ప్రేమికుల రోజుని విడాకుల రోజుగా ప్రచారం చేస్తున్న జీహెచ్‌ఎంసీ

 

టైటిల్ చూసి ఆశ్చర్య పోకండి. జీహెచ్‌ఎంసీ ఈ ప్రేమికుల రోజుకి షాకింగ్ నిర్ణయాలు ఏం తీసుకోకపోయినా, ప్రేమికులకు మాత్రం కాస్త ఇబ్బంది కలిగించే పని పెడుతుంది. సాధారణంగా, వాలెంటైన్స్ డే అంటే ప్రేమికులంతా పార్కులు, సినిమాలు అంటూ ఈ రోజు గడిపేస్తారు. అలా పార్కులకి వచ్చే జంటలకు, జీహెచ్‌ఎంసీ క్లాస్ లు ఇవ్వనుంది. అదేదో, మీరు చేసేది తప్పు అని చెప్పడానికి కాదు లెండి, మంచి ఉద్దేశ్యం తోనే వాళ్ళు ఈ పని చేస్తున్నారు.

 

ఇక అసలు విషయానికి వస్తే, ప్రేమికుల రోజుని వ్యర్ధాలకి విడాకుల రోజుగా జరిపేందుకు జీహెచ్‌ఎంసీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా పార్కులకొచ్చే ప్రేమికులకు అవగాహన కల్పించే కార్యక్రమం పెట్టుకున్నారు.

 

అయితే, ఇంత హంగామా ఎందుకంటారా! స్వచ్ఛ సర్వేక్షణ్‌-2018 సర్వే లో మంచి ర్యాంక్ పొందడానికి. 2017 లో జరిగిన సర్వే లో 500ల నగరాలతో పోటీపడి హైదరాబాద్‌ 19వ ర్యాంకు దక్కించుకుంది. అయితే, ఈ సారి పోటీలో 4,041 నగరాలు పాల్గొంటున్నాయి.

 

నిపుణుల బృందం హైదరాబాద్‌లో రేపటి నుండి మొదలుకొని 22వరకు పర్యటించి స్వచ్ఛతకు మార్కులు వేస్తుంది. ఇందులో భాగంగా నగర పౌరులని స్వచ్ఛత విషయంలో స్పందన కోరుతారు. ఒకవేళ, ప్రజలు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తే మంచి మార్కులు పడతాయి, లేదంటే మైనస్ మార్కులు పడే అవకాశం ఉంది. అందుకని నగర ప్రజల్లో అవగాహనా పెంచేందుకు నడుం బిగించారు జీహెచ్‌ఎంసీ పెద్దలు. అందుకు, ప్రేమికుల దినోత్సవాన్ని ఎన్నుకున్నారు.

 

అంతే కాకుండా, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటి నుండి జరిగే ప్రతి శుభకార్యాల అనంతరం వ్యర్థాలను తడి, పొడిగా వేరు చేయాలనీ... వేరుచేసిన తడి చెత్తతో ఎరువు తయారు చేయాలని రూల్ పెట్టారు.

 

జీహెచ్‌ఎంసీ చేస్తున్న ఈ మంచి కార్యక్రమానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నారు. అయినా, నగరం స్వచ్చ్చంగా ఉండడం మించి మనకు కావాల్సింది ఏముంది. హైదరాబాద్ కి మంచి ర్యాంక్ వస్తే మనకూ గర్వకారణమే కదా.