బరి తెగించిన యుపీయే ప్రభుత్వం

 

కేంద్రంలో కాంగ్రెస్ పరిస్థితి దినదినగండం నూరేళ్ళ ఆయుషులా ఉంది. పాముల పుట్టలోంచి పాములు బయటకి వస్తున్నట్లు రోజుకొక కుంభకోణం బయటపడుతోంది. ఇది చాలదన్నట్లు బయటపడుతున్నఆ కుంభకోణాల ప్రభావం తమ పార్టీపై, ప్రభుత్వంపై పడకుండా ఉండేందుకు, దాని తీవ్రత తగ్గించే ప్రయత్నంలో సీబీఐ రిపోర్టులను తారుమారు చేసేందుకు కూడా ప్రయత్నించిన విషయాన్నినిన్నసీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా స్వయంగా సుప్రీంకోర్టులో బయటపెట్టారు. అటువంటిదేమి జరుగలేదని ఇంతవరకు భుకాయిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రంజిత్ సిన్హా కోర్టుకి వ్రాతపూర్వకంగా సమర్పించిన ఎఫిడవిట్ తో ఇబ్బందుల్లో పడింది. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ నిజాయితీగా తప్పు ఒప్పుకోవడం కానీ, తప్పు చేసిన మంత్రులను, అధికారులను తొలగించడం గానీ చేయలేదు. ఈ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, వాటికిదొక జబ్బుగా మారిపోయిందని కాంగ్రెస్ అనడం చూస్తే, అది ఎంత బరి తెగించిందో అర్ధం అవుతుంది.

 

దేశాన్నినడిపిస్తున్న ప్రభుత్వం యావత్ ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్నపార్లమెంటుకు జవాబు చెప్పనవసరం లేదనే భావన వ్యక్తం చేస్తోంది. అవినీతిని అరికట్టవలసిన సీబీఐని జేబు సంస్థగా మార్చేసుకొని, చివరికి అది తయారు చేసిన రిపోర్టులను కూడా చక్కబెట్టే స్థాయికి కాంగ్రెస్ ఎదిగిపోయింది. ఇక, ప్రభుత్వం సీబీఐ రెండూ కూడా అడ్డుదారులు తొక్కుతున్నపుడు, వాటిని ఇక నియత్రించ గల ఏకైక వ్యవస్థ న్యాయవ్యవస్థే. అయితే దానిని కూడా ప్రభుత్వం ప్రవితం చేసే ప్రయత్నంలో ఉన్నట్లు ఇటీవల ప్రధానమంత్రి చేసిన వ్యాక్యాలు స్పష్టం చేస్తున్నాయి.

 

ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ న్యాయవ్యవస్థ తన పరిధికి లోబడి పనిచేయాలని, అది మరో రాజ్యాంగ వ్యవస్థ పరిధిలోకి చొరబడే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు. గతంలో శేషన్ వంటి శక్తివంతుడయిన ప్రధాన ఎన్నికల కమీషనర్ ఎన్నికల సమయంలో అక్రమాలకు కళ్ళెం వేసినప్పుడు ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడింది. దానితో ఏకసభ్య కమీషన్ గా ఉన్న ఎన్నికల కమీషన్ను త్రిసభ్య కమీషన్ గా మార్చిఅందులో తనకనుకూలమయిన అధికారులను నియమించుకొని, ప్రధాన ఎన్నికల కమీషనర్ అధికారాలకు కత్తెర వేసింది.

 

ప్రస్తుతం సుప్రీంకోర్టుచేత రోజు మొట్టికాయలు వేయించుకోవడం అలవాటుగా మారిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు దీనికి కూడా విరుగుడుగా ఉపాయాలు ఆలోచిస్తోంది. ప్రధానమంత్రి న్యాయవ్యవస్థను హెచ్చరించడమే అందుకు తొలి సంకేతంగా భావించవచ్చును. ప్రభుత్వానికి కాగ్ నివేదికలంటే కొందరు పనిలేనివాళ్ళు సృష్టించిన చెత్త కాగితాలతో సమానం. కాగ్  సీబీఐ నివేదికలను ఖాతరు చేయని ప్రభుత్వం, పార్లమెంటుకు కూడా తానూ  జవాబుదారీ కాదని భావిస్తోంది.

 

ఇప్పుడు అది సుప్రీం కోర్టు కూడా తన అవినీతి వ్యవహారాలలో కలుగజేసుకోవద్దని కోరుకొంటున్నట్లు, ప్రధాని వ్యాక్యాలతో స్పష్టం అయింది. అయినప్పటికీ సుప్రీంకోర్టు తన హెచ్చరికలను ఖాతరు చేయకపోతే, అప్పుడు ఎన్నికల కమీషనర్ అధికార్లను కత్తెరించినట్లే న్యాయవ్యవస్థ అధికారాలను కూడా కత్తిరించే ప్రయత్నం తప్పక చేస్తుంది. కాంగ్రెస్ కనుక ఈ ప్రయత్నంలో సఫలం అయితే ఇక మన దేశ వ్యవస్థలన్నీ కూడా ఒక దాని తరువాత మరొకటి పేక మేడల్లా కుప్పకూలడం తధ్యం.