కూర్చునే ఉండకండి బాబూ

 

హాయిగా కుర్చీలో కూర్చుని పనిచేసే ఉద్యోగం వస్తే ఎంత బాగుండు అన్నది ప్రతి మనిషి కల. కదలకుండా కూర్చుని సంపాదించడం ఎంత అదృష్టమో అనేది ప్రతి జీవి కోరిక. కానీ డబ్బు సంగతి పక్కన పెడితే, నిరంతరం కూర్చునీ కూర్చునీ ఉండే జీవనశైలితో... మన కుర్చీ కాస్తా మృత్యువుకి నేరుగా దారి చూపిస్తోందన్నది నిపుణుల మాట. ఇంతకీ నిరంతరం కూర్చునే ఉండటం వల్ల కలిగే అనర్థం ఏమిటో, దానిని నివారించుకునే మార్గాలు ఏమిటో మీరే చూడండి.
ఇవీ అనారోగ్యాలు-

 

- నిరంతరం కూర్చుని ఉండటం మనలోని రక్తప్రసార వేగాన్ని తగ్గిస్తుంది. కొవ్వు కూడా నిదానంగా కరుగుతుంది. దీని వల్ల అంతిమంగా గుండె పనితీరు దెబ్బతింటుంది.

 

- అదేపనిగా కూర్చోవడం, మన శరీరంలోని ఇన్సులిన్‌ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుందని తేలింది. దీని వల్ల క్రమంగా చక్కెర వ్యాధి చాలా తేలికగా మనల్ని లొంగదీసుకుంటుంది.

 

- నిల్చొని ఉన్నప్పటికంటే కూర్చుని ఉన్నప్పుడే మన వెన్నెముక మీద అధికభారం పడుతుంది. పైగా కంప్యూటర్‌ స్క్రీన్‌ వంక చూస్తూ కూర్చోవడం వల్ల మెడ, భుజాల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా వెన్ను, మెడ నొప్పులతో పాటుగా మన నడకతీరులో కూడా మార్పు వచ్చేస్తుంది.

 

- శారీరిక కదలికలు ఉన్నప్పుడే మెదడుకి రక్తప్రసారం, ఆక్సిజన్‌ సరఫరా సమృద్ధిగా ఉంటుందనీ... అలా లేని సందర్భాలలో మెదడు నిదానంగా మొద్దుబారిపోతుందనీ తేలింది.

 

- కుర్చీని అదేపనిగా అంటిపెట్టుకుని ఉంటే సరైన వ్యాయామం లభించక నడుము భాగం నుంచి ఎముకలు, కండరాలు అన్నీ బలహీనపడిపోతాయి. నడుము నొప్పి, వెరికోస్‌ వెయిన్స్ వంటి నానా సమస్యలూ తలెత్తుతాయి.

 

- కూర్చుని ఉండటం వల్ల ముందు మన పొట్ట మీదే ఒత్తిడి పడుతుంది. దీంతో మన జీర్ణాశయం దెబ్బతింటుంది. ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, పొట్ట ఉబ్బరంగా మారిపోవడం, మలబద్ధకం వంటి నానారకాల జీర్ణసమస్యలకీ ఇది దారితీస్తుంది.
ఇవీ ఉపాయాలు

 

ఓపిక ఉండాలే కానీ అదేపనిగా కూర్చుని ఉండటం వల్ల వచ్చే సమస్యల జాబితా ఎంత రాసినా తీరేది కాదు. అయితే దీని దుష్ఫలితాల నుంచి తప్పుకునేందుకు కొన్ని చిట్కాలూ లేకపోలేదు...

 

- నడిచే అవకాశం ఉన్నప్పుడు కాస్త కాళ్లని కదిలించమంటున్నారు. లిఫ్ట్‌ బదులు మెట్లని ఉపయోగించడం, స్వయంగా వెళ్లి ఫైల్స్‌ తెచ్చుకోవడం వంటి చిన్నచిన్న చర్యలతో బోలెడు ఫలితం ఉంటుంది.

 

- ఫోన్‌ మాట్లాడటం, క్యాంటీన్‌లో భోజనం చేయడం, స్నేహితులతో కాలక్షేపం సాగించడం వంటి పనులు నిలబడి కూడా చేయవచ్చు. దీని వలన కాళ్లకి కాస్త పని చెప్పినట్లవుతుంది.

 

- కుర్చీలో కూర్చుని ఉన్నప్పుడు మన వెన్ను కుర్చీకి సమాంతరంగా నిటారుగా ఉందా లేదా గమనించుకోవాలి. వెన్ను నిటారుగా ఉన్నప్పుడు ఊపిరితిత్తుల లోపల వరకూ శ్వాస చేరుకోవడాన్ని గమనించవచ్చు. దీంతో అటు ఊపిరితిత్తులు, ఇటు వెన్ను కూడా బలపడతాయి.

 

- గంటకి ఓసారన్నా లేచి ఓ నాలుగడులు వేయడం మంచిది. అలా ఓ నాలుగడులు వేసేంత సమయమే లేకపోతే కాసేపు నిలబడే పనిచేసుకునే ప్రయత్నం చేయవచ్చు.

 

- నిరంతరం కూర్చుని ఉండేవారు తిరిగి ఆరోగ్యాన్ని సమకూర్చుకునేందుకు నడకను మించిన వ్యాయామం లేదంటున్నారు. రోజులో ఏదో ఒక సమయంలో కాసేపు నడకని సాగించమంటున్నారు.

 

- నిర్జర.