చిన్నమ్మకు జగన్ పై నమ్మకం లేదా... వివేకా హత్య వెనక మిస్టరీ అదేనా? 

2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఏపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. టీడీపీ, వైసీపీ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నాయి. వివేకా హత్య వెనుక టీడీపీ ఉందని.. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వైసీపీ డిమాండ్ చేసింది. మరోవైపు వివేకా హత్య ఇంటిదొంగల పనేనని, సొంత బాబాయ్ మరణాన్ని అడ్డుపెట్టుకొని వైసీపీ వారు రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ ఆరోపించింది. అలా ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుండగానే ఎన్నికలు ముగిశాయి. వైసీపీ అధికారంలోకి వచ్చింది. 

ఇంకేముంది జగన్ సీఎం అయ్యాడు.. తన బాబాయ్ హత్యకు కారణమైన వాళ్లెవరో తేల్చేసి, కటకటాల పలు చేస్తాడు అనుకున్నారంతా. కానీ నెలలు గడుస్తున్నా కేసులో పురోగతి లేదు. సిట్ పేరుతో పుణ్య కలం గడిచిపోతోంది. మరోవైపు ఎన్నికలకు ముందు ఇది రాజకీయ హత్య, సీబీఐతో దర్యాప్తు చేయాలి అన్న గొంతులు కూడా మూగబోయాయి. అయితే వివేకా సతీమణి సౌభాగ్యమ్మ మాత్రం ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని బలంగా కోరుతున్నారు. తన భర్త హత్య కేసులో అసలు దోషుల్ని వదిలేసి, అమాయకుల్ని ఇరికించే ప్రమాదముందని సౌభాగ్యమ్మ హైకోర్టుకు తెలిపారు. ఈ కేసు సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే పదే కోరినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య జరిగి నెలలు గడిచిపోతున్నా ఇప్పటి వరకూ హంతకులను గుర్తించలేదంటే సిట్‌ దర్యాప్తు ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చన్నారు. 

వివేకా హత్య కేసుని సీబీఐకి అప్పగించాలని సౌభాగ్యమ్మ కోరడం చర్చనీయాంశమైంది. ఎందుకంటే ప్రస్తుతం ఆమెకు కుమారుడు వరసైన జగన్ రాష్ట్ర సీఎంగా ఉన్నారు. గతంలో అంటే ప్రత్యర్థి పార్టీ నేత చంద్రబాబు సీఎంగా ఉన్నారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చేయించే దర్యాప్తు మీద నమ్మకంలేక కేసుని సీబీఐకి అప్పగించాలని కోరారు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు జగన్ సీఎం గా ఉన్నారు. అయినా ఆమె సీబీఐ విచారణకు పట్టుబట్టడం అంతుచిక్కని ప్రశ్న. ఆమెకు జగన్ ప్రభుత్వం చేయించే దర్యాప్తుపై నమ్మకం లేదా? ఇంకా దీని వెనుక వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ఉద్దేశపూర్వకంగానే జాప్యం జరుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ హత్య వెనుక అయినవాళ్ల హస్తం ఉందని, వారిని కాపాడటానికే జాప్యం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గ్రహించే సౌభాగ్యమ్మ.. సీబీఐ విచారణ కోరుతున్నారని అంటున్నారు. మరి వివేకా హత్య వెనకున్న మిస్టరీ ఎప్పుడు వీడుతుందో చూడాలి.