జైలు నుండి విడుదలైన శశికళ... ఆమెకు షాకిచ్చిన పళని సర్కార్ 

అక్రమాస్తుల కేసులో బెంగుళూరు పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ ఈరోజు (బుధవారం) ఉదయం విడుదల అయ్యారు. కర్నాటక జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న శశికళకు విడుదలకు సంబంధించిన అధికారిక పత్రాలను సమర్పించారు. అనారోగ్యం కారణంగా శశికళ ప్రస్తుతం బెంగళూరు విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మరోపక్క ఆమెకు చికిత్స చేస్తున్న సమయంలోనే ఆమె కరోనా బారిన పడినట్టుగా వైద్యులు తేల్చారు. శశికళ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు ప్రకటించారు. అయితే మరో 10 రోజుల పాటు శశికళకు విశ్రాంతి అవవసరమని వైద్యులు సూచించారు. దీంతో మరికొద్ది రోజులపాటు ఆ నగరంలోనే ఆమె బస చేయనున్నారు. ఫిబ్రవరి మొదటివారంలో ఆమె చెన్నై నగరానికి రానున్నట్టు విశ్వసనీయ సమాచారం. తమిళనాడు అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న సమయంలో శశికళ జైలు నుండి విడుదల కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. ఇది ఇలా ఉండగా శశికళ జైలు నుండి విడుదలైన రోజునే జయలలిత స్మారక భవనాన్ని తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రారంభించారు. దివంగత తమిళనాడు సీఎం జయలలిత నివాసం ఉన్న పోయేస్ గార్డెన్ ను జయలలిత స్మారక భవనంగా ప్రభుత్వం మార్చింది.