పవన్ మళ్ళీ సినిమా వేషాలు వేసుకునే రోజు దగ్గర్లోనే ఉంది: అంబటి

 

భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావం కోసం జనసేన నిర్వహించిన లాంగ్ మార్చ్ లో పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు అంబటి రాంబాబు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘మీ నైజం ఏంటి పవన్ కళ్యాణ్..అసలు మీరు ఏం పోరాటాలు చేశారు.. మేము పోరాటాలు చేయబట్టే తమపై కేసులున్నాయి..వాస్తవాలు ఏంటో గ్రహించాలి..సినిమాల్లో మళ్ళీ వేషాలు వేసుకొనే పరిస్థితి దగ్గరలోనే ఉంది’ అంటూ పవన్‌పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.

ఏ మాత్రం స్పష్టత లేని, కన్ ఫ్యూజన్ రాజకీయాలను పవన్ చేస్తున్నాడు. అది ప్రజలు అర్థం చేసుకుని వైసీపీకి పట్టం కట్టారని చెప్పారు. వాస్తవ..అవాస్తవాలను న్యాయస్థానాలు నిర్ణయిస్తాయని జగన్ గారి గురించి అలా మాట్లాడటం సబబు కాదని చెప్పారు. టీడీపీకి బీటీం..పవన్  టీడీపీకి దత్తపుత్రుడేనని మరోసారి స్పష్టం చేశారు. జగన్ అద్బుత పరిపాలన చేస్తే సినిమాలకు వెళ్లి..వేషాలు వేసుకుంటానని పవన్ నిన్న సభలో చెప్పిన విషయం గుర్తు చేస్తూ..అది దగ్గరలోనే ఉందన్నారు. అదే విధంగా బాబు కూడా హెరిటేజ్ కంపెనీ నడుపుకోవడం ఖాయమన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అంబటి వెల్లడించారు.

ఆదివారం విశాఖలో జనసేన లాంగ్ మార్చ్ నిర్వహించింది. ఆ సభలో ప్రసంగిస్తూ వైసీపీ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు జనసేనాని. జగన్ ప్రభుత్వం ఆరు నెలల్లోనే విఫలమైందని.. జగన్ అంటే మ్యాన్ ఆఫ్ ఫ్రై డే అని..ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తాడంటూ విమర్శించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.