మైనారిటీలను లాగేసుకున్న మోడీ..?

బీజేపీ అంటే హిందూమతం..హిందూమతం అంటే బీజేపీ అన్నంతగా ఆ పార్టీ జనాల్లో ముద్ర వేసుకుందంటే అతిశయోక్తి కాదు. పార్టీ స్థాపన నుంచి నేటి వరకు ఆ పార్టీ ని ఇంతవరకు నెట్టుకొచ్చింది మతం కార్డే. మతతత్వంతో కొన్ని పరిస్థితుల్లో అధికారం లభిస్తే లభించవచ్చు గానీ అది ధీర్ఘకాలం కొనసాగదని బీజేపీ అధినాయకత్వం గుర్తించినట్లుంది. ఈ బాటలో ఇప్పటి వరకు సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలను రాజకీయ సాధనాలుగా ఉపయోగించుకుని ఢిల్లీ పీఠాన్ని బీజేపీ అధిరోహించిందన్నది జగమెరిగిన సత్యం. ఇంతటి సువిశాల దేశంలో హిందువులే అత్యధిక సంఖ్యాకులైనా..మూడున్నర దశాబ్దాల కాలంలో బీజేపీ ఒకటి రెండు సార్లే రాజ్యాధికారాన్ని ఎందుకు దక్కించుకుంది. వాజ్‌పేయ్ ఏర్పాటు చేసిన మొదటి మైనారిటీ ప్రభుత్వాన్ని లోక్‌సభలో ఏ ఒక్క పార్టీ గానీ, ఒక్క ఇండిపెండెంట్ గాని బలపరచక ఆ ప్రభుత్వం రెండు వారాలు తిరక్కుండానే ఎందుకు పతనమైంది. ఇలాంటి జవాబులేని ప్రశ్నలకు సమాధానాన్ని వెతికే పనిలో పడింది మోడీ-అమిత్‌షా ద్వయం.

 

ఎల్లప్పుడూ మతం కార్డునే ఉపయోగిస్తే ఫలితం ఉండదని..అందుకు భిన్నమైన పరిస్థితులను సృష్టించుకోవాలని ఈ జంట గుర్తించింది. తొలి నుంచి ముస్లిం సమాజంలో భారతీయ జనతా పార్టీ అంటే కాస్తంత ఏవగింపు..దానికి తోడు బాబ్రీ మసీదు విధ్వంసం భారతీయ ముసల్మాను‌లో కమలం పట్ల కఠిన వైఖరికి కారణమైంది. ఇకపోతే 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీఫ్, అసహనం అంటూ జరిగిన దాడులు, ఒత్తిడుల్లో ఎక్కువశాతం ముస్లిం వర్గాలపైనే అని ఓ అంచనా. అది హిందుత్వ వాదులు చేశారా..? లేక గిట్టని వారు చేశారా..? అన్న సంగతి పక్కనబెడితే గాయం మాత్రం బీజేపీకే అయ్యింది.

 

ఇక ఆ సంగతి పక్కనబెడితే ట్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టు వెలువరించిన సంచలనాత్మక తీర్పుతో ముస్లిం మహిళలల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 14 వందల సంవత్సరాలుగా ముస్లిం మహిళల జీవితాలకు శాపంగా మారిన ట్రిపుల్ తలాక్ విధానాన్ని పోయేలా చేసిన బీజేపీని వారు అభినందిస్తున్నారు. సెక్యులర్ జపం చేస్తూ..ఎన్నికల్లో హామీలు గుప్పించే మిగతా పార్టీలన్నింటికన్నా భిన్నంగా ఆలోచించిన మోడీ..ముస్లిం మహిళలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లయ్యింది.

 

ఈ పరిణామాల నేపథ్యంలో..ఈ సంవత్సరం చివరిలో, 2018లో జరగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మైనారిటీ ఓట్లు తమకే పడతాయని బీజేపీ నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతిపక్షాలను ఆత్మరక్షణలో పడేసి మైనారిటీలకు తామే అండగా ఉంటామన్న భరోసాని కలిగించేందుకు తగిన తంత్రాన్ని మోడీ, షాలు రూపొందిస్తున్నారు. ఏది ఏమైనా ట్రిపుల్ తలాక్‌ విషయంలో మోడీ ముస్లిం మహిళల మనసు గెలుచుకున్నారన్నది మాత్రం నిజం.