పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఏపీ బీజేపీ ఛీఫ్ ఎంపిక!.. రేసులో ఉన్నదెవరు?

తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయకత్వాలను మార్చేందుకు రంగం సిద్ధమవుతోంది. వచ్చేవారం దీనిపై కాషాయ పెద్దలు ఓ క్లారిటీ ఇచ్చే అవకాశముంది. తెలంగాణలో ఎంపీలు బండి సంజయ్ లేదా అరవింద్ కు అవకాశం దక్కవచ్చన్న ప్రచారం సాగుతుండగా.. ఏపీలో మాత్రం ఈ జాబితా అరడజనుకు పైగానే కనిపిస్తోంది. వీరిలో ప్రస్తుత సీనియర్ నేతలు పురంధేశ్వరి, విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీలు పీపీఎన్ మాథవ్, సోము వీర్రాజు.. బీజేవైఎం నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రధానంగా రేసులో ఉన్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు ముగ్గురు ఉన్నా వారికి అవకాశం దక్కడం కష్టమే. అయితే ఏపీ బీజేపీ ఛీఫ్ గా ఎన్నికయ్యే వారికి పవన్ కళ్యాణ్ ఆశీస్సులు తప్పనిసరన్న వాదన వినిపిస్తోంది.

ఏపీలో బీజేపీ కొత్త ఛీఫ్ ఎంపిక అధిష్టానానికి ఈసారి గట్టి సవాలే విసురుతోంది. గతంలో సార్వత్రిక ఎన్నికల ముందు కాపు కోణంలో కన్నా లక్ష్మీనారాయణను అధ్యక్షుడిగా ఎంపిక చేసిన కాషాయ నేతలు.. అది కాస్తా వర్కవుట్ కాకపోవడంతో ప్రత్యామ్నాయాల ఎంపికలో బిజీగా ఉన్నారు. అప్పట్లో కన్నాను ఎంపిక చేయడంలో కులం కోణం సహా పలు కారణాలు ఉన్నాయి. వైసీపీ రెడ్ల పార్టీగానూ, టీడీపీ కమ్మ ప్లస్ బీసీ పార్టీగానూ పేరు తెచ్చుకున్న తరుణంలో కాపులను ఓన్ చేసుకునే లక్ష్యంతో కన్నాకు పగ్గాలు అప్పగించారు. కానీ సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా బరిలోకి దిగిన కన్నా లక్ష్మీనారాయణ భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. పార్టీని విజయం దిశగా నడిపించడంలోనూ విఫలమయ్యారు. బీజేపీ దాదాపు పోటీ చేసిన స్ధానాలన్నింటిలోనూ డిపాజిట్లు కోల్పోవడమే అందుకు నిదర్శనం. అప్పటి నుంచి కన్నా సమర్ధతపై సందేహాలు మొదలయ్యాయి. అయితే అప్పటి పరిస్ధితులు వేరు. బీజేపీ ఏపీకి ద్రోహం చేసిందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో అప్పటి అధికార టీడీపీ సక్సెస్ అయింది. దీంతో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే స్ధానం కూడా దక్కకపోగా.. చాలా చోట్ల డిపాజిట్లు కూడా కోల్పోవాల్సిన పరిస్ధితి. కానీ ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కన్నా గట్టిగా పోరాటం చేస్తున్నారు. అయినా బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్, కన్నా ఒకే సామాజికవర్గం వారే కావడంతో మిగతా సామాజికవర్గాలను ఆకర్షించడంలో బీజేపీ విఫలమవుతోంది.

సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయే స్ధితికి చేరుకున్న బీజేపీకి ఆ తర్వాత కూడా ఊరట లభించలేదు. పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సోమువీర్రాజు, పీవీఎన్ మాధవ్, వాకాటి నారాయణ రెడ్డి వంటి నేతలు ప్రజల్లోకి ఎక్కువగా వెళ్లలేకపోవడం ఆ పార్టీకి చేటు చేస్తోంది. దీంతో ఇప్పటికీ బీజేపీ నేతలు పవన్ ఛరిష్మాపైనే ఆధారపడాల్సిన పరిస్ధితి నెలకొంది. దీంతో రాష్ట్ర నాయకత్వాన్ని మార్చడంతో పాటు కార్యవర్గంలోనూ భారీ మార్పులు చేసేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా మంచి వ్యూహకర్తగా పేరున్న మాధవ్ కు పగ్గాలు అందిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని బీజేపీ పెద్దలు తీవ్రంగా పరిశీలిస్తున్నారు. అటు వైసీపీని ఎదుర్కొనే వ్యూహాన్ని సీరియస్‌ గా తీసుకుంటే మాత్రం బీజేవైఎం నేత విష్ణువర్ధన్ రెడ్డికీ అవకాశం ఉండొచ్చని చెబుతున్నారు. వీరిద్దరు కాకుండా మిగతా వారి పేర్లను పరిగణనలోకి తీసుకోవడం కష్టమే అనిపిస్తోంది. అటు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ముగ్గురు ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వీరిని అధిష్టానం పెద్దలు పూర్తిగా నమ్మకపోవడమే ఇందుకు కారణం. ఇలాంటి పరిస్ధితుల్లో పవన్ తో సమన్వయం చేసుకుంటూ మందుకెళ్లే వారికే అవకాశాలు మెరుగ్గా ఉండొచ్చని తెలుస్తోంది. అదే జరిగితే జనసేనానితో గొప్ప సంబంధాలు లేకపోయినా మృదుస్వభావిగా పేరున్న ఎమ్మెల్సీ మాధవ్ ఈ రేసులో ముందుంటారనేది పార్టీ వర్గాల సమాచారం.