దగ్గుబాటి అసలు వ్యూహం ఏంటి?

 

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కోసం ఇన్ చార్జ్ చైర్మన్ గా పరుచూరు నియోజకవర్గానికి చెందిన రావి రామనాధం బాబును నియమించేందుకు రంగం సిద్ధమైంది. ఆ విషయమే జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. అదే సమయంలో డీసీఎంఎస్ చైర్మన్ పదవికి నాగులుప్పలపాడు మండలానికి చెందిన పిచ్చిరెడ్డి పేరు కూడా దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. సీనియర్ నాయకుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు కుటుంబ రాజకీయ వ్యవహారాలపై ఇటీవల అధికార పార్టీ దృష్టి సారించి సరికొత్త నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అదే నియోజకవర్గానికి చెందిన రావి రామనాధం బాబుకు జిల్లా స్థాయి నామినేటెడ్ పదవిని కట్టబెట్టాలన్న నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.

పార్టీ నియోజక వర్గ ఇంచార్జ్ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. డాక్టర్ దగ్గుబాటి నుంచి స్పష్టత రాకపోవడం కూడా అందుకు ఓ కారణంగా భావిస్తున్నారు. పురందేశ్వరిని బిజెపికి రాజీనామా చేయించి వైసీపీలో చేరుతారని విషయంలో అధికార పార్టీ ముఖ్య నాయకులలో అనుమానాలున్నాయి. ప్రస్తుతం ఆయన జగన్ ను కలిసిన తర్వాత కూడా నియోజకవర్గానికి రాకపోవటాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు ఆలోచనతో దగ్గుబాటి ఉన్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతానికి వైసీపీ నియోజక వర్గ ఇంచార్జ్ పదవి కోసం పలువురు పోటీ పడుతున్నారు. అందులో రామనాధం బాబు పేరు ముందు ఉన్నప్పటికీ ఆయనకు సెంట్రల్ బ్యాంక్ పదవి దక్కుతున్నందని వైసీపీ నాయకత్వం మున్ముందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.అయినప్పటికీ ఆయన వైపు నుంచి సమాచారం కోసం మరి కొద్ది రోజులు వేచి చూడాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.