తెలంగాణను వదిలేసిన జగన్‌.. ఏపీలో దూకుడు

ఉమ్మడి రాష్ట్రంలో అటు కోస్తా, రాయలసీమతో పాటు ఇటు తెలంగాణలోనూ ఎంతోకొంత బలంగా ఉన్న వైసీపీ.... రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. తెలంగాణలో పార్టీ బాధ్యతలను చెల్లెలు షర్మిలకు అప్పగించినా... ఆమె కూడా పట్టించుకోవడం మానేశారు. ఏదో ఒక్కసారి మాత్రం ఓదార్పు యాత్ర అంటూ హడావిడి చేసిన షర్మిల.... ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడటమే మానేసింది. అంతేకాదు ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కూడా అధికార టీఆర్‌ఎస్‌లో చేరిపోవడంతో... పార్టీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. తెలంగాణ వైసీపీ అధ్యక్షుడిగా గట్టు శ్రీకాంత్‌రెడ్డి నామమాత్రానికి ఉన్నా... ఎలాంటి ఉపయోగం లేదు. దాంతో ఉన్న కొద్దిమంది నేతలు కూడా అధికార పార్టీలో చేరిపోయారు.

 

రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ ఉందంటూ నేతలు హడావిడి చేస్తున్నా.... అధినేత మాత్రం తెలంగాణ వైపు కన్నెత్తి చూడటం లేదు. తెలంగాణలో పార్టీని జగన్‌ అస్సలు పట్టించుకోవడం లేదు. కనీసం ఇప్పటివరకూ తెలంగాణలో ప్రజాసమస్యలపై జగన్‌ స్పందించింది కూడా లేదు. గత ఎన్నికల్లో పార్టీ ఘోరంగా విఫలమవడంతో... తెలంగాణలో ఇప్పట్లో పార్టీ బలపడే అవకాశమే లేదని జగన్‌ డిసైడైనట్లు తెలుస్తోంది. అందుకే తెలంగాణ నేతలు నిర్వహిస్తున్న ప్లీనరీకి కూడా జగన్‌ వెళ్లడం లేదు. కేవలం పార్టీ పొలిటికల్‌ సెక్రటరీని మాత్రమే తెలంగాణ వైసీపీ ప్లీనరీకి పంపిస్తున్న జగన్‌.... తాను మాత్రం విశాఖ ధర్నాలో పాల్గోనున్నారు.

 

ఆంధ్రప్రదేశ్‌లో అధికారమే టార్గెట్‌గా పెట్టుకున్న జగన్‌... తెలంగాణలో పార్టీని లైట్‌ తీస్కుంటున్నారని అంటున్నారు. అంతేకాదు తెలంగాణలో పార్టీకి సీన్‌ లేదని డిసైడైపోయారని... ఇక తెలంగాణలో పార్టీని దాదాపుగా వదిలేసినేనట్లని వైసీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు.