లు చర్చించిన అధికార పార్టీ ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వారి జాబితా సిద్ధమైనట్టు సమాచారం.  కీలకమైన పదవులు కావడంతో పార్టీ నమ్ముకున్నోళ్లు.. తమకు అండగా నిలబడిన వ్యక్తులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల్లో వార్త వినిపిస్తోంది.  మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి - సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీమంత్రి - ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జాబితా ఫైనలైనట్టు తెలుస్తోంది.  షర్మిల ఆపద సమయంలో జ‌గ‌న్‌కు తోడుగా నిలిచారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేశారు. కష్టకాలంలో పార్టీకి షర్మిల పెద్ద దిక్కుగా నిలిచారు. తన సొంత మీడియా సాక్షి ప్రారంభించినప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ తో ఉన్నారు. సాక్షి పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ గా కొనసాగుతూనే జగన్ కు రాజకీయాలపై సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత సజ్జలను పార్టీలోకి ఆహ్వానించి పెద్ద పదవే ఇచ్చారు. విజయ సాయిరెడ్డి తర్వాత జగన్ కు అత్యంత నమ్మకస్తుడు సజ్జలనే. ఆయన పార్టీలో జగన్ రాజకీయ సలహాదారుడిగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో పని చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతున్నారు. కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ఎప్పుడూ తన తోడు ఉండడంతో ఆయనను రాజ్యసభకు జగన్ పంపించనున్నట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన వైవీ సుబ్బారెడ్డి జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. గతంలో ప్రకాశం ఎంపీగా సుబ్బారెడ్డి పని చేశారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో సుబ్బారెడ్డి పోటీ చేయలేదు. అప్పుడు ఆయన పదవులు ఆశించకపోవడంతో ఇప్పుడు రాజ్యసభకు పంపించాలని నిర్ణయానికి వచ్చారు. పార్టీలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపితే న్యాయం జరుగుతుందనే భావనలో జగన్ ఉన్నారంట. అనూహ్యంగా రాజ్యసభకు పంపే జాబితాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి ఉండడం గమనార్హం. అనంతపురము జిల్లాకు చెందిన రఘువీరారెడ్డికి పిలిచి మరి రాజ్యసభ సీటు ఇస్తామంటున్నారు. యాదవ సామాజికి వర్గానికి చెందిన రఘువీరారెడ్డి జగన్ తండ్రి వైఎస్సార్ తో మంచి అనుబంధం ఉంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే మరొకరిని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిగా పని చేసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారంట.  కృష్ణాజిల్లా యాదవ సామాజిక వర్గానికి చెందిన చలమేశ్వర్ సేవలను వినియోగించుకునేలా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందంట. ఎందుకంటే తరచూ జగన్ న్యాయస్థానాల్లో చిక్కులు ఎదుర్కొంటున్నారు. చలమేశ్వర్ సేవలు వినియోగించుకుంటే జగన్ సేఫ్ గా ఉండడంతో పాటు న్యాయ కోవిదుడికి గౌరవంగా రాజ్యసభను ఇద్దామనే ఆలోచనలో ఉన్నారంట.

అధికారంలో ఉంటే ఒకలా... ప్రతిపక్షంలో ఉంటే మరోలా... వైజాగ్ ఎపిసోడ్ నీతి ఏంటి?

రాజకీయాల్లో ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయి. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే. ప్రస్తుతం దేశంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతోంది. నిన్నమొన్నటివరకు దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పినవారంతా, అనామకులుగా మారిపోయారు. దశాబ్దాల తరబడి రాజ్యాన్ని ఏలినవారు, ఇప్పుడు సైడైపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఉద్దండుల పరిస్థితి ఇప్పుడలాగే కనిపిస్తోంది. ఎంతోమంది ముఖ్యనేతలు తీవ్ర గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మళ్లీ వాళ్లకు మంచి రోజులు వస్తాయని మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిలోనూ ఊహించని రాజకీయ మార్పులు జరగడంతో ఓడలు బళ్లు... బళ్లు ఓడలయ్యాయి.  అయితే, అధికారంలో ఉండగా ఒకలా, ప్రతిపక్షంలా ఉంటే మరోలా వ్యవహరించడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. విపక్ష నేతగా ఉన్న సందర్భాల్లో నేతలు వ్యవహరించే తీరు ఒక్కోసారి సాధారణ ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటుంది. నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళ క్రితం విపక్ష నేతగా ఉన్నారు. అప్పట్లో ఆయన ప్రత్యేక హోదా కోసం పట్టుదలతో ఉన్నారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు వైజాగ్ పర్యటనకు వెళ్లారు. అప్పటికే అక్కడ సీఐఐ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ జరుగుతోంది. ఆ నేపథ్యంలో క్యాండిల్ ర్యాలీకి అనుమతిని ప్రభుత్వం నిరాకరించింది. అయినా కూడా జగన్ వైజాగ్ చేరుకున్నారు. అక్కడి నుంచి నగరంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పట్లో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తనను అడ్డుకోవడంపై అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇక, ఇప్పడు ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. అందులో భాగంగా చంద్రబాబు చేపట్టిన వైజాగ్ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందులో పోలీసులను తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. అయితే, ఇలాంటి సమయంలో విపక్ష నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎలాగైనా పోలీసు వలయాన్ని ఛేదించుకోవాలని తాము అనుకున్నది చేయాలని చూస్తుంటారు. పొలిటికల్ మైలేజ్ పొందాలని ప్రయత్నిస్తుంటారు. చంద్రబాబు వైజాగ్ టూర్లోనూ అదే జరిగిందనే మాట వినిపిస్తోంది. నాయకులు విపక్షంలో ఉన్నప్పుడు పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు. కాకపోతే...ఆ ప్రయత్నాలు సమాజంలో ఉద్రిక్తతలు పెంచేవిగా మాత్రం ఉండకూడదంటున్నారు. అదే సమయంలో అధికారంలో ఉన్న నాయకులు ప్రజాస్వామ్యంలో విపక్షాలకు ఉండే ప్రాధాన్యాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు. అధికారపక్షం, విపక్షం....రెండూ ప్రజాస్వామ్యానికి రెండు చక్రాల్లాంటివని, ఏ ఒక్కటి సరిగా లేకున్నా ప్రజాస్వామ్యం కుంటుపడుతుందని గుర్తుచేస్తున్నారు.

రాజీవ్ గాంధీ మరణించాక ఆ సీక్రెట్ బయటపెట్టిన వాజపేయి!!

అమావాస్య రోజు చందమామని చూడాలనుకోవడం, రాజకీయాలలో విలువలు గురించి మాట్లాడాలనుకోవడం ఒకటే అంటుంటారు. అవును ఈ తరం రాజకీయాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. ఒకరిపై ఒకరు హద్దు మీరి విమర్శలు చేసుకోవడమే తప్ప.. విలువైన రాజకీయాలు చేసేవారు ఎంతమంది ఉన్నారు ఈరోజుల్లో. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష నేతల మీద కక్ష తీచుకోవాలన్న ధోరణే తప్ప.. ప్రజల కోసం ఒకరి సూచనలను ఒకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేసేవారు ఎక్కడున్నారు?. ఈతరం రాజకీయ నాయకులు ముందుతరం వారిని చూసి ఎంతో నేర్చుకోవాలి. మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ- వాజపేయి మధ్య జరిగిన ఓ సంఘటన తెలిస్తే.. ఈ తరం రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకుంటారు. అది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయం. అప్పుడు వాజపేయి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వారి మధ్య జరిగిన ఓ అపురూప సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  " సార్..ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో వున్నారు..మీతో మాట్లాడుతారుట ".. ఫోన్ పట్టుకుని వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి.." ఫోన్ అందుకున్న వాజపేయి ప్రధానమంత్రి తో రెండు నిమిషాలు మాట్లాడారు. ఫోన్ పెట్టేసి వాజపేయి కార్యదర్శి వంక చూసి "మనం ప్రధానమంత్రి తో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి అమెరికా వెళ్తున్నాం.. ఏర్పాట్లు చూడండి" అనడంతో తను విన్నది నిజమేనా అని ఆశర్యంతో మరోమారు అటల్జీ ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు కార్యదర్శి. " సార్..పత్రికలకు ప్రెస్ నోట్ పంపమంటారా?" నసిగాడు కార్యదర్శి వాజపేయి ఒక్క క్షణం అతనివంక చూసి నవ్వుతూ "నిక్షేపంగా" అన్నారు. ఈ వార్త అప్పట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ, అటు బీజేపీ లోనూ పెద్ద దుమారం సృష్టించింది. రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు. "సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి అటెండ్ అవుతూ ప్రతిపక్షపార్టీ నేతను వెంటపెట్టుకెళ్లటం ఏంటి?" అంటూ పార్టీలో సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయి ని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారు.. ఆన్ టోల్డ్ వాజపేయి అనే పుస్తకం ద్వారా.. అదీ ఆయన మాటల్లోనే.. "1985 లోనే నాకు ఒక కిడ్నీ దెబ్బ తిని వైద్యం తీసుకుంటున్నా.1988 నాటికి రెండో కిడ్నీ కూడా దెబ్బతింది. డాక్టర్లు తక్షణం వైద్య చికిత్స అవసరం అన్నారు. ఇక్కడ కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా రమ్మని ఫోన్ లో కోరారు. కానీ చివరగా ఆయన ఒక మాట చెపుతూ.. 'అటల్ జీ.. ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియా కి రండి' అని చెప్పారు. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్లనే. నా కన్నా ఇరవై ఏళ్ళ చిన్నవాడు అయిన రాజీవ్ నాకు తమ్ముడిలాంటి వాడే" అని వాజపేయి అన్నారు. అది విలువలతో కూడిన రాజకీయమంటే. రాజీవ్ గాంధీ, వాజపేయి రాజకీయంగా ప్రత్యర్థులు కావచ్చు కానీ ఒకరినొకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేశారు. వారిని చూసి ఈ తరం రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాలి. పొద్దున్న లేస్తే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే అధికార-ప్రతిపక్ష పార్టీల నాయకులు.. రాజకీయాలు పక్కన పెట్టి అప్పుడప్పుడన్నా నైతిక విలువలు పాటించాలన్న సూత్రం.. ఇలాంటి విషయాలు తెలుసుకుని అయినా పాటిస్తే బాగుండు..!

కళ్లు చెప్పే మాటలు

మనిషిని ఇతర జీవుల నుంచి వేరు చేసే ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. సామాజిక జీవితం వాటిలో ముఖ్యమైనది. సమాజంలో మెలిగేందుకు, సంఘజీవిగా నిలదొక్కుకునేందుకు భాష, భావం... ఈ రెండూ చాలా అవసరం. భావాన్ని వ్యక్తీకరించడంలో మన కళ్లు చూపే ప్రతిభ అసాధారణం. మనిషి కళ్లలో ఉండే స్క్లెరా అనే తెల్లటి పదార్థం వల్ల మనిషి కనుగుడ్లు చిత్రవిచిత్రమైన భావాలను పలికించగలవు. అతని కనుగుడ్లలో మార్పులు, కదలికలను బట్టి.... అతను ఎటు చూస్తున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు అన్నది పసిగట్టేయవచ్చు. దీని గురించి ప్రత్యేకమైన శిక్షణ ఏమీ అవసరం లేదు. అలా తెలిసిపోతుందంతే! కాకపోతే మనకి తెలియకుండానే మన కళ్లు చేసే మాయ గురించి కాస్త అవగాహనను ఏర్పరచుకుంటే, కాస్త జాగ్రత్తగా మసులుకునే అవకాశం ఉంటుంది. - మనలో ఎంత విశ్వాసం ఉన్నాగానీ, అవతలి మనిషి కళ్లలోకి అదేపనిగా గుచ్చిగుచ్చి చూస్తూ ఉంటే... ఎదుటివారికి వ్యతిరేక భావం కలుగుతుంది. ఎంతటి దగ్గరవారైనా కానీ మాట్లాడే సమయంలో 70 శాతం మించి సమయాన్ని కళ్లలో కళ్లు పెట్టి చూడకూడదంటున్నారు బాడీలాంగ్వేజ్‌ నిపుణులు.   - అదేపనిగా చూస్తే బాగోదు అంటూ ఒక పక్క సంభాషణ జరుగుతూ ఉన్నా కూడా దిక్కులు చూస్తూ ఉంటే అసలుకే మోసం వస్తుంది. మీలో ఏదో అపరాధ భావం ఉందనో, అవతలి మనిషంటే లెక్కలేదనో... చూపులతోనే చెప్పినట్లవుతుంది. - కొంతమంది ఒకరితో మాట్లాడుతూ ఉంటారు. పక్కచూపులతో వేరొకరిని చూస్తూ ఉంటారు. ఇది కూడా అవతలి మనిషిలో చిరాకు కలిగించే అంశమే! మాట్లాడే వ్యక్తికి సదరు పక్క వ్యక్తి అంటే అనుమానమో, ఆసక్తో ఉంటే ఇలా జరుగుతూ ఉంటుంది.     - సంభాషణ మధ్యలో అవతలివాడు కను రెప్పలను చాలా నిదానంగా మూసి, ఒక్క క్షణం అలా మూసే ఉంచుతున్నాడంటే... అతను నిరాసక్తిగా ఉన్నట్లే! ఒక రకంగా చెప్పాలంటే అవతలి మనిషిని కాసేపు మర్చిపోవడానికి కళ్లు మూసుకున్నాడని అనుకోవచ్చు. ఇక దానికి తోడు సుదీర్ఘమైన నిట్టూర్పు కూడా వచ్చిందంటే అతని మీద జాలి పడక తప్పదు. అలా కాకుండా అవతలి వ్యక్తి మాట్లాడుతూ మాట్లాడుతూ తెగ కళ్లని ఆర్పుతున్నాడంటే... అతను ఏదో ఉద్వేగంలో ఉన్నట్లు లెక్క. - సంభాషణలో మనం ఎదుటివారి వంక చూస్తున్నప్పుడు ముఖ్యంగా రెండు రకాలుగా మన చూపుని వారి మీద కేంద్రీకృతం చేస్తాము. ఒకటి ఎదుటివారి కళ్లలోకి, ఆ తరువాత అతని నుదుటి మధ్యలోకి... అంటే ఒక త్రిభుజాకారంలో వారిని గమనిస్తాము. లేదా ఎదుటివారి కళ్లలోకి, ఆ తరువాత వారి నోటి వైపుకీ... అంటే తలకిందులుగా ఉన్న త్రిభుజాకారంలో చూస్తాము. మొదటి పద్ధతిలో ఎదుటి వారి మీద మనం ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్నామన్న హెచ్చరికను అందచేస్తుంది. పై అధికారులు, ఇంటర్వూ చేసేవారు ఇలాంటి చూపులు చూస్తుంటారు. ఇక రెండో పద్ధతిలో అవతలివారితో స్నేహపర్వకంగా మెలుగుతున్న సూచనను తెలియచేస్తుంది.       - కేవలం సంభాషణలోనే కాదు. ఒక మనిషి ఒంటరిగా ఉన్నా కూడా అతని కళ్లు ఏం చేస్తున్నాయదన్నదాటి బట్టి అతని మనస్థితిని గ్రహించవచ్చు. ఎదో గుర్తుకు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడా, వైరాగ్యంలో ఉన్నాడా, తనలో తాను మాట్లాడుకుంటున్నాడా అన్నది అతని కళ్లని బట్టి తేలిపోతుంది. అదెలాగంటారా! మీరే ఆ భావాలను అనుకరించడానికి ప్రయత్నించండి! ఆ సమయంలో మీ కళ్లు అసంకల్పితంగానే మీ స్థితికి అనుగుణంగా కదలడాన్ని గమనిస్తారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. కళ్లు ఈ లోకాన్ని చూడటానికే కాదు, మీ భావాలను అవతలివారితో పంచుకోవడంలో కూడా ముఖ్యపాత్రని వహిస్తాయి. అందుకే శరీరభాష (బాడీలాంగ్వేజ్‌)లో కళ్లకి ఉన్న ప్రాధాన్యత అసాధారణం. మీ ఆసక్తి, ఓపికలని బట్టి కంటి భాష గురించి ఎన్ని వివరాలనైనా సేకరించుకోవచ్చు. - నిర్జర.  

ఆత్మన్యూనత అవసరమా?

  అనగనగా ఒక బౌద్ధ భిక్షువు ఉండేవాడు. ఆయన చాలా తెలివైనవాడన్న పేరుండేది. ఆ భిక్షువు దగ్గర ఎలాంటి సమస్యకైనా సలహా లభిస్తుందని ప్రజల నమ్మకం. అందుకోసం ఎక్కడెక్కడి నుంచో జనం ఆయన దగ్గర తమ సమస్యలను విన్నవించుకునేందుకు వచ్చేవారు. ఆ సమస్యలకి భిక్షువు చెప్పే పరిష్కారాలు విని సంతోషంతో తిరిగి వెళ్లేవారు. అలాంటి భిక్షువు ఆశ్రమం ముందు ఒకరోజు రాచరికంతో ఉట్టిపడుతున్న గుర్రపుబగ్గీ ఆగింది. ఆ బగ్గీలోంచి ఆ దేశ సేనాపతులలో ఒకరు దిగారు. సేనాధిపతిని సకల మర్యాదలతో భిక్షువు దగ్గరకు తీసుకువెళ్లారు ఆశ్రమవాసులు.   భిక్షువుకి నమస్కరించిన సేనాపతి తన గోడునంతా ఒక్కసారిగా ఏకరవు పెట్టాడు- ‘స్వామీ! నేను గొప్ప వీరుడినని ఈ రాజ్యమంతా నమ్ముతుంది. ఆ నమ్మకానికి అనుగుణంగా నేను చాలా సాహసకార్యాలే చేశాను. ఎన్నో యుద్ధాలను ఒంటిచేత్తో గెలిపించాను. మరెన్నో ఆక్రమణలను తిప్పికొట్టాను. శత్రుదేశాల వారికి నేనంటే సింహస్వప్నం. రాజుగారికి నా మీద మహా అభిమానం. కానీ ఏం లాభం! నేనెందుకూ పనికిరానివాడినన్న ఆత్మన్యూనత నిరంతరం నన్ను వేధిస్తూ ఉంటుంది. నాకంటే శక్తిసంపన్నులైన రాజుగారిని చూసినా, నాకంటే తెలివితో ఉన్న మంత్రులను గమనించినా..... అంతదాకా ఎందుకు, దైవత్వం ఉట్టిపడే మీవంటి భిక్షువులను చూసినా నేను చాలా అధముడినన్న ఆలోచన బాధిస్తుంటుంది. దీనికి పరిష్కారమే లేదా?’ అంటూ బాధపడ్డాడు. సేనాపతి మాటలను చిరునవ్వుతో విన్న భిక్షువు- ‘ఈ సమస్య నీ ఒక్కడిదే కాదు. కానీ దీనికి జవాబుని వినేముందు నువ్వు కాస్త ఓపికపట్టాలి. ఇవాళ నాతో తమ బాధలను చెప్పుకొనేందుకు చాలామంది పౌరులు వచ్చారు. వారందరినీ పంపించాక తీరికగా నీతో మాట్లాడతాను. అప్పటిదాకా ఆ అతిథుల గదిలో విశ్రమించు,’ అంటూ సేనానిని పంపారు.   తన సమస్యకు భిక్షువు దగ్గర పరిష్కారం ఉందని తెలుసుకొన్న సేనాని అతిథి గదిలో నిశ్చింతగా విశ్రమించాడు. చుట్టూ ఉన్న ఆశ్రమ వాతావరణం, భిక్షువుల ఆధ్మాత్మిక సాధనలు, నిష్కల్మషమైన మనసుతో అక్కడికి చేరుకుంటున్నా పౌరులు... అతనిలోని అలజడిని కొంతవరకూ ఉపశమింపచేశాయి. ఇంతలో నిదానంగా చీకటి పడింది. ఆ రోజు పౌర్ణమి కావడంతో ఆశ్రమమంతా వెన్నెల వెలుగుతో నిండిపోయింది. ఆ వాతావరణంతో మైమరచిపోయిన ఉన్న సేనాపతి గదిలోకి భిక్షువు అడుగుపెట్టాడు.   ఉదయం నుంచి అలుపెరగకున్నా కూడా భిక్షువు మొహంలో ఎలాంటి అలసటా కనిపించలేదు. భిక్షువు గదిలోకి అడుగుపెడుతుండగానే ‘నా సమస్య సంగతి ఏం చేశారు స్వామీ!’ అంటూ ఆత్రంగా అడిగాడు సేనాని. ‘ఇవాళ పౌర్ణమి! ఆ నిండు చందమామ ఇచ్చే వెన్నెలతో పరిసరాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో కదా!’ అన్నారు భిక్షువు.   ‘నిజమే కానీ... ఆ వెన్నెల సంగతి కాస్త పక్కన పెట్టి నా సమస్య సంగతి చూడండి స్వామీ!’ అన్నాడు సేనాని అసహనంగా. ‘ఈ వెన్నెల మహా అయితే నెలకి ఓసారి వస్తుంది. అది కూడా తెల్లవారుజాముకల్లా సూర్యకిరణాల ముందు వెలవెలబోతుంది. చంద్రుడు ఎంత కాంతిని ఇచ్చినా అది సూర్యకాంతి ముందు దిగదుడుపే! అంతమాత్రాన చంద్రుడు పనికిరానివాడంటావా!’ అని అడిగారు.   భిక్షువు ప్రశ్నకి సేనాని నవ్వుతూ- ‘అలా ఎలా సాధ్యం గురువుగారూ! సూర్యడు, చంద్రుడు... రెండూ వేర్వేరు లక్షణాలు ఉన్న గ్రహాలు. దేని అందం దానిదే. దేని లక్షణం దానిదే. సూర్యడు మనకి జీవాన్ని అందిస్తే, చంద్రుడు రాత్రివేళ మనల్ని కాచుకుంటాడు. ఇక ఇలాంటి వెన్నెల రాత్రుల ముందు వంద సూర్యోదయాల అనుభూతి దిగదుడుపే కదా!’ అన్నాడు. ‘చూశావా! నీ సమస్యకి సమాధానం నీ నోటి వెంటే వచ్చింది. ఈ ప్రపంచంలో ఎవరి ప్రత్యేకత వారిదే. ఇతరులతో పోల్చుకుని నీ ఉనికిని చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం ఏముంది. మంత్రి నీలాగా కత్తిపట్టలేడు, రాజు నీలాగా సాహసాలు చేయలేడు. కాబట్టి ఇలాంటి పోలికలని కట్టిపెట్టి నీ వ్యక్తిత్వం మీద శ్రద్ధ పెట్టు,’ అంటూ ముగించారు భిక్షవు. సేనాని జీవితంలో అది నిజంగా వెన్నెల కురిసిన రాత్రిగా మారింది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   ..Nirjara

మాటే మంత్రం

అనగనగా ఓ అందమైన రాజ్యం. ఆ రాజ్యానికి ఓసారి పెద్ద ఆపద వచ్చింది. శత్రుదేశం వారు తమ రాజుని బంధించి తీసుకుపోయారు. ఆ శత్రుదేశపు కోటలోకి అడుగుపెట్టి, రాజుగారిని విడిపించుకుంటే కానీ... తమ రాజ్యానికి భవిష్యత్తు ఉండదు. కానీ ఎలా ఆ శత్రుదేశం సాధారణమైనది కాదు. ఆ దేశానికి ఉన్న కోటగోడలు ఆకాశాన్ని తాకేంత పెద్దవి. ఆ కోటగోడలను దూకి ఎలాగైనా లోపలకి ప్రవేశించేందుకు ఓ వందమంది యోధులు బయల్దేరారు. అంత పెద్ద కోట గోడని ఎవ్వరూ ఎక్కి రాలేరులే అన్న ధీమాతో శత్రుసైనికులు కోట లోపలే ఏదో పండుగ సంబరాలలో మునిగిపోయి ఉన్నారు. కోటగోడను చేరుకున్న తర్వాత తల పైకెత్తి చూసిన యోధులకు కళ్లు తిరిగిపోయాయి. ‘అబ్బే ఈ గోడని ఎక్కడం మన వల్ల కాదెహే!’ అంటూ ఓ యోధుడు ముందుగానే కూలబడిపోయాడు. మరికొందరు ఓ నాలుగడుగులు పైకెక్కి.... ‘అబ్బే ఈ గోడ నున్నగా జారిపోతోంది. దీన్ని ఎక్కడం అసాధ్యం,’ అంటూ చెట్ల కిందకి చేరుకున్నారు. అలా ఒకొక్కరే కోటగోడను ఎక్కే ప్రయత్నాన్ని విరమించుకోసాగారు. పైగా ఎక్కుతున్నవారితో కూడా ‘ఆ కోటని ఎక్కడం మానవమాత్రులకు సాధ్యం కాదు. ఇంత ఎత్తైన కోట గోడల వల్లే, ఈ రాజ్యం ఇంత గొప్పదయ్యింది,’ అని అరుస్తూ నిరుత్సాహపరచసాగారు.   ఒకవేళ ఆ మాటలు వినిపించుకోకుండా ఎవరన్నా మరికాస్త పైకి ఎక్కే ప్రయత్నం చేస్తే- ‘చెబుతోంది నీకే! బతికుంటే మరో రాజుని ఎన్నుకోవచ్చు. అనవసరంగా ఈ గోడని ఎక్కి నీ ప్రాణాలు కోల్పోవద్దు,’ అంటూ అరిచి గీపెట్టారు. కానీ అదేం విచిత్రమో కానీ, ఒక వ్యక్తి మాత్రం తనకి వినిపించే మాటలను ఏమాత్రం ఖాతరు చేయకుండా క్రమంగా పైకి ఎక్కసాగాడు. అలా ఎక్కే ప్రయత్నంలో, నాలుగడుగులు పైకి ఎక్కితే పది అడుగులు కిందకి జారిపోతున్నాడు. కాళ్లూ చేతులూ దోక్కుపోయి రక్తం ఓడుతున్నాడు. అయినా పట్టువిడవకుండా గోడ ఎక్కుతూనే ఉన్నాడు. అతను మూర్ఖుడనీ, చావుకి సిద్ధపడుతున్నాడనీ కింద ఉన్నవాళ్లు అరుస్తూనే ఉన్నారు. ఎట్టకేళకు ఓ అయిదు గంటలు గడిచిన తర్వాత... ఆ వ్యక్తి కోట గోడను చేరుకున్నాడు. శత్రువుల కంట పడకుండా కోట తలుపులు తీసి తన తోటివారిని లోపలకి తీసుకువెళ్లాడు.   వందమంది యోధులూ కలిసి శత్రుసైనికులను తుదముట్టించారు. తమ రాజుగారిని విడిపించుకుని విజయంతో తమ రాజ్యానికి చేరుకున్నారు. ‘ఎవరు ఎంతగా నిరుత్సాహపరిచినా కూడా ఇతగాడు వెనక్కి తగ్గలేదు ప్రభూ! కోట గోడని ఎక్కేదాకి తన ప్రయత్నాన్ని విరమించలేదు,’ అంటూ ఆ ఒక్క వీరుడినీ రాజుగారికి పరిచయం చేశాడు సేనాధిపతి. తన ముందు నిలబడిన ఆ వీరుని చూసిన రాజుగారు తెగ ఆశ్చర్యపోయారు. కారణం... అతను చెవిటివాడు. ‘ఒకోసారి మనల్ని నిరుత్సాహపరిచే మాటలు చెవిన పడకపోవడమే మంచిది మహారాజా! కోటగోడను ఎవ్వరూ ఎక్కలేరంటూ తోటివారంతా అరిచిన అరుపులు ఇతనికి వినపడకపోవడం వల్లే, తన లక్ష్యాన్ని చేరుకోగలిగాడు. ఒకోసారి మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇలా చెవిటివాడిలాగా ఇతరుల మాటలను వినిపించుకోకపోవడమే మంచిదేమో!’ అన్నాడు సేనాధిపతి. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.

రాజధాని రైతుల చేతులకు బేడీలు.. ఇదేనా జగన్ తెస్తానన్న రైతురాజ్యం

గుంటూరు జిల్లా జైలుకు రాజధాని రైతులను తరలించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు రైతులకు బేడీలు వేసి జైలుకు తరలించారు. జైలు వద్దకు చేరుకున్న టీడీపీ నేతలు, రాజధాని పరిరక్షణ సమితి నేతలు, తదితరులు రైతులను పరామర్శించారు. రైతులకు బేడీలు వేయడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.    కాగా, మంగళగిరి మండలం కృష్టాయపాలేనికి చెందిన రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అమరావతికి శంకుస్థాపన చేసి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా రాజధాని రైతులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అదే సమయంలో.. పేదలకు ఇళ్ల స్థలాలు, మూడు రాజధానులకు అనుకూలంగా కొంతమంది ఆటోలలో రావడంతో రాజధాని రైతులు వారిని అడ్డుకున్నారు. దీంతో రవి అనే వ్యక్తి రాజధాని రైతులపై కేసు పెట్టాడు. తర్వాత అతను తన ఫిర్యాదును వాపసు తీసుకుంటూ లేఖ రాసిచ్చినా.. కోర్టులోనే తేల్చుకోవాలని పోలీసులు సూచించారు. తన ఫిర్యాదులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రస్తావన లేకపోయినా కేసు అలా నమోదు చేశారని రవి తెలిపాడు. దీంతో పోలీసుల తీరుపై స్థానికులు ఫైర్ అయ్యారు. ఇక తాజాగా రైతులకు బేడీలు వేసి జైలుకు తరలించడంతో మరోసారి పోలిసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.   రాజధాని రైతులకు బేడీలు వేయడాన్ని టీడీపీ నేత నారా లోకేష్ ఖండించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. వరదలతో నిండా మునిగిన రైతుల్ని గాలికొదిలేశారని, రాజధానికి భూమి ఇచ్చిన రైతులకు మాత్రం బేడీలు వేశారని మండిపడ్డారు. ఇదేనా సీఎం జగన్ తెస్తానన్న రైతు రాజ్యమని ప్రశ్నించారు. 3 రాజధానుల ఆటో ఆర్టిస్టులను అడ్డుకున్నందుకే అంత కోపం వస్తే, తమ బతుకైన భూమిని ప్రజారాజధానికి త్యాగం చేసిన అన్నదాతలకు, అమరావతిని చంపేస్తుంటే ఎంత కోపం రావాలి? అని అన్నారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేసి తక్షణమే విడుదల చేయాలి. లేదంటే, న్యాయం జరిగేవరకు రైతులతో కలిసి ఉద్యమిస్తామని లోకేష్ అన్నారు.

రాజధాని రైతుల చేతులకు బేడీలు.. ఇదేనా జగన్ తెస్తానన్న రైతురాజ్యం

గుంటూరు జిల్లా జైలుకు రాజధాని రైతులను తరలించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు రైతులకు బేడీలు వేసి జైలుకు తరలించారు. జైలు వద్దకు చేరుకున్న టీడీపీ నేతలు, రాజధాని పరిరక్షణ సమితి నేతలు, తదితరులు రైతులను పరామర్శించారు. రైతులకు బేడీలు వేయడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.    కాగా, మంగళగిరి మండలం కృష్టాయపాలేనికి చెందిన రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అమరావతికి శంకుస్థాపన చేసి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా రాజధాని రైతులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అదే సమయంలో.. పేదలకు ఇళ్ల స్థలాలు, మూడు రాజధానులకు అనుకూలంగా కొంతమంది ఆటోలలో రావడంతో రాజధాని రైతులు వారిని అడ్డుకున్నారు. దీంతో రవి అనే వ్యక్తి రాజధాని రైతులపై కేసు పెట్టాడు. తర్వాత అతను తన ఫిర్యాదును వాపసు తీసుకుంటూ లేఖ రాసిచ్చినా.. కోర్టులోనే తేల్చుకోవాలని పోలీసులు సూచించారు. తన ఫిర్యాదులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రస్తావన లేకపోయినా కేసు అలా నమోదు చేశారని రవి తెలిపాడు. దీంతో పోలీసుల తీరుపై స్థానికులు ఫైర్ అయ్యారు. ఇక తాజాగా రైతులకు బేడీలు వేసి జైలుకు తరలించడంతో మరోసారి పోలిసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.   రాజధాని రైతులకు బేడీలు వేయడాన్ని టీడీపీ నేత నారా లోకేష్ ఖండించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. వరదలతో నిండా మునిగిన రైతుల్ని గాలికొదిలేశారని, రాజధానికి భూమి ఇచ్చిన రైతులకు మాత్రం బేడీలు వేశారని మండిపడ్డారు. ఇదేనా సీఎం జగన్ తెస్తానన్న రైతు రాజ్యమని ప్రశ్నించారు. 3 రాజధానుల ఆటో ఆర్టిస్టులను అడ్డుకున్నందుకే అంత కోపం వస్తే, తమ బతుకైన భూమిని ప్రజారాజధానికి త్యాగం చేసిన అన్నదాతలకు, అమరావతిని చంపేస్తుంటే ఎంత కోపం రావాలి? అని అన్నారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేసి తక్షణమే విడుదల చేయాలి. లేదంటే, న్యాయం జరిగేవరకు రైతులతో కలిసి ఉద్యమిస్తామని లోకేష్ అన్నారు.

ఏపీలో రెండో విడత రైతు భరోసా ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ రైతు భరోసా రెండవ విడత పెట్టుబడి సాయాన్ని సీఎం వైఎస్‌ జగన్ ఈ రోజు ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి రైతుల ఖాతాలకు రూ.1,114.87 కోట్ల నగదును బదిలీ చేశారు. మొత్తం 50.07 లక్షల మంది రైతులు దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. రైతు భరోసా రెండో విడతలో రైతులకు రూ.2 వేల చొప్పున ఇస్తున్నామని చెప్పారు. ఈ నెల 2న ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు అందించిన గిరిజనులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామని, వారికి రూ.11,500 చొప్పున జమ చేస్తున్నామని తెలిపారు. లక్ష మంది గిరిజన రైతులకు రూ.104 కోట్ల సాయం చేస్తున్నాము. ఎటువంటి అవినీతి, వివక్ష లేకుండా పెట్టుబడి సాయం అందిస్తున్నాం. అర్హులందరికీ మేలు జరిగేలా వారి ఖాతాల్లోకే నేరుగా డబ్బు జమ చేస్తున్నాం అని సీఎం అన్నారు.   జూన్-సెప్టెంబర్ నెలల్లో వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారమందించింది. లక్షా 66 వేల మంది రైతుల ఖాతాల్లోకి రూ.135 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. పంట నష్టపోయిన సీజన్‌లోనే పరిహారం ఇవ్వడం ఏపీ చరిత్రలో ఇదే తొలిసారని చెప్పారు. రాష్ట్రంలో రైతులకు అండగా నిలిచేలా వైఎస్సార్ జలకళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఉచితంగా బోర్లు వేయడం, మోటార్లు అందించడం ద్వారా రైతన్న తన కాళ్లపై తాను నిలబడేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వర్షాలు కురిసి ప్రాజెక్టులన్నీ కళకళలాడుతున్నాయన్నారు. వరదలపై ప్రతిపక్షం చేస్తున్న రాజకీయాలు బాధ కలిగిస్తున్నాయని సీఎం న్నారు.

టమాటాలో దాగిఉన్న ఆరోగ్యం

టమాటాతో చేసే వంటకాన్ని ఇష్టపడని వాళ్ళు ఉండరు. ఎలాంటి వంటకమైన టమాట వేస్తే చాలు దానికి రుచి వచ్చేసినట్లే. కేవలం రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందిట ఈ టమాట.టమాటా లలో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సిలు ఎక్కువ మోతాదులో ఉంటాయట.ఎసిడిటీతో బాధపడేవారు టమాటాలతో తయారు చేసిన వంటకాన్ని రుచి చూస్తే ఎంతో ఉపశమనం కలుగుతుంది. టమాటాల్లో సిట్రిక్ యాసిడ్ ఉండటంతో ఎసిడిటీ దూరమౌతుంది. ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉండటంవలన యాంటాసిడ్‌లా ఉపయోగపడుతుందంటున్నారు వైద్యులు. టమాటాల్లో విటమిన్ ఏ అధికంగా ఉండటంతో కంటి జబ్బులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది.టమాటాని చక్రాలుగా తరికి కళ్ళ మీద పెట్టుకున్నా కళ్ళకి చల్లదనం లభిస్తుంది. వీటిల్లోని విటమిన్‌ ఏ, విటమిన్‌ సి  రోగ నిరోధకశక్తినీ పెంపొందించి వ్యాధుల నుంచి రక్షణ కల్పించటంలో తోడ్పడతాయి.వీటికి ఎర్రటి రంగును తెచ్చిపెట్టే లైకొపేన్‌ మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్ల వృద్ధిని అడ్డుకోవటంలో సాయం చేస్తుంది.     ఆడవారికి నచ్చే మరో విషయం ఏమిటో తెలుసా? ప్రతిరోజూ తినే ఆహారంలో టమాటా  తింటే బరువు తగ్గుతారని పరిశోధకులు చెప్తున్నారు. టమాటాలు తినే వారు ఇతర ఆహార పదార్ధాలను ఎక్కువగా తినలేరు. ఇవి తింటే కడుపు నిండినట్లు ఉండి ఎక్కువ అన్నం గాని , ఇతర పదార్దములు గాని తిననీయదు.  కాబట్టి ఆకలి మీద నియంత్రణ ఉండి, తక్కువగా తింటారు.   మెనోపాజ్‌ దశలో ఉన్న వారు రోజు రెండు గ్లాసుల టమాటా రసాన్ని తాగడం వల్ల ఎముకలు అరిగి,విరిగిపోయే సమస్యకి స్వస్తి చెప్పవచ్చు. టమాటాల్లోని లైకోపీన్‌ వల్ల ఎముకలు బలంగా మారతాయని అధ్యయనంలో తేలింది. టమాటాల్లో గుండెకు మేలు చేసే పొటాషియం, రక్తంలో గ్లూకోజు స్థాయులను నియంత్రించే మాంగనీసులాంటివి కూడా పుష్కలంగా ఉన్నాయట. టమాటాల్లో ఇన్ని అద్భుతాలు ఉన్నాయా అని ఆశ్చర్యం వేస్తోంది కదూ. అసలే టమాటాల సీజన్. ఇంకెందుకు ఆలస్యం ఆరోగ్యాన్ని పెంపొందించుకునే పని మొదలుపెట్టేద్దాం. ......కళ్యాణి

Go and get some Sunshine Vitamin

  Remember your mom telling you when you were young “Go out and get some Sunshine” ! The adage holds good for people even today. It is reported that close to 40 per cent of Indians are vitamin D deficient. Which is quite surprising , since most parts of the country get abundant sunlight throughout the year. “Vitamin D, also known as the sunshine vitamin, is created in the body with sunlight exposure. Its major function is to maintain normal blood levels of calcium and phosphorus, which keeps the bones strong which we all know. Our modern lifestyle is one of the major reasons for vitamin D deficiency. We are working from dawn to dusk in air-conditioned offices and time spent indoors  and from professionals and students to housewives, no one comes in contact with adequate sunlight, due to which vitamin D deficiency is rampant today. Shunning the sun, people are reluctant to go out in the sun. Those who stay indoors a lot or cover their body when outside are most likely to suffer from the deficiency. Glass windows don’t help either, so you don’t generate vitamin D when sitting in your car or while at home. Child-birth is also a major reason for women who later suffer from osteoporosis and other bone related issues because of not taking enough supplements during the post pregnancy time. Lack of awareness also is one of the reasons for women to suffer from this deficiency. The previous generations were by far healthier and no body suffered from fatigue and exhaustion because they played in the sun and were exposed to the healthy sunlight. Being overweight also adds to the problem. Vitamin D is extracted from the blood by fat cells, altering its release in the body. People with a body mass index of 30 or greater often have low blood levels of vitamin D, Your body may lack the sunshine vitamin if you eat a largely vegetarian diet. “Vitamin D is found primarily in animal products such as dairy foods, liver, eggs, fish and fish oils,” However, diet alone cannot provide an adequate amount of vitamin D. Sunlight exposure is the only reliable way to generate it. Quick tips ·         Twenty minutes of good exposure, two to three times a week, with bare arms and face, is enough to achieve healthy vitamin D levels through the year. But don’t go overboard. The sun’s rays can also cause sunburn, so don’t expose yourself to it for a very long time. ·         Get  into a right diet  and consume foods rich in vitamin D and calcium .Include foods like fish, eggs and meat, breakfast cereals, soy products, dairy products, and low-fat spreads in your diet. Our traditional Indian foods like sesame seeds consumed during the month of the January Harvest season and our dairy products show the excellent blend of the calcium rich food we have used since ages. ·         The most highly recommended tip is a good rigorous outdoor physical activity to achieve adequate vitamin D levels and control obesity. And that applies to all age groups. So go out and get some Sunshine Vitamin!

ఇవి తింటే క్యాన్సర్‌ని ఆహ్వానించినట్టే!

చిన్నా పెద్దా ధనిక పేదా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ కనికరం లేకుండా కబళిస్తోన్న వ్యాధి క్యాన్సర్. దీన్ని అరికట్టడం చేతకాక ప్రపంచం దేశాలన్నీ పరిశోధనల్లో మునిగి తేలుతున్నాయి. ఎందుకు వస్తుందో ఎవరికి వస్తుందో ఎలా వస్తుందో అర్థం కాని మహమ్మారి క్యాన్సర్. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాల జోకిలి పోకుండా ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చు అన్నది మాత్రం సత్యం.    బిస్కట్లు, కేకులు వంటి వాటి దగ్గర్నుంచి బొబ్బట్లు వంటి సంప్రదాయ వంటకాలన్నిటికీ ప్రధాన దినుసు మైదాపిండి. ఇది పాంక్రియాస్ మీద తీవ్ర ఒత్తిడి కలిగించి ఇన్సులిన్ లెవెల్స్ ని అస్తవ్యస్తం చేస్తుంది. అదే విధంగా చక్కెర కూడా ఎక్కువ తీసుకోకూడదు. స్థూలకాయం, మధుమేహాలకు కారణమయ్యే చక్కెర పాంక్రియాస్, కాలేయాలతో పాటు జీర్ణవ్యవస్థను కూడా పాడు చేస్తుంది. అందుకే పండ్లు, తేనె వంటి వాటి ద్వారా అందే సహజ చక్కెర తప్ప నేరుగా చక్కెరను తీసుకోవడం మంచిది కాదు.    పాలు తాగితే ఎముకలు గట్టి పడతాయని అందరూ అంటారు. అయితే వయసు పెరిగేకొద్దీ పాలలో ఉండే ల్యాక్టోజ్ ను అరాయించుకునే శక్తి తగ్గిపోతుంది. కాబట్టి వయసు పెరిగేకొద్దీ పాలు మోతాదు దాటి తాగడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ప్యాట్రిక్ హాఫార్డ్.    వీటితో పాటు సరిగ్గా ఉడికించకుండా క్షణాల్లో తయారుచేసే జంక్ ఫుడ్... చక్కెరతో పాటు కెమికల్స్ ఎక్కువగా ఉండే సోడాలు...  మైదా, పాలు, చక్కెర కలిపి తయారు చేసే డోనట్స్ కూడా  ఎంతో కీడు చేస్తాయి. ఒకేసారి పది చెంచాల చక్కెరని కడుపులోకి పంపించే ఏ ఆహార పదార్థమైనా ప్రమాదకరమేనంటారు న్యూయార్క్ టైమ్స్ సృష్టికర్త, ప్రముఖ వైద్యులు అయిన డాక్టర్ జోసెఫ్ మెర్కోలా.   ఇక సోడియం, నైట్రేట్ ఎక్కువగా ఉండే మాంస పదార్థాలని ముట్టవద్దనేది అమెరికన్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ సూచన. ఉప్పు ఎక్కువ వేసి, నూనెలో వేయించే బంగాళాదుంప చిప్స్ జోలికి పోవద్దంటున్నారు మసాచుసెట్స్ లోని క్లార్క్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ డేల్ హ్యాటిస్. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం తరచుగా తీసుకుంటే ఉదర క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని 2005లొ క్యాన్సర్ సైన్స్ మ్యాగజైన్ చేసిన పరిశోధనలో సైతం వెల్లడైంది. అదే విధంగా క్యాన్స్ లో నిల్వ చేసి అమ్మే ఆహార పదార్థాలు,  మార్గరీన్ చీజ్ వంటివి కూడా ఎక్కువ తీసుకోకూడదనేది నిపుణుల సూచన.   కాబట్టి వీలైనంత వరకూ వీటి జోలికి పోకుండా జాగ్రత్తపడండి. క్యాన్సర్ ని మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా చూసుకోండి.  - sameeranj
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.