నాయకులారా... ఇవేం మాటలు...!!!

తెలుగు ప్రజలు సిగ్గు పడుతున్నారు. తెలుగు ప్రజలు ఆవేదన చెందుతున్నారు. తెలుగు ప్రజలు ఆందోళన ప‌డుతున్నారు. తెలుగు ప్రజలు.. "వీరా... మా నాయకులు"  అని ముక్కున వేలేసుకుంటున్నారు. సమైక్య రాష్ట్ర సమయంలో వేడెక్కిన మాటలు అలా... అలా పెరిగి వ్యక్తిగత విమర్శలు, దూషణలు, తిట్ల వరకూ వెళ్లిపోతోంది. ఇది ఒక్క తెలంగాణాకో... లేదూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికో పరిమితం కాలేదు. రెండు రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి.  ఈ పార్టీ... ఆ పార్టీ అని లేదు. ఈ నాయకుడు... ఆ నాయకుడు అని లేదు.

 

 

అందరిది ఒకే దారి.. అందరిదీ ఒకే బాట... అందరిదీ ఒకే మాట. " చెయ్యేత్తి జైకొట్టు తెలుగోడా... గతమెంతో ఘన కీర్తి కలవోడా"  అని గతాన్ని తవ్వుకుని తలపోసుకోవాలే కాని... ఆ రోజులు...  ఆ పాటలు ఇక రావని ఓ నిర్దారణకు వచ్చేయాలి. దీనికి తెలుగు ప్రజలది ఏమాత్రం తప్పు కాదు. తప్పంతా వారిని ఏలుతున్న నాయకులదీ... ఏలాలకునుంటున్న నాయకులది. గతంలో వ్యక్తిగత విమర్శలకు ఏమాత్రం చోటు లేని  తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ నూతన తిట్ల పోకడలు రాజకీయాల పట్ల ఓ అసహ్యాన్ని కలిగిస్తున్నాయి. ఓ ఏవగింపు పుట్టిస్తున్నాయి. మనదీ ఒక బతుకేనా.... అని శ్రీశ్రీ అన్నట్లు మనదీ ఓ రాజకీయమేనా... ! అని తెలుగు ప్రజలు ఏవగించుకుంటున్నారు.

 

 

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి,  జనసేనాని పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యక్తిగత విమర్శలపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అలాగని తెలుగు ప్రజలందరూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ప్రేమ, సానుభూతి కురిపిస్తున్నారనుకోవడం కూడా పొరపాటే. ఈ ఇద్దరి వ్యక్తిగత దూషణలపై ఇప్పుడు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలే కాదు... ఎక్కడెక్కడి నెటిజన్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇలా వ్యక్తిగత దూషణలు, కుటుంబ వ్యవహారాలను రచ్చకీడ్చుకోవడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నిస్తున్నారు. " వ్యక్తుల ప్రయివేటు బతుకులు వారి వారి సొంతం... పబ్లిక్‌లో నిలబడితేనే ఏమైనా అంటాం" అన్న మహాకవి శ్రీశ్రీ మాటలకు  అర్ధం ఇది కాదు అని,  రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఏది పడితే అది మాట్లాడడానికి కాదని అంటున్నారు. దీనర్ధం మీరు మా దగ్గరకు వచ్చారు కాబట్టి మేం మిమ్మల్ని ఏమైనా అంటాం అని చెప్పడం. పవన్ కల్యాణ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారని జగన్... మీ సోదరి మాటేమిటని పవన్ కల్యాణ్ ప్రశ్నించడం వారిద్దరికి ఏం మేలు చేస్తుందో తెలియదు కాని.... ఆ నలుగురు మహిళలకు.... జగన్ సోదరికి... ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా  లోకాన్ని అవమానించడగానే పరిగణించాలి. బహుశా పురుషులు ఒకరిపై మరొకరు తమ కోపాన్ని వెళ్లగక్కుకోవడానికి మహిళలను తెర మీదకు  తీసుకు రావడం వారి దిగజారుడుతనంగానే చూడాలి.

 

 

రాజకీయాల్లో తిట్ల పురాణానికి తెర తీసింది తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ వాదులను రెచ్చగొట్టేందుకు, వారిలో ప్రత్యేక ఉద్యమాన్ని రగుల్‌కొల్పేందుకు ఇలా మాట్లాడుతున్నారని అంతా అనుకున్నారు. అయితే, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కె.చంద్రశేఖర రావు, ఆయన మంత్రివర్గ సహచరులు, తెరాస నాయకులు పరుష పదజాలాన్నే వాడుతున్నారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. తమ ప్రత్యర్ధులను ఎందుకూ పనికి రానివారని, వారి వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పేందుకు తెలుగు భాషలో ఉన్న అన్ని తిట్లను బహిరంగ వేదికలపై మాట్లాడడం రాజకీయ నాయకులకు సంస్కారం అనిపించదు. వారు తమను పరుష పదజాలంతో తిట్టారు కాబట్టి తామూ వారిని అలాగే తిడతామని మిగిలిన పార్టీలు ఆ పంథాలోనే పయనించడం వారి వివేకానికి వదిలేయాల్సిందే. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఈ తిట్ల... ఈ వ్యక్తిగత దూషణలకు ఎక్కడో ఒకచోట ఫుల్‌స్టాప్ పడాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్‌లో యువతరం రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు తక్కువగానే ఉంటాయి. అదే జరిగితే దేశంలో నైతిక రాజకీయాల స్థానంలో కార్పొరేట్ రాజకీయాలు రాజ్యమేలుతాయి. 

 

 

ఇది ఇప్పటికే వివిధ దశల్లో ప్రారంభమైంది. ఇది మరింత పెరగడానికి రాజకీయ నాయకుల మాటలు.. తిట్లు... బూతులు.. వ్యక్తిగత విమర్శలు మరింత ఊతమిస్తాయి. ఆ రోజులు రాకుండా ఉండాలంటే రాజకీయ నాయకులు తమ నోటిని అదుపు చేసుకోవాలి. రాజకీయాలు వేరు... వ్యక్తిగత జీవితాలు వేరు అని గుర్తెరగాలి. అందరూ వివిధ మార్గాల్లో ప్రజల కోసమే పని చేస్తున్నామనే ఎరుక ఉండాలి. ఇందుకోసం ఎవరో ఒకరు ముందుకు రావాలి. అంత వరకూ ఈ వ్యక్తిగత... దారుణ విమర్శలకు... రాజకీయ శత్రువులను అడ్డం పెట్టుకుని మహిళలపై చేస్తున్న విమర్శలకు చరమాంకం ఉండదు. దీనికి రాజకీయ నాయకులే కాదు... మహిళ నాయకురాళ్లూ తమ తమ రాజకీయ విశ్వాసాలను, నమ్మకాలను , సిద్ధాంతాలను పక్కన పెట్టి పురుష రాజకీయ నాయకుల వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సి ఉంది. ఆ రోజు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పురుష రాజకీయ నాయకులదే. వారే కాదు.... అన్ని రాజకీయ పార్టీలలోనూ ఉన్న మహిళా రాజకీయ నాయకులది కూడా.