టీఆర్ఎస్ కు ఓటెయ్యకపోతే మిమ్మల్ని కుక్కలు కూడా పట్టించుకోవు

 

ఎన్నికల సమయంలో నాయకులు.. మీకు అది చేస్తాం, ఇది చేస్తామని బ్రతిమాలో, బుజ్జగించో ప్రజలను ఓట్లు అడగడం చూస్తుంటాం. అయితే తెలంగాణలో కొందరు టీఆర్ఎస్ నేతలు మాత్రం.. మీరు వేరే పార్టీకి ఓటేస్తే తప్పు చేసినట్టే, మీరు మాకు ఓటెయ్యకపోతే మీ కర్మ అన్నట్టు మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఏప్రిల్ 11 న లోక్ సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మొత్తం 17 స్థానాలకు గాను.. మిత్రపక్షం ఎంఐఎం కు ఒక సీటు పోగా, మిగతా 16 సీట్లు తమ ఖాతాలో వేసుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అయితే కాంగ్రెస్ కొన్ని స్థానాల్లో సీనియర్లు, బలమైన నేతలను బరిలోకి దింపి టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తానంటుంది. ముఖ్యంగా ఖమ్మం సీటు విషయంలో టీఆర్ఎస్ కు ఇబ్బంది తప్పేలా లేదు. టీఆర్ఎస్ 16 సీట్ల టార్గెట్ కు ఖమ్మం గండికొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని జిల్లాల్లో సత్తాచాటిన టీఆర్ఎస్ కు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఘోర పరాజయం ఎదురైంది. మొత్తం 10 సీట్లకు గాను ఒక్క సీటుకే పరిమితమైంది. దీంతో ఈ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ సీటు తమ ఖాతాలో వేసుకొని సత్తా చాటాలనుకుంటుంది టీఆర్ఎస్. సిట్టింగ్ ఎంపీని సైతం కాదని, టీడీపీ నుంచి వచ్చిన మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకి టికెట్ ఇచ్చారు. నామాని గెలిపించుకోవాలని టీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలోనే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఫ్రస్ట్రేషన్ ని బయటపెడుతున్నారు.

నామా తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖమ్మం జిల్లా ప్రజలు తప్పు చేశారని, ఈసారి ఎన్నికల్లో అయినా తప్పు దిద్దుకోవాలని.. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం ప్రజలు ఇచ్చిన తీర్పుని తప్పుపట్టారు. ఇక మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఒకడుగు ముందుకేసి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుంటే మిమ్మల్ని కుక్కలు కూడా పట్టించుకోవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేలకొండపల్లి లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న తుమ్మల.. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలేరు లో మీరు వేసిన ఓట్లు మురిగి మురుగు కాలవలో కొట్టుకుపోయాయని, నన్ను ఓడించటం వల్ల మీకు వచ్చిన లాభం ఏంటి అని ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు ఎన్నికల బరిలో ఉన్నాడని నాకు జరిగినట్టే నామాకు జరిగితే.. మిమ్మల్ని కుక్కలు కూడా పట్టించుకోవని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆశలు, కోరికలు నెరవేర్చే ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించాలని, ఇప్పటి వరకూ జరిగిన పొరపాట్లను మరచి అందరూ నామాను గెలిపించాలని అన్నారు. టీఆర్ఎస్ నేతలు మాట్లాడిన తీరు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ప్రజాతీర్పుని గౌరవించకుండా.. మీరు తప్పు చేసారని ప్రజలపై మండిపడడం, ఈసారి అలా జరిగితే మిమల్ని కుక్కలు కూడా పట్టించుకోవని బెదిరించడం ఏంటంటూ.. టీఆర్ఎస్ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.