జిహెచ్ఎంసీ ఎన్నికలు... కారు జోరుతో గెలుపు తథ్యం అంటున్నగులాబీ తమ్ముళ్లు

మునిసిపల్ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించింది  టీఆర్ఎస్ పార్టీ. ఇక జీహెచ్ఎంసీ పై ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది. అదే సమయంలో గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ల పై కూడా దృష్టి పెట్టనుంది. ఈ మూడు కార్పొరేషన్ల పాలకవర్గాల పదవీ కాలం పూర్తి కావటానికి కొంచెం అటు ఇటుగా మరో ఏడాది సమయమే ఉండటంతో ప్రభుత్వ పరంగా రంగంలోకి దిగనుంది. రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఆయా కార్పొరేషన్ ల పరిధిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రాధాన్యమివ్వనుంది. పాలకవర్గాల పదవీ కాలం పూర్తి కాకపోవడంతో జీహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ లకు ఎన్నికలు జరగలేదు. అదే కారణంతో అచ్చంపేట, బాదేపల్లి, నకిరేకల్, సిద్దిపేట మునిసిపాలిటీలు కోర్టు కేసులు ఇతరత్రా కారణాలతో జహీరాబాద్, సారపాక, మందమర్రి, మణుగూరు, ఆసిఫాబాద్, పాల్వంచ మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించలేదు.  జీహెచ్ఎంసి , ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు 2016 జనవరిలో జరిగాయి. అదే ఏడాది మార్చిలో గ్రేటర్ వరంగల్ ఎన్నికలు జరిగాయి. వీటి పాలకవర్గాల పదవీ కాలం 2021 జనవరి మార్చిలో ముగియనుంది. వీటితో పాటు ఎన్నికల జరగకుండా మిగిలిన మునిసిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. 

అయితే నిర్ణీత గడువు కంటే ముందే జీహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలా చేస్తే రానున్న మూడున్నర నాలుగేళ్లలో సహకార ఎన్నికలు మినహా మరేమీ ఉండబోవని.. అభివృద్ధి పై పూర్తిస్థాయిలో దృష్టి సారించవచ్చు అనేది ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్త జనాభాలో మూడింట ఒక వంతు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉంది. గ్రేటర్ వరంగల్ , ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ను కలుపుకుంటే ఓటర్ల సంఖ్య దాదాపు కోటి ఉంటుంది. ఈ ఎన్నికలను అధికార పార్టీ అత్యంత కీలకంగా భావిస్తూ ఉండటానికి ఇది కూడా ఒక కారణం. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఫలితాలు తారుమారైతే ఆ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా వచ్చే అసెంబ్లీ, లోకసభ ఎన్నికలపై పడే అవకాశాలు ఉన్నట్లుగా పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే ఇప్పటి నుంచే జీహెచ్ఎంసీ పై దృష్టి కేంద్రీకరిస్తున్నట్టు చెబుతున్నాయి. అటు మునిసిపల్ ఎన్నికల ఫలితాలు రావడంతో నామినేటెడ్ పదవుల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముంది. మంచిరోజులు లేవనే ఉద్దేశంతో ఆయన ఇన్ని రోజులు నామినేటెడ్ పదవుల భర్తీ జోలికి వెళ్లలేదని చర్చ ఉంది.

మునిసిపల్ చైర్ పర్సన్, కార్పొరేషన్ ల మేయర్ ఎన్నికలు నేటితో పూర్తి కానుండటంతో నామినేటెడ్ పదవుల భర్తీనే తదుపరి అని ఆశావహులు భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ లు ప్రస్తుతం టిఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. 2016 లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 డివిజన్లలో గెలిచి ఎవరి ప్రమేయం లేకుండా మేయర్ పదవి తొలిసారి దక్కించుకున్న చరిత్రను టీఆర్ఎస్ నిలబెట్టుకోవాల్సి ఉండటంతో  ముందే అప్రమత్తమైంది. మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే స్వయంగా రంగం లోకి దిగారు కేసీఆర్. హైదరాబాద్ పరిధిలో బస్తీ దవాఖానాలను 118 నుంచి 350 కి పెంచాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ తో పాటు మిగిలిన నగరాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని అడవుల అభివృద్ధి చేపట్టాలని నిర్దేశించారు.