అఫ్జల్ గురూ కోసం పరితపిస్తున్న మన మేధావులు

 

మన దురదృష్టం ఏమిటంటే, మరొకరికి అవకాశం దక్కకుండా జాగ్రత్త పడుతున్నట్లు మన దేశం మీద మనమే దాడి చేసుకొంటాము. భారత పార్లమెంటు మీద దాడి చేయడమే కాకుండా 9 మందిని పొట్టన బెట్టుకొన్న తీవ్రవాది అఫ్జల్ గురూను మొన్న ఉరి తీసినప్పుడు వరవరరావు మొదలుకొని, కాశ్మీరు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వరకు ‘అతనిని ఉరి తీయడం చాల అమానుషం’ అంటూ చాల మందే నిరసనలు తెలియజేసారు. అటువంటప్పుడు జమ్మూ కాశ్మీర్ ను, మన దేశం నుండి విడగొట్టి పాకిస్తాన్ లో కలిపేయాలని కోరుకొంటున్న జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అధ్యక్షుడు యాసిన్ మాలిక్ మాత్రం ఎందుకు ఊరుకొంటాడు?

 

అతనివంటి వారికి మన దేశం కన్నా, మన దేశాన్నితరచూ అవమానించే పాకిస్తాన్ అంటేనే ప్రేమ అధికం. మొన్న ఆ దేశం వెళ్ళిన మాలిక్ ఈసారి తన అసలు రూపం ఏమిటో లోకానికి, ముఖ్యంగా భారతదేశానికి చూపాడు. ముంబై దాడులకు తెగబడిన లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌తో ఒకే వేదికపై కలిసి కూర్చొని అఫ్జల్ గురూ ఉరికి నిరసనగా పాకిస్తాన్ లో ఒక రోజు దీక్ష చేసాడు.

 

అసలు అఫ్జల్ గురూ వంటి తీవ్ర వాదికి మద్దతుగా నిరసన చేయడమే ఒక తప్పయితే, మన దేశం మీద దాడికి తెగబడి అనేక మంది అమాయకులను పొట్టన బెట్టుకొన్న మరో పాకిస్తాన్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌తో కలిసి, పాకిస్తాన్ లో దీక్ష చేయడం రెండవ తప్పు.

 

బహుశః మన దేశంలో ఉన్న స్వేచ్చస్వాతంత్రాల వల్లనే, ఒక దేశద్రోహిని ఉరితీసినప్పుడు కూడా తమను తాము మేధావులుగా భావించేవారు అనేక మంది రాష్ట్రపతి, ప్రభుత్వం, సుప్రీంకోర్టు చేసిన నిర్ణయాన్ని ప్రశ్నించగలుగుతున్నారు. తద్వారా వారికి మన వ్యవస్థపట్ల ఎంత గౌరవం ఉందో స్పష్టంగా అర్ధం అవుతోంది. అఫ్జల్ గురూ వంటి తీవ్ర వాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన అమాయక పౌరుల కన్నా, తీవ్రవాదుల ప్రాణాలే మిన్నఅని భావించడం ఏ వాదం అవుతుంది? అమాయకుల ప్రాణాలు పొట్టన బెట్టుకొనే ఒక కరడుకట్టిన తీవ్రవాదిని, ఉద్యమకారుడిగా వర్ణించడం ఏవిధంగా సమర్ధనీయం?

 

రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఏ చిన్న సమస్యను పరిష్కరించడానికి ముందుకు రాని ఇటువంటి కుహనా మేధావులు, అనవసరమయిన సమయంలో, అనవసరమయిన విషయాలలో తల దూర్చి మేమున్నామంటూ మీడియా కెక్కుతుంటారు. గానీ, డిల్లీ గ్యాంగ్ రేప్, నల్గొండను దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న ఫ్లోరోసిస్ సమస్య, రాష్ట్ర విభజనవంటి పలు కీలక అంశాలపై ఏనాడు నోరువిప్పని ఇటువంటి పనికి రాని, కుహాన మేధావులు మన దేశంలో కోకోల్లలున్నారు.

 

వారి ఈ అతివల్లనే మాలిక్ వంటి వేర్పాటువాదులు దైర్యంగా ఉగ్రవాదులతో కలిసి తిరుగుతూ మన దేశం, ప్రభుత్వం పరువు పాకిస్తాన్ లో తీస్తున్నారు. ప్రభుత్వం కేవలం అతని పాస్ పోర్ట్ స్వాదీనం చేసుకొనంత మాత్రాన్న ఒరిగేదేమీ ఉండదు. అతనికి కూడా కటినంగా శిక్షించి అటువంటి ఆలోచనలు చేసే వారికి గట్టి హెచ్చరిక చేయాలి.