మోడీ పరువు అడ్డంగా తీసేస్తున్నారుగా..!


అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి... అన్నట్టు ఉంది  కేంద్ర మంత్రి విజయ్‌ సంపాలా పరిస్థితి ఇప్పుడు. పాపం ప్రధాని మోడీ గురించి గొప్పగా చెప్పలనుకున్నారు.. కానీ అది కాస్త బెడిగికొట్టింది. దీంతో పొగడ్తలు సంగతి పక్కపెడితే విమర్శలు మాత్రం కురిపిస్తున్నారు. ఇంతకీ విజయ్ సంపాలా చేసిన పని ఏంటనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. మన ప్రియతమ ప్రధానమంత్రి తల్లి హీరాబెన్ మోదీ ఇప్పటికీ ఆటోలోనే ప్రయాణిస్తున్నారంటూ విజయ్‌ సంపాలా తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ ఫొటో పోస్ట్ చేశారు. పోనీ అక్కడితో ఆగారా అంటే అదీ లేదు...రాహుల్‌ గాంధీ తల్లి సోనియా గాంధీపై  విమర్శలు చేశారు. ఆమె ప్రపంచంలోనే ధనిక నేతల్లో నాలుగో స్థానంలో ఉన్నారని కామెంట్ చేశారు. ఇంకేముంది బీజేపీ నేతలు మోడీని ప్రశంసించే పనిలో పడ్డారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. సదరు మంత్రిగారు పెట్టిన ఈ ఫొటో మార్ఫింగ్ చేసిన ఫొటో అని గుర్తుపట్టేశారు నెటిజన్లు.  మోడీ తల్లి ఆటో ఫోటోలో.. ఆమె భుజాన్ని మరో చేయి పట్టుకున్నట్లుగా ఉండటంతో అది మార్ఫింగ్ ఫోటోగా తేలిపోయింది.

 

అంతే ఇంక నెటిజనల్లు ఆయనపై కామెంట్లు స్టార్ట్ చేశారు. మార్ఫింగ్ ఫోటోలు పెట్టి దొంగ ప్రచారం చేసుకుంటారా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మరోవైపు, ఆ ఫోటో నిజమైతే.. మోదీ కనీసం తల్లిని కూడా పట్టించుకోవట్లేదా? అని కొందరు విమర్శిస్తున్నారు. అంతేకాదు గత ఎన్నికల సమయంలోనూ చిన్నతనంలో మోడీ టీ అమ్మారంటూ.. పేదవాడిని అంటూ.. టీ అమ్మే వ్యక్తి ప్రధాని కాకుడదా అంటూ సెంటిమెంట్ తో ప్రచారం చేసి అధికారాన్ని చేపట్టారు. ఇక ఇప్పుడు కూడా ఇలాంటి ప్రచారాలే మొదలుపెట్టారు. కానీ కాంగ్రెస్ నేతల్ని టార్గెట్ చేసే క్రమంలో అత్యుత్సాహంతో తమ నాయకుడు కమ్ ప్రధానిని ఆకాశానికి ఎత్తేసే క్రమంలో పప్పులో కాలేస్తూ చిక్కులు తెచ్చుకుంటున్నారు. మోడీ ఇమేజ్ కు భారీగా దెబ్బ పడేలా చేస్తున్నారు. మరి నేతలు బీజేపీ నేతలు అత్యుత్సాహం కాస్త తగ్గించుకుంటే బెటర్ లేకపోతే మొదటికే మోసం వస్తుంది...