వైసీపీకి సినీగ్లామర్ అద్దాలనుకుంటున్న జగన్..!

తెలుగు చిత్ర పరిశ్రమకు, రాజకీయాలకు ఉన్న సంబంధం గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు చాలా మంది సినీ తారలు రాజకీయ రణరంగంలో దూకారు. పలుకుబడి కోసమో, పదవుల కోసమో నటీనటులు ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. టాలీవుడ్‌కి రాజకీయాలకి అనుబంధం ఎప్పటి నుంచో ఉన్నా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన తర్వాత స్ట్రాంగ్ అయ్యింది. అప్పట్లో ఎన్టీఆర్‌కి చాలామంది సినీ ప్రముఖులు సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా టాలీవుడ్‌లో టీడీపీ డామినేషన్ ఎక్కువ. అన్నగారి కుటుంబం, కృష్ణగారి కుటుంబం, దగ్గుబాటి ఫ్యామిలీలు తెలుగుదేశం పక్షమే. ఇక మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించినా చంద్రబాబుకే మద్ధతు ప్రకటించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, మురళీ మోహన్, అశ్వనీదత్, కేఎల్ నారాయణ, ఆలీ, వేణుమాధవ్ ఇలా టాలీవుడ్‌లోని 70 % టీడీపీ పక్షమే.

 

ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి, దాసరి నారాయణరావు ఉన్నారు. అయితే వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సినీ ఆకర్షణ ఉన్న వారు ఎవరని ప్రశ్నిస్తే సమాధానం లేదు. అందుకే జగన్ తన పార్టీకి సినీ గ్లామర్ అద్దాలనుకుంటున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కృష్ణ కుటుంబంతో పాటు ధర్మవరపు సుబ్రమణ్యం, జీవిత, రాజశేఖర్, జయసుధ  కాంగ్రెస్‌ పార్టీలో పనిచేశారు. వైఎస్ మరణం తర్వాత జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడంతో వీరంతా వైఎస్ కుటుంబానికి దూరంగా జరుగుతూ వచ్చారు.

 

అయితే అప్పటి వరకు టీడీపీలో ఉన్న రోజా వైసీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు.  ఆమె సినీ గ్లామర్‌కి ఓట్లు కురిపించేంత సీన్ లేదు. ఇక రోజా దూకుడు పార్టీకి చాలా నష్టం కలిగించింది. దీంతో జగన్ టాలీవుడ్‌లో పేరున్న వారిని తన వైపునకు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. తనకు బంధువు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో పాటు ఆయన గురువుగారు దర్శకరత్న దాసరి నారాయణరావును ఫ్యాన్ కింద కూర్చోబెట్టాలని స్కెచ్ గీస్తున్నారు. ఆ మేరకు ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. దాసరి వైసీపీలోకి గనుక వస్తే ఆయన అనుచర గణం మొత్తం ఆయన వెంటే ఉంటుంది. మరి జగన్ ప్లాన్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చుద్దాం.