ట్రంప్ గారి వ్యాక్సిన్ వచ్చేది అప్పుడేనట..

ప్రపంచం మొత్తం కరోనా తో సతమతమౌతూ వ్యాక్సిన్ ఎపుడు వస్తుందా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా దీని పై స్పందించారు. కరోనా కు రోజులు దగ్గర పడుతున్నాయని, నవంబర్ 3 నాటికి ఈ వైరస్ ను అంతం చేసే వ్యాక్సిన్ అమెరికా చేతిలో ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. గురువారం నాడు ఓ రేడియో కార్యక్రమం ద్వారా మాట్లాడిన ఆయన, అమెరికా తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ సమాచారాన్ని చైనా దొంగిలించిందా అనే విషయం పై స్పందిస్తూ తాను ఆ విషయాన్ని చెప్పలేనని ఐతే అది చైనాకు సాధ్యమయ్యే పనేనని నమ్ముతున్నానని అయన వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ తయారీలో అమెరికా సంస్థలు ముందంజలో ఉన్నాయని ఆయన అన్నారు.

 

ఐతే అమెరికాలో ప్రెసిడెంట్ ఎన్నికలు కూడా నవంబర్ 3నే జరగనున్న నేపథ్యంలో నవంబర్ తొలివారంలోనే వ్యాక్సిన్ యూఎస్ వద్ద ఉంటుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికలను ఉద్దేశించి చేసారని అయన ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తోంది. ఇది ఇలా ఉండగా ఇప్పటి వరకు అమెరికాలో కరోనా కేసుల సంఖ్య దాదాపు 50 లక్షలకు చేరుకోగా, 1.61 లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు.