మీరు తాగే నీళ్లలో యురేనియం

 

మన దేశంలో సమస్యలకి కొదమేమీ లేదు... నిరుద్యోగం, పేదరికం, నిరక్షరాస్యత, రోగాలు, మతకల్లోలాలు అంటూ మన సమస్యల జాబితా చాలా సుదీర్ఘంగా జీవితాల్లోకి చొచ్చుకుపోయి ఉంటుంది. అందుకేనేమో పర్యావరణం, జీవవైవిధ్యం, భూగర్భజలాలు, అడవుల నరికివేత... లాంటి అంశాల మీద ఎవరూ పెద్దగా దృష్టి సారించరు. అందుకే వాటికి సంబంధించిన చట్టాలు అంత కఠినంగా ఉండవు, ఉన్నా వాటినెవ్వరూ పెద్దగా పట్టించుకోరు. నిజానికి ఇవే మన భవిష్యత్తుని తేల్చే అసలైన సమస్యలు. వాటిని అశ్రద్ధ చేయడం అంటే కూర్చున్న కొమ్మని నిదానంగా నరుక్కుంటూ పోవడమే!

ఇంతకీ ఈ ఉపోద్ఘాతం అంతా ఇప్పుడెందుకూ అంటే... పర్యావరణానికి సంబంధించిన మరో సమస్య ఇప్పుడు పీకల మీదకు వచ్చింది కాబట్టి! ఈ మధ్యనే విడుదల అయిన ఓ నివేదిక ప్రకారం దేశంలో ఏకంగా 16 రాష్ట్రాలలోని భూగర్భ జలాలలో యురేనియం నిల్వలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఒకటి కావడం గమనార్హం.

నివేదిక కోసం రాజస్థాన్‌ నుంచి సేకరించిన నమూనాలలో, ఏకంగా మూడో వంతు నీటిలో యురేనియం ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా 26 జిల్లాల నీటిలో యురేనియం శాతం చాలా ఎక్కువగా ఉన్నట్లు బయటపడింది. దరిద్రం ఏమిటంటే మన దేశంలో అసలు తాగే నీటిలో యురేనియం ఎంత శాతం ఉండాలో చెప్పే నిబంధనలు కూడా లేవు. ఇందుకోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలనే తీసుకోవాల్సి వస్తోంది.

మన దేశ భూగర్బంలో యురేనియం శాతం కాస్త ఎక్కువగానే ఉంటుంది. దానికి ఎవరూ ఏమీ చేయలేరు. కానీ అది ప్రమాకరమైన రీతిలో నీటిలో కలవడం మాత్రం మనషి వల్లే జరుగుతోంది. భూగర్భజలాలను ఎడాపెడా తోడేయడం వల్ల, భూగర్బంలోని రాళ్లు ఎండి వాటిలో ఉండే యురేనియం బయటకి వస్తోందట. ఇది క్రమంగా భూగర్భజలాలను కలుషితం చేస్తోంది. రసాయన ఎరువుల నుంచి వచ్చే పదార్థాల వల్ల కూడా ఈ యురేనియం కాలుష్యం పెరిగిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

 

అణ్వాయుధాలని తయారుచేయడంలో యురేనియం చాలా అవసరం అన్న విషయాన్ని తరచూ వింటూ ఉంటాం. దాని వల్ల యురేనియం ఓ ప్రమాదకరమైన ఖనిజం అని అర్థం చేసుకోగలం. ఈ యురేనియం కలిసిన నీటిని తాగటం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. కిడ్నీలు పాడైపోవడం వాటిలో ఒకటి మాత్రమే! యురేనియం కలిసి నీటితో స్నానం చేసినా కూడా కేన్సర్‌లాంటి సమస్యలూ వస్తాయి.

రోజురోజుకీ మన దగ్గర భూగర్భజలాలు తగ్గిపోతున్నాయి. దాంతో రాబోయే రోజుల్లో యురేనియం సమస్య మరింత తీవ్రం కానుందని ఎవ్వరూ చెప్పనక్కర్లేదు. కానీ దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఎంతవరకు సన్నద్ధంగా ఉన్నాయంటే చెప్పడం కష్టమే! తమ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో దొరికే నీటిలో ఏఏ ఖనిజాలు ఉన్నాయో మానిటర్‌ చేయాల్సిన ప్రభుత్వాలు చూసీచూడనట్లే రాజకీయాలలో మునిగిపోతుంటాయి. ఒకవేళ మనమే మనం తాగుతున్న నీటిలో యురేనియం నిల్వల గురించి తెలుసుకోవాలనుకున్నా కష్టమే. కాబట్టి ఓసారి నివేదికలను సరిచూసుకుని, వాటిలో మన ప్రాంతం ప్రస్తావన ఉంటే జాగ్రత్త వహించాలి. ఏ నీరు పడితే ఆ నీరు తాగకుండా రక్షిత మంచినీటి మీదే ఆధారపడాలి. ఆ సౌకర్యం లేని పేదల సంగతేమిటంటారా!!!