జగన్ పై అసంతృప్తి... టీడీపీలోకి మహిళా ఎమ్మెల్యే...

 

వైసీపీ పార్టీకి వరుస దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే వైసీపీలోకి ఎంతో మంది నేతలు అధికార పార్టీ అయిన టీడీపీలోకి జంప్ అవ్వగా... తాజాగా నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒకరి తరువాత ఒకరు నెమ్మదిగా టీడీపీ బాట పట్టారు. ఇప్పుడు తాజాగా మరో ఎమ్మెల్యే టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రంప చోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి టీడీపీ తీర్థం పుచ్చుకునే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తుఇప్పటికే ఈమె పలుమార్లు టీడీపీతో చర్చలు కూడా జరిపారంట. తన రాజకీయా గురువు జ్యోతుల నెహ్రూ సలహా సూచనల ప్రకారమే పార్టీ మారేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. జ్యోతుల నెహ్రు ప్రొద్భలంతోనే ఆమెకు గతంలో వైకాపా అధ్యక్షుడు జగన్ టిక్కెట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆయన సూచనల ప్రకారమే టీడీపీ పార్టీలో చేరడానికి సన్నాహాలు చేస్తున్నట్టు రాజకీయ వర్గాల టాక్.

 

అంతేకాదు ఇక రాజేశ్వ‌రి విష‌యంలో జగన్ కూడా ఆంటీ ముట్టనట్లు ఉండడంతో పాటు, నియోజక వర్గ సమస్యల గురించి అసెంబ్లీ లో ప్రస్తావించే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆమె ఆవేద‌న‌తో ఉన్నారు. జ‌గ‌న్ త‌మ‌లాంటి వాళ్ల‌ను అస్స‌లు ప‌ట్టించుకోర‌ని… ఆర్ధికంగా ఉన్నతంగా ఉన్న వారికే గుర్తింపు ఉందని ఆమె అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఉంటే తాను వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమేనని భావిస్తోంది. ఫలితంగా టీడీపీ జెండా పట్టేందుకు రాజేశ్వరి సిద్దమైనట్లు ప్రచారం సాగుతోంది. కాగా ఇప్ప‌టికే వైసీపీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారు. ఇక ఇప్పుడు రాజేశ్వ‌రి వికెట్ 22వ‌ది అవుతుంది.