మూడు వేలు కాదు.. ఓటుకి ఐదు వేలు తీసుకోండి: వైఎస్ జగన్

 

సోమవారం అనంతపురంలో వైసీపీ నిర్వహించిన సమర శంఖారావం సభలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు మీద విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అవినీతి సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటుకు రూ. 3 వేలు ఇస్తామంటూ గ్రామాల్లోకి డబ్బు మూటలు తరలిస్తారని విమర్శించారు. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకోవాలని.. మూడు వేలు కాదు, ఐదు వేలు ఇవ్వమనాలని, ఓటు మాత్రం వైసీపీకి వేయాలని జగన్ పిలుపు ఇచ్చారు. 55 నెలలు పాటు కడుపు మాడ్చి చివరి 3 నెలలు అన్నం పెడతానంటున్న వారిని ఏమనాలని ప్రశ్నించారు. ప్రజారంజక పాలన అందించాలంటే రాక్షసులు, మోసగాళ్లతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. చంద్రబాబు కుయుక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు.

'తొమ్మిదేళ్లుగా నాతో పాటుగా మీరు కూడా ఎన్ని కష్టాలు అనుభవించారో తెలుసు. కొంతమందిపై అక్రమ కేసులు పెట్టారు. మరికొందరిని పథకాలను దూరం చేశారు. 1280 మందిపై అక్రమ కేసులు పెట్టారు. మీకు తగిలిన ప్రతీ గాయం నా గుండెకు తగిలింది. అందుకే అధికారంలోకి రాగానే వాటన్నింటినీ ఎత్తివేస్తాం. కుల, మత, పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం. ఎన్నికల షెడ్యూలు రాబోతుంది. వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించాల్సిన బాధ్యత మీపై ఉంది' అని వ్యాఖ్యానించారు. ఓటర్‌ లిస్టు నుంచి వైసీపీకి అనుకూలంగా ఉన్నవారిని ఓటర్‌ లిస్టు నుంచి తొలగిస్తున్నారని జగన్ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 59 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయన్నారు. దొంగ ఓట్ల విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని జగన్‌ సూచించారు.