అంబటి రాంబాబుకి జగన్ వార్నింగ్.. టిక్కెట్ కష్టమేనా?

 

వైసీపీ అధినేత జగన్ చర్యలు ఎవరి ఊహలకు అందట్లేదు. ఓవైపు పాదయాత్రతో బిజీగా ఉన్న ఆయన.. మరోవైపు ఇన్‌ఛార్జిల్ని మార్చేపనిలో కూడా పడిపోయారు. గుంటూరులో చిలకలూరిపేటతో మొదలు పెట్టిన ఆయన.. పెదకూరపాడు,గుంటూరు-2,తాడికొండ వరకు అభ్యర్థులను మార్చుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు జగన్ కన్ను మరో రెండు నియోజకవర్గాల మీద పడింది. త్వరలో సత్తెనపల్లి, వినుకొండ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలుగా ఉన్న అంబటి రాంబాబు, బొల్లా బ్ర‌హ్మ‌నాయుడులను మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల జగన్‌ తన వద్దకు అంబటి, బ్రహ్మనాయుడులను పిలిపించుకుని వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. మీరిద్దరి పనితీరు అసలు బాగాలేదు. మీరు నియోజకవర్గంలో దూసుకుపోవడం లేదు. ఇలా ఉంటే ఎలా?.. మరో నెల రోజులు సమయం ఇస్తాను. ఈ లోపు కనుక మీలో మార్పు రాకపోతే మిమ్మలను తొలగించి వేరే వారికి నియోజకవర్గ బాధ్యతలు అప్ప చెబుతానని హెచ్చరించినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో గెలుపే ముఖ్యం. గెలిచేవారే నాకు కావాలి అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారట.

అంబటి.. నియోజకవర్గంలో మనకు ప్రజల నుంచి అపూర్వమైన ఆదరణ ఉంది. కానీ నీ వల్లే పార్టీకి మైనస్‌ అవుతోంది. ఇక నీ ఇష్టం.. నువ్వు ఎంత సన్నిహితుడివి అయినా పార్టీ నష్టపోతే చూస్తూ ఊరుకోను అని జగన్‌, అంబటిని హెచ్చరించారని సత్తెనపల్లి వైసీపీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. అదే విధంగా బ్రహ్మనాయుడును కూడా జగన్ హెచ్చరించినట్టు తెలుస్తోంది. డబ్బు ఖర్చు పెట్టకుండా మైలేజ్‌ రావాలంటే రాదని.. బ్రహ్మనాయుడుకి జగన్‌ చెప్పారని వినుకొండలో ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద త్వరలో అంబటి, బ్రహ్మనాయుడులను జగన్‌ పక్కనపెట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ నుంచి డబ్బులు బాగా పెట్టగలిగిన కొత్తవారు ఎవరైనా వస్తే వారికే జగన్‌ టిక్కెట్‌ ఇస్తారని కొందరు వైసీపీ నేతలు అభిప్రాయపడుతోన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్‌, మనోహర్‌నాయుడు వంటి నాయకులనే పక్కన పెట్టిన జగన్‌ కు బ్రహ్మనాయుడు ఎంత?.. త్వరలో ఆయనపై కూడా వేటు పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా గెలవలేని అభ్యర్థులను, డబ్బు ఖర్చు పెట్టని వారిని వదులుకోవా లని జగన్‌ నిర్ణయించుకున్నారని.. ఈ కోవలోనే అంబటి,బ్రహ్మనాయుడులపై వేటు వేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. చూద్దాం మరి ఏమి జరుగుతుందో.