సినీ నటులకు రాజాకీయాలేలననగా...

 

సినీ నటులు రాజకీయాలలోకి ప్రవేశించడం కొత్తేమీ కాకపోయినా ఈసారి ఎన్నికలలో చాలా మంది నటులు ఏదో ఒక రాజకీయ పార్టీ పంచన చేరుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఏదో ఒక రాజకీయ పార్టీతో అంట కాగుతుంటే మిగిలిన వారు కూడా హడావుడిగా ఏదో ఒక పార్టీ జెండా దొరకబుచ్చుకొనేందుకు పరుగులు తీస్తున్నారు. బాబు మోహన్ తెదేపాకు గుడ్ బై చెప్పేసి తెరాసలో చేరిపోగా, మరో హాస్యనటుడు ఆలీ త్వరలోనే ఏదో ఒక పార్టీలో చేరి, రాజమండ్రీ నుండి పోటీ చేస్తానంటున్నారు. ఇక, పవన్ కళ్యాణ్ అయితే స్వయంగా ఓ రాజకీయ పార్టీ పెట్టుకొని నరేంద్రమోడీని కలిసి ఆయనకి తన మద్దతు తెలిపివచ్చారు. ఆ వెంటనే నాగార్జున, బ్రహ్మానందం కూడా నమో నమో అంటూ బీజేపీ చుట్టూ ప్రదక్షిణాలు మొదలుపెట్టేసారు. మోహన్ బాబు కూడా బీజేపీలో చేరవచ్చని తాజా సమాచారం. బహుశః త్వరలోనే మిగిలిన వారు కూడా ఏదో ఒక జెండా పట్టుకొని ప్రజల ముందుకు వస్తారేమో. గతంలో రాజకీయ పార్టీలు నటీ నటుల చుట్టూ తిరుగుతూ తమ పార్టీలో చేరమని లేదా కనీసం పార్టీకి ప్రచారం చేయమని కోరుతుండేవి. కానీ, అప్పుడు ఎవరూ అంత ఆసక్తి చూపేవారు కాదు. కానీ, ఇప్పుడు నటీనటులే స్వయంగా పార్టీలలో చేరుతాము, ప్రచారం చేస్తామంటూ రాజకీయనాయకుల, పార్టీల చుట్టూ తిరగడం గమనిస్తే దానివెనుక చాలా బలమయిన కారణం ఉందని అర్ధమవుతుంది.

 

సినీ నటులు రాజకీయ పార్టీల మద్దతు కోరుతున్నారంటే అందుకు చాలా కారణాలు ఉండవచ్చును. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే రాష్ట్ర విభజనతో ఎదురయ్యే సమస్యల నుండి తమను తమ ఆస్తులను కాపాడుకోవడానికే సినీ నటులు రాజకీయ పార్టీల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారని భావించవచ్చును. సినీ పరిశ్రమలో దాదాపు 75 శాతం ఆంధ్రావారి చేతిలోనే ఉంది. ఇప్పుడు విభజన తరువాత తెలుగు సినీ పరిశ్రమ అంతా తెలంగాణలోకి వెళ్లిపోయింది. తెలంగాణాలో కేసీఆర్ తమ కుటుంబమే రాజ్యం ఏలుతుందని స్వయంగా చెపుతున్నారు. గత పదేళ్ళ కాలంలో సినీ పరిశ్రమతో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఏవిధంగా ఆడుకోన్నారో అందరికీ తెలుసు. అటువంటిది ఇప్పుడు శాశ్వితంగా ఆయన కనుసన్నలలోనే సినీ పరిశ్రమ నడుచుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడితే వారు ఆందోళన చెందడం సహజమే.

 

సినీ పరిశ్రమ అంటేనే అంతా కోట్లతో వ్యవహారం. చాలా మంది నటీనటులు కోట్లలో ఆదాయం సంపాదిస్తూ, హైదరాబాదులో స్థలాలు, స్టూడియోలు, హోటల్స్ ఇతరత్రా వ్యాపారాలు, లావాదేవీలు కలిగి ఉన్నారు. ఈ నేపధ్యంలో తెలంగాణాలో తెరాస ప్రభుత్వం ఏర్పడి, దానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా, అయన కుటుంబ సభ్యులందరూ మంత్రులుగా బాధ్యతలు చేపడితే వారి దృష్టి మొట్టమొదటగా తమ మీదనే పడుతుందని సినీ పరిశ్రమలో ప్రతీ ఒక్కరూ ఆందోళన చెందడం సహజమే. ఈ సమస్య నుండి బయటపడాలంటే వారి ముందు రెండే రెండు మార్గాలున్నాయి. 1. హైదరాబాదులో ఉన్న తమ ఆస్తులన్నిటినీ అమ్ముకొని మళ్ళీ ఏ వైజాగ్ కో తరలిపోవడం. 2. రాజకీయ పార్టీల రక్షణ కవచం ఏర్పాటు చేసుకోవడం. ఇందులో మొదటిది దాదాపు అసాధ్యం కనుక బహుశః అందరూ రెండో ఆప్షన్ ఎంచుకొంటున్నారని భావించవచ్చును. లేకుంటే వారికి ఆ తరువాత కేసీఆర్ మరే ఆప్షన్స్ ఇవ్వకపోవచ్చును.