కాంగ్రెస్‌ పార్టీలో కేసీఆర్‌ కోవర్టులు

 

కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన జాబితాలపై ఆ పార్టీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం సంచలన వ్యాఖ్యలు చేశారు.పార్టీలోని ఇద్దరు, ముగ్గురు సీనియర్‌ నేతలు కేసీఆర్‌కు అమ్ముడుపోయారని ఆరోపించారు.కేసీఆర్‌ ఆదేశానుసారం కాంగ్రెస్‌ తరఫున డమ్మీ అభ్యర్థులకు టిక్కెట్లు దక్కేలా వారు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.టీఆర్ఎస్‌ ముఖ్య నేతలతో సమావేశమైన కాంగ్రెస్ నేతలు డమ్మీ అభ్యర్థులను ఎక్కడ పెట్టాలనే విషయంపై ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా కొందరు కోవర్టులు పనిచేస్తున్నారని విమర్శలు గుప్పించారు. తమ వ్యాపార లావాదేవీల కోసం పార్టీలోని కొందరు ముఖ్యనేతలు కేసీఆర్, కేటీఆర్‌కు కోవర్టులుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్, కేటీఆర్‌ లకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీలో ఎవరైనా పోరాటం చేస్తే ఆ సీనియర్‌ నేతలు సహించట్లేదని తెలిపారు.పార్టీలోని కేసీఆర్‌ కోవర్టులను తొలగిస్తేనే తెలంగాణలో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందన్నారు.ఉద్యమకారులకు టిక్కెట్లు ఇవ్వకుండా డమ్మీలకు టికెట్లు ఇప్పిస్తున్నారని, విద్యార్థి నాయకులు, ఉద్యమకారులం సమావేశమై కాంగ్రెస్ టిక్కెట్ల కేటాయింపులో జరిగిన అవకతవకలను బయటపెడతామని హెచ్చరించారు. తాను మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని,వాస్తవాలను పార్టీ అధినేత రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తామని గజ్జెల కాంతం తెలిపారు.