అమరావతి ఉద్యమంలో మరో విషాదం... రైతు కూలీ ఆత్మహత్య

రాజధాని అమరావతి కోసం రైతుల చేస్తోన్న ఉద్యమం రోజురోజుకి మరింత ఉదృతమవుతోంది. రైతులు, మహిళలలు, యువత పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. లాఠీ దెబ్బలకు, అరెస్టులకు భయపడకుండా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని గొంతెత్తి నినదిస్తున్నారు. అయితే ఈ రాజధాని ఉద్యమం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. రాజధాని కోసం ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు వేదనతో గుండె ఆగి మరణిస్తుంటే.. కొందరు రాజధాని తరలిపోతోందన్న మనస్తాపంతో ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు. తాజాగా వేమూరి గోపి(20) అనే ఓ రైతుకూలీ తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

రాజధానిలో ప్రాంతంలో గోపి ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజులుగా గోపి అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్నాడని సమాచారం. ఒకవైపు ఉపాధి లేక మరోవైపు రాజధాని తరలింపుతో తీవ్ర మనస్థాపం చెంది బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంసభ్యులు చెబుతున్నారు. చేతికి అందివచ్చిన కొడుకు చనిపోవడంతో మృతుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే, పోరాడి సాధించుకోవాలి కానీ ఇలా ప్రాణాలు తీసుకొని కుటుంబాల్లో విషాదం నింపొద్దని పెద్దలు కోరుతున్నారు.