కొండను త్రవ్వి ఎలుకని పట్టిన సీఐడీ

 

నాలుగు నెలల క్రితం పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు ఘోర అగ్ని ప్రమాదంలో 45 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. అప్పటి నుండి భాదితులు ప్రభుత్వానికి విన్నపాలు, న్యాయం కోసం ధర్నాలు చేస్తున్నా అటు ప్రభుత్వం కానీ, ఇటు బస్సు యాజమాన్యం గానీ మానవతా దృక్పదంతో స్పందించకుండా తీవ్ర నిర్లక్ష్యం వహించాయి. కనీసం భాదితుల మోర ఆలకించేందుకు కూడా వారికి ఓపిక, శ్రద్ధ లేకుండాపోయాయి. ప్రమాదానికి కారణమయిన దివాకర్ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సులతో బాటు పలు ప్రైవేట్ బస్సులను రవాణాశాఖ అధికారులు నిలిపివేసి కేసులు నమోదు చేసారు. దాని వలన భాదిత కుటుంబాలకి ఒరిగిందేమీ లేకపోయినా, ప్రైవేట్ బస్సులపై ఆధారపడి జీవిస్తున్న వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దూర ప్రయాణాలు చేసే ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఇక బస్సు ప్రమాదం తరువాత మేల్కొన్న ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశిస్తే అది కాస్త కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లు బస్సు యాజమాన్యం, డ్రైవర్ నిర్లక్ష్యం, ప్రమాదానికి కారణమయిన కల్వర్టుని నిర్మిస్తున్న కాంట్రాక్టరు, వివిధ ప్రభుత్వ శాఖల బాధ్యతా రాహిత్యం వలననే ఈ ప్రమాదం జరిగిందని, అదీగాక వోల్వో బస్సు డిజైన్‌లోనే అనేక లోపాలున్నాయని తన నివేదికలో పేర్కొన్నారు.

 

ప్రమాదం జరిగిన మొదటి మూడు రోజులలలోనే ఈ లోపాలన్నిటినీ మీడియా ఎత్తి చూపింది. కానీ ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా ప్రైవేట్ బస్సులపై దాడులకు, సిఐడీ విచారణకు ఆదేశించి చేతులు దులుపుకొంది తప్ప మీడియా ఎత్తిచూపిన లోపాలను సవరించే విధంగా బస్సు యాజమాన్యాలపై ఎటువంటి ఒత్తిడి తేలేదు. అందువల్ల నేటికీ రాష్ట్రంలో అవే వోల్వో బస్సులు తిరుగుతూనే ఉన్నాయి. ఈ దుర్ఘటనపై ఇంతవరకు దర్యాప్తు జరిపిన సీఐడీ చీఫ్ కృష్ణ ప్రసాద్ ఆ వోల్వో బస్సు డిజైన్‌లోనే అనేక లోపాలున్నాయని నిర్దారించడమే గాక వాటిని నిషేదించాలని సిఫారసు చేసారు.

 

అత్యున్నత నాణ్యతా ప్రమాణాల కారణంగా ప్రపంచంలో అత్యాధారణ పొందుతున్న వోల్వో బస్సు డిజైన్‌లోనే అనేక లోపాలున్నాయని ఒక సిఐడీ అధికారి చెప్పడం విడ్డూరంగా ఉంది. ఒకవేళ ఆయన చెప్పిన ప్రకారం వోల్వో బస్సులోనే లోపాలున్నాయని అనుకొంటే, ఇక నిత్యం ప్రజలు తిరిగే సాధారణ ఆర్టీసీ బస్సుల సంగతేమిటి? అని ఆలోచిస్తే ఇంతకాలంగా ప్రభుత్వము, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు ఎంత నిర్లక్ష్యంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుకొంటున్నాయో అర్ధమవుతుంది.అదేదో సామెత చెప్పినట్లు మన వ్యవస్థలలో ఇన్ని లోపాలు, అధికారులలో, బస్సు యాజమాన్యంలో ఇంత నిర్లక్ష్యం, ఎవరికీ జవాబుదారీతనం లేకపోవడం, మానవతా దృక్పదం లోపించడం వంటి సవాలక్ష తప్పులను ఉంచుకొని బస్సులో సాంకేతిక లోపాలున్నాయని వాటిని నిషేదించాలనుకోవడం ఇంట్లో ఎలుకలు చేరాయని ఇల్లు తగులబెట్టుకొన్నట్లు ఉంటుంది.