చంద్రబాబు మోసం చేయడంలో పీహెచ్‌డీ చేశారు

 

ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయదుర్గంలో నిర్వహించిన రోడ్‌షోలో వైసీపీ అధినేత జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఉత్సాహం చూస్తుంటే మరో నెల రోజుల్లో అధికారం చేపట్టగలమనిపిస్తోందని అన్నారు. ఐదేళ్లుగా చంద్రబాబు మోసాలు చేస్తూనే ఉన్నారని జగన్‌ ఆరోపించారు. 'సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశాక డ్వాక్రా, రైతు, చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తామన్నారు. బెల్టు షాపులను రద్దు చేస్తామన్నారు. రెండు రూపాయలకే 20 లీటర్ల మంచినీళ్లు వంటి పథకాలపై మొదటి సంతకం చేశారు. ఇందులో ఏ ఒక్కటైనా అమలైందా?' అని జగన్ ప్రశ్నించారు. ప్రజల గురించి ఆలోచించే వారైతే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీలతో మోసం చేస్తారా? కమీషన్లకు కక్కుర్తిపడి పోలవరం ప్రాజెక్టును కేంద్రం పరిధి నుంచి తీసుకుంటారా? ప్రజల గురించి ఆలోచించే వారే అయితే నారాయణ పాఠశాలలకు అనుకూలంగా ఉండేలా 6 వేల ప్రభుత్వ పాఠశాలలను ఎందుకు మూసేశారు? 2014లో రైతు రుణాలు రూ.87,600 కోట్లు ఉంటే 2018 సెప్టెంబరు కల్లా రూ.లక్షా 37 వేల కోట్లకు ఎగబాకడం రైతులకు భరోసానివ్వడమా? అని నిలదీశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి పేజీ ఒక్కో కులానికి కేటాయించారు. చంద్రబాబు మోసం చేయడంలో పీహెచ్‌డీ చేశారు అని మండిపడ్డారు.  ప్రజల డేటాను చోరీ చేసి జన్మభూమి కమిటీలకు ఇచ్చారని ఆరోపించారు. తన పాదయాత్ర 3,648 కిలోమీటర్లు సాగిందని, పాదయాత్రలో రైతుల కష్టాలు, డ్వాక్రా మహిళలు ఆవేదన తెలుసుకున్నానని చెప్పారు. ప్రతి ఒక్కరికి భరోసా కల్పించేలా వైసీపీ మేనిఫెస్టో ఉంటుందన్నారు. మేం అధికారంలోకి వస్తే బెల్టు షాపుల బెండు తీస్తానని జగన్ హామీ ఇచ్చారు.