కేంద్రమంత్రి జయంతీ నటరాజన్ రాజీనామా

 

ఇటీవల నాలుగు రాష్ట్రాలలో ఘోర పరాజయం పొందిన తరువాత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ త్వరలో పార్టీని సమూలంగా ప్రక్షాళన చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన అనగానే జనాలు ఏవేవో ఊహించేసుకొంటారు. కానీ ప్రక్షాళన అంటే అటువారిని ఇటు, ఇటువారిని అటు మార్చడమే తప్ప పార్టీలో అసమర్ధులను ఏరి పారేయడమో లేక అవినీతిపరులను పార్టీనుండి బయటకు పంపడమో కానే కాదు. అందువల్ల యువరాజవారు మొదలుపెట్టిన ప్రక్షాళన కార్యక్రమం కూడ అలాగే మొదలయింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖా మంత్రి జయంతి నటరాజన్ పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు తన పదవికి రాజీనామా చేసారు. దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర కూడ పడిపోయింది. కేంద్రమంత్రి వీరప్ప మొయిలీకి ఆ శాఖల అదనపు భాద్యతలను అప్పగించారు. పార్టీలో సీనియర్ నేత అయిన ఆమెకు పార్టీలో కీలక భాద్యతలు అప్పగించేందుకే, ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. గులాం నబీ ఆజాద్ తో సహా మరో పదిమంది కేంద్రమంత్రులు కూడా రాజీనామాలు చేసి, పార్టీని ఎన్నికలకు సిద్దం చేసే పనిలోపడతారని సమాచారం.  బహుశః మన రాష్ట్రంలో అసంతృప్త నేతలెవరికో కేంద్ర మంత్రి పదవులు ఎరగా వేసి దారికి తెచ్చుకొంటారేమో మన యువరాజవారు.