కాంగ్రెస్ గోత్రాలు కాంగ్రెస్ వాళ్ళకే ఎరుక

 

గొర్రెల గోత్రాలు కాపరుల కెరుక, గొప్ప వాళ్ళ గోత్రాలు ఇంట్లో పని మనుషులకు కెరుక అన్నట్లు, కాంగ్రెస్ గోత్రాలు కాంగ్రెస్ వారికి తెలిసినంత బాగా మరొకరికి తెలిసే అవకాశం లేదని వారు అప్పుడప్పుడు నిరూపిస్తుంటారు. వాళ్ళు ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకొంటున్నపుడు అవి విని ఆశ్చర్యపోవడం ప్రజలవంతవుతుంది. మొన్నబొత్స బాబుగారి విజయనగర సామ్రాజ్యంలో అడుగుపెట్టిన షర్మిల, ఆయనని ‘గుమ్మడి కాయలదొంగ’ అని ఉంటే ఈ కధ అంతా బయటకి వచ్చేదే కాదు. కానీ, ఆమె నేరుగా ఆయనకి ‘లిక్కర్ మాఫియా డాన్’ అనే బిరుదు ప్రకటించేయడంతో, ఆయన కంగు తిన్నారు.

 

ఇదివరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కూడా ఒకసారి ఏసీబీ అధికారులని తనపైకి ఇలాగే ‘ఉస్కోఉస్కో..’అని పంపిస్తే, అందులోంచి బయటపడేందుకు తలప్రాణం తోక్కకి వచ్చినంత పనయింది. అందువల్ల ఇప్పుడు ఇంకా భుజాలు తడుముకొంటూ కూర్చొంటే దెబ్బయిపోతామని భావించిన బొత్సబాబు వెంటనే తన దగ్గర ఉన్న వైయస్ కుటుంబ జాతక చక్రం బయటకి తీసి అందులోఉన్నకొన్ని వివరాలను గడగడా చదివి వినిపించేసరికి జనాలు ఔరా! అని నోటి మీద వెళ్ళేసుకోక తప్పలేదు.

 

రాష్ట్రానికి దైవపాలన అందజేసిన వైయస్ రోజూ ఒక పెగ్గు బిగిస్తే గానీ మంచం ఎక్కేవారు కాదని ఆయన ప్రజలకి తెలియజేసారు. అయితే, ఈ రోజుల్లో ఇదంతా కామన్ అంటూ, అదేమంత గొప్ప పట్టించుకోవలసిన విషయం కాదని జనాలు కొట్టి పడేస్తారనుకొన్నారో ఏమో గానీ, ఆయన మరో గొప్ప రహస్యం కూడా బయటపెట్టారు. తన అద్భుతమయిన మహత్తులతో ప్రజలందరినీ కాపాడిపడేస్తున్న అనిల్ ఏదో కేసులో ఇర్రుకొంటే సతీసావిత్రిలా నా భర్తని కాపాడమని ఆ రోజు నువ్వు నా చుట్టూ తిరిగిన రోజులు గుర్తులేవా? అంటూ ప్రశ్నించడంతో రాష్ట్ర ప్రజలు “ఔరా! వీళ్ళ మధ్య ఇంత మంచి అండర్ స్టాండింగ్ ఉందా?” అనుకొంటూ ఆశ్చర్యపోయారు మరోసారి.

 

“పాపం చిన్నపిల్ల షర్మిల ఏదో ముచ్చటపడి ఆయనకి చిన్న బిరుదు ఇస్తే దానికే ఇంతగా ఆవేశపడిపోవాలా?” అని రాజకీయ నేతలందరూ ముసిముసినవ్వులు నవ్వుకొంటుంటే, అత్త కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకే మండిందన్నట్లు, బొత్స మరింత ఆవేశపడిపోతూ “అసలు విజయమ్మ ఫీజుపోరు దీక్ష అంతా దొంగ దీక్ష, ఆమె కార్పోరేట్ కాలేజీలకి మద్దతుగా వారికి లాభాలు తెచ్చిపెట్టేందుకు ఇప్పుడు సిట్టింగ్ వేసారు,” అంటూ పాపం దీక్షలో ఉన్న విజయమ్మనుకూడా అదే నోటితో ఏకిపారేశారాయన.

 

దీని వల్ల పామర జనాలకి అర్ధమయింది ఏమిటంటే సీబీఐ, ఏసీబీ,సీఐడీ మొదలయిన గూడచారి సంస్థలన్నీకలిసిగట్టుగా శోధించినా కనిపెట్టలేని ఇటువంటి బ్రహ్మ రహస్యాలను కేవలం కాంగ్రెస్ వాళ్ళు తలచుకొంటేనే బయటపడతాయి, లేకుంటే అవి వాళ్ళు ధరిస్తున్న టోపీల క్రిందనే శాశ్వితంగా పడిఉంటాయని, అప్పుడు వారందరూ కూడా వారు ధరించి తిరుగుతున్నతెల్ల ఖద్దరు చొక్కాలంత స్వచ్చంగా కనిపిస్తారని జ్ఞానోదయం కలిగింది.

 

ప్రజలు కూడా “హాట్స్ ఆఫ్ టూ కాంగ్రెస్” అనుకొన్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం “వద్దులే! ఆ హ్యాట్స్ తీస్తే మీరు తట్టుకోలేరని నెత్తిమీద ఖద్దరు టోపీలను సర్దుకొన్నారు.