మాతృ(మృత)భాషా దినోత్సవమా?

ఆగస్ట్ 29... ఈ డేట్ స్పెషాలిటీ ఏంటి? 
అది కూడా తెలియదా, కింగ్ నాగార్జున బర్త్ డే! 


ఇలా వుంది తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితి! నాగార్జున జన్మదినం గుర్తుపెట్టుకోవటం తప్పు కాదు. కాని, ఇదే రోజు జన్మించిన వ్యావహారిక భాషోద్యమకారుడు గిడుగు రామమూర్తి మాత్రం చాలా మందికి తెలియదు. ఇక ఆయన జయంతే మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నా సంగతైతే మరింత తక్కువ మందికి తెలుసు!. ఆగస్ట్ 29ని ప్రతీ యేటా మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాం. ప్రభుత్వాలు చేపట్టే అధికారిక కార్యక్రమాలేంటో మనకు తెలియదుగాని వ్యక్తిగతంగా మాత్రం మనం చేసే పనులంటూ ఏం వుండవు. మహా అయితే కొందరు ఫేస్బుక్ పోస్టులు పెట్టి చేతులు దులిపేసుకుంటున్నారు. మిగతా వారైతే అది కూడా చేయరు. ఇదీ మన తెలుగు ప్రేమ!


తెలుగు గురించి ఇలా ఏదైనా మాట్లాడినప్పుడు, తెలుగు భాష నిరాదరణకి గురవుతోంది అన్నప్పుడు... కొంత మంది వింత వాదన చేస్తుంటారు. అసలు తెలుగు భాషని బతికించుకుని సాదించేదేమిటి అంటారు దుర్మార్గంగా! ఇంగ్లీష్ చదువులు చదివి, ఇంగ్లీష్ సినిమాలు చూస్తూ మనది కాని సంస్కృతి పట్ల వ్యామోహం చెందితే అలాగే వుంటుంది. పులిని చూసిన నక్క వాతలు పెట్టుకోవటం అంటారు. అలా ఇంగ్లీషు మనం ఎంతగా బతకటానికి నేర్చుకున్నా... అదే వుంది కదా అని... మనం బతకనేర్చిన తనం తెలుగు పట్ల ప్రదర్శించకూడదు.

తెలుగు ఒక్కటి కాపాడుకుంటే మనం అందులో అంతర్భాగమైన అనేక సాంస్కృతమైన అంశాల్నీ రక్షించుకున్న వారం అవుతాం. కూచి పూడి నుంచి ఆవకాయ పచ్చడి దాకా ఏదైనా తెలుగు భాష నేర్చుకున్న వాడికి మరింత గొప్పగా రుచిస్తుంది. తెలుగు నేర్చుకుంటే, తెలుగు పద్యం ఆస్వాదించటం నేర్చుకుంటే ప్రపంచంలోని అత్యుత్తమమైన సాహిత్యానికి వారసులం అవుతాం. అలా కాక కొద్దిపాటి నెలసరి ఆదాయం తెచ్చి పెట్టే విదేశీ భాషల్నే నెత్తిన పెట్టుకుని మాతృభాషని విస్మరిస్తే ఎంతో కోల్పోతాం.


తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా తెలుగును కాపాడుకోవటానికి కొన్ని నిర్ణయాలు చేసుకుంటే చాలు. బలవంతంగా ఇంగ్లీషు పదాలకి తెలుగులో పేర్లు పెట్టి పలకటం అవసరం లేదు. అంత భాషా వీరాభిమానం అక్కర్లేదు. కాని, చిన్న పిల్లలకి మమ్మీ, డాడీ బదులు అమ్మ, నాన్నా అనటం అలవాటు చేయటం మొదలుపెడితే మేలు! ఇంగ్లీష్ రైమ్స్ తో పాటూ తెలుగు పద్యాలు కంఠస్తం చేయిస్తుంటే చాలు! పెద్దలు కూడా వీలున్నప్పుడల్లా , వీలున్నంత మేర తెలుగులో మాట్లాడుకుంటే , అదే పది వేలు. ఎందుకంటే, ఇద్దరు తమిళులు తమిళంలో, ఇద్దరు మరాఠీలు మరాఠీ భాషలో మాట్లాడుకుంటూ వుంటే... తెలుగు వారు మాత్రం ఇంగ్లీషులో మాట్లాడుకునే దుస్థితి వుంది!


ఈ మధ్యే తెలుగుకు ప్రాచీన భాష హోదా కూడా దక్కిన సందర్భంగా మనం మాతృభాషా దినోత్సవం నాడు ఈ ఒక్క సత్యం అర్థం చేసుకుంటే చాలు.... '' తెలుగును కాపాడుకోవటం అంటే ఉపన్యాసాలు, వ్యాసాలు కాదు! ఇంగ్లీషు మోజు తగ్గించుకుని తెలుగు మాట్లాడటం, మాట్లాడే వారిని చులకనగా చూడకపోవటం!'' ఇది తెలిస్తే తెలుగుకొచ్చిన డోకా ఏం లేదు! తెలియనంత కాలం ఎన్ని దినోత్సవాలు జరుపుకున్నా కలిగే లాభమూ లేదు!